వలచితి మాధవా!మదిని బాధలు పొంగెను నీదు రాకకై
నిలిచితి నుస్సురంచు నిను నిష్టురమాడుచు సందె వేళలో
కలతను దీర్పరావ!హరి!కన్నుల కాయలు కాయుచుండె నే
పిలిచితి దీననై వినుము!భీతిలు చుంటిని పొన్ననీడలో!//
సఖుడని నిన్ను తల్చితిని జాగును సేయుట పాడికాదు నీ
విముఖత యేమిటో!తెలుపవే!పసి దానను క్రుంగిపోతి నా
ముఖమును జూడలేవ? నను మోదముగా దరిజేరనీయవా?
సుఖముకు దూరమైతి నిక శోధనలేల? ముకుంద!చాలురా!//
కఱకుగ నన్ను దూరముగ కట్టితి వివ్విధి జామురాతిరిన్
బరుగున వచ్చియుంటి నెడ బాయని వాడవటంచు నమ్మికన్
మరచితి వేల? నా దరికి మక్కువ జూపుచు రమ్ము వేగమే!
సిరిదొర!నీదు కౌగిటను శీఘ్రముగా కరిగించవేలనో!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి