ఉగాది ప్రాశస్త్యం;-సి.హెచ్.ప్రతాప్
 యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు రూపం ఉగాది. తెలుగు, కన్నడ, మరాఠి మొదలగు ప్రాంతాలలో నూతన సంవత్సరం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాదితో ప్రారంభమవుతుంది.

కాలమానాన్ని గణించడానికి ఇది తొలిరోజు. శిశిరం తరువాత వసంతం వస్తుంది. వసంతాగమనంతో ప్రకృతి ఒక్కసారి పులకిస్తుంది. క్రొత్తదనాన్ని సంతరించుకుంటుంది. చెట్లు చిగుర్చి నూతన సృష్టి అంకురిస్తుంది. సర్వత్రా ఒక చైతన్యం అంతరంగములను కదలిస్తుంది. ప్రకేతి అంతా ఒక విధమైన చైతన్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ రోజును ఒక శుభదినంగా భావిస్తారు. ఉగాది ప్రాముఖ్యం: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు.
మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ కధనం.
బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.వసంత రుతువు కూడా అప్పుడు మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. శాలివాహనడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్తశ్యంలోకి వచ్చిందని మరొక గాథ.వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఈ రోజే.తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు, వైశాకీగానూ బెంగాలీలు పోయి ల బైశాఖ్‌గానూ జరుపుకుంటారు.

తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు.  
తలంటు స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి, దైవదర్శనం చేసుకొని, పెద్దల ఆశీస్సులు పొందాలి. గృహాలను, వ్యాపార, వాణిజ్య నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించుకోవాలి. దేవతార్చన, పంచాంగ పూజ జరపాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పించి భోజనం చేయాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్టిలో పాల్గొనడం ఆనవాయితీ. శ్రీరామ నవరాత్రులు ఉగాది నుంచే ప్రారంభమవుతాయి.
కామెంట్‌లు