శ్రీ శిరిడీ సాయి లీలామృతం;-సి.హెచ్.ప్రతాప్
 పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని " ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు" అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా " అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే" అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు.ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు. అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి" ఊరుకో. నీ అతృతలను పారద్రోలుము. నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగమును తప్పక బాగు చేయును" అని ప్రేమపూర్వక పలుకులను పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది. అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలీ, వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు. క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు. కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు.రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ, మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు.
 

కామెంట్‌లు