సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -458
కుంభీ ధాన్య న్యాయము
*****
కుంభీ అనగా కుండ.కుంభీ ధాన్యుడు అనగా వ్యుత్పత్తి అర్థం కుండలో ధాన్యము పోసుకొనువాడు అనియు రూఢమైన శ్రోత్రియుడు అనియు అర్థములు గలవు.
కుంభీధాన్యునకు గోవు నీయవలయుననిన గౌణార్థమవు మొదటి వానికా లేక ముఖ్యార్థమవు  శ్రోత్రియునకా అనే శంక కలిగినప్పుడు గౌణ ముఖ్యార్థములలో ముఖ్యార్థమునే గ్రహించవలయునని పెద్దలచే నిశ్చయింపబడినది.
కుండలో  ధాన్యం పోసుకోవడం, కొలవడం చేసేది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది రైతులే.
పూర్వం ధాన్యం కొలవడానికి కుండను లేదా కుంచమును ఉపయోగించేవారు.
 ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ధాన్యం కొలిచే పాత్రలను గురించి చెప్పుకుందాం.
పండిన ధాన్యాన్ని కొలవడానికి 'కుండ లేదా కుంచం,మానిక,తవ్వ, సేరు,సోల ,మిద్దె మొదలైనవి ఉపయోగిస్తారు.
కుంభీధాన్యునకు గోవును ఇవ్వాలి అన్నప్పుడు ఒకటవ వ్యక్తి కుండలో ధాన్యం పోసుకునే వాడు అనే అర్థంతో చెప్పినప్పుడు అతడు ఖచ్చితంగా రైతే అయ్యుండాలి.ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లు రైతుల ఇళ్లల్లో మాత్రమే ఈ కొలిచే కుండలు, మిగతా  కొలతల వస్తువులు వుండేవి.
మరి రైతు అన్నాక అతనికి పాడి పంట వుంటుంది. పంట పొలాల్లో  పనుల కోసం,పాడి కోసం ఆవులు గేదెలు మొదలైన పశు సంపద తప్పకుండా రైతుల ఇళ్లల్లో వుంటుంది.కాబట్టి గౌణ, ముఖ్యార్థములలో గౌణార్థమైన కుంభీ ధాన్యుడిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం అవుతోంది.
ఇక రెండవ ముఖ్యార్థమైన శ్రోత్రియుడిని పరిగణనలోకి తీసుకోవాలి.
మరి శ్రోత్రియుడు అంటే ఎవరు ?కేవలం కులము చేతనా ?గుణము చేతనా? అనేది కూడా చూడాలి.
రాజుకు జన్మించిన వాడు ఎలాంటి వాడైనా రాజవుతాడేమో కానీ బ్రాహ్మణుడికి జన్మించిన వాడు బ్రాహ్మణుడు కాక పోవచ్చునని ధర్మశాస్త్రాలు, వేదాలు పురాణాలు, స్మృతులు,శృతులు చెప్పాయని  మన పెద్దలు అంటుంటారు.
ఎందుకంటే  బ్రహ్మన్ అంటే యజ్ఞం. యజ్ఞాలు చేసేవారు బ్రాహ్మణులు. అంతే కాదు బ్రహ్మ జ్ఞానం తెలిసిన వారు ఎవరైనా సరే వారు బ్రాహ్మణులు.వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, నియమాలు,నిష్ఠలు, ఆంక్షలు వుంటాయని పెద్దవాళ్ళు చెబుతుంటారు.
ఇక అసలు విషయానికి వస్తే ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలిసి,సమాజ హితైషిగా వుంటూ  పైన చెప్పిన విధంగా ప్రత్యేక లక్షణాలు కలిగి నియమ నిష్ఠలతో జీవితం కొనసాగిస్తూ వుంటారో వారే అసలైన శ్రోత్రియులు.వారికి గోవులను నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు.
 ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే  గోదానమా?భూదానమా? మరో దానమా ? ఏదైనా సరే యోగ్యుడైన వ్యక్తి అనగా దానం పొందటానికి అర్హుడైన వ్యక్తి ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా దానం పొందడానికి అర్హులు అనేది ఈ "కుంభీధాన్య న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
 మహా భాగవతంలో పోతనామాత్యుడు వామన చరిత్ర లో  దానం పొందే వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి వుండాలని అదెలా అంటే రైతుకు సారవంతమైన నేల, విత్తనాలు నీటి వసతి వాతావరణం ఎలా అనుకూలంగా వుండాలో అదే విధంగా  దాన గ్రహీత అన్ని అర్హతలు కలిగి వుండాలి. "నా దగ్గరకు వచ్చిన వాడు సామాన్యుడు కాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు.అతడికి దానం ఇచ్చే అవకాశం రావడమే నా అదృష్టం" అంటాడు.
అంటే దాతతో పాటు గ్రహీత కూడా యోగ్యత కలిగి వుండాలి.కాబట్టి మనం ఇచ్చినా,పుచ్చుకున్నా ఎలా వుండాలో ఈ న్యాయం ద్వారా తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు