సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-459
కుల కన్యా న్యాయము
     ****
కుల అంటే వంశము,తెగ, శరీరము, ఇల్లు, సమూహము.కన్యా అనగా కన్నె, బాలిక ,వివాహం కాని పడుచు, కూతురు, ఒకానొక రాశి, క్రొత్త, చిన్న, స్త్రీ అనే అర్థాలు ఉన్నాయి.
"కుల కన్యా  న్యాయము" అనగా ఆయా కులము,తెగ,వంశములో జన్మించిన పెళ్ళి కాని అమ్మాయి మంచి గుణాలతో ఒద్దిక, సత్ప్రవర్తన,అభిమాన ధనంతో ఉంటేనే పేరు, కీర్తి సంపాదించుకుంటుంది అని అర్థము.
"చిన్నప్పుడు వచ్చిన పేరు పెద్ద వయసులో వచ్చిన రోగం ఓ పట్టాన పోవని " పెద్దవాళ్ళు తరచూ అంటుండటం మనకు తెలిసిందే.
ఆడపిల్ల అనగానే వాళ్ళ నుండి ఒద్దిక,సహనము, త్యాగము సున్నితత్వము, సచ్ఛీలము,సంప్రదాయ బద్ధమైన నడవడిక, కుటుంబాన్ని చక్కదిద్దుకునే ఓర్పు, నేర్పు, చదువు, సంస్కారం... మొదలైన వాటిని తన నుండి ఆశిస్తుంటారు.
అలా వుండాలని సుమతీ శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా...
"మాటకు ప్రాణము సత్యము/కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్/బోటికి ప్రాణము మానము/ చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!"
ఈ ప్రపంచంలో మాటకు సత్యమే ప్రాణము.కోటకు ప్రాణము వంటి వారు వీరులైన సైనికులు.స్త్రీకి ప్రాణము వంటిది శీలమే.అలాగే చీటికి సంతకమే ప్రాణము.అనగా సంతకము లేని చీటి వ్యర్థము.పనికి రాదు అంటారు.
 నేటి యువతులు, స్త్రీలు ఏమంటారంటే  "స్త్రీలు,ఆడపిల్లలు, యువతులు ఇలా మానాభిమానాలతో వుండాలి అంటున్నారు.ఉండాలి  తప్పకుండా ఉంటాం.కానీ ఇది కేవలం మహిళలకేనా?  మగవారికి అక్కర్లేదా ?అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
 స్త్రీలకైనా పురుషుల కైనా మానాభిమానాలు, మంచి గుణాలు తప్పకుండా వుండాల్సిందే. అందులో మగవారికి మినహాయింపు ఏమీ వుండదని గ్రహించాలి.
 వేదాలలో కాంత,కన్యక అంటే స్త్రీ ఎలా వుండాలో చెప్పబడింది. అవి కూడా చూద్దాం.
ఋగ్వేదంలో 'ఓ స్త్రీ నీవు సామ్రాజ్ఞివై అందరినీ నడిపించు' అని,ఓ తెలివైన స్త్రీ! నీ ప్రకాశవంతమైన తెలివితో అజ్ఞానాన్ని తొలగించి అందరికీ ఆనందాన్ని అందిస్తుంది అని వుంది.
అధర్వణ వేదంలో "ఓ తెలివైన స్త్రీ! నువ్వు బండరాయిలా బలంగా, శక్తివంతంగా వుండు.సూర్యుని తేజస్సును పొంది అందరికీ మేలు చేసే సుదీర్ఘమైన, సుసంపన్నమైన జీవితాన్ని కలిగి వుండు" అని వుంది.
యజుర్వేదంలో "ఓ  స్త్రీ నీ సామర్థ్యాన్ని గ్రహించింది సమాజం.నేరస్థులను, అజ్ఞానాన్ని, దుర్గుణాలను నాశనం చేయగల సింహరాశివి.గొప్పవారిని రక్షించగలవు. "నువ్వు ఈ ప్రపంచానికి ఆనందాన్ని, స్థిరత్వాన్ని అందిస్తావు.నీవు శౌర్యానికి మూలం."
ఇలా  స్త్రీ ఎంత గొప్పదో, తాను ఏం చేయగలదో చెప్పడంతో పాటు ఆమెను గౌరవించాలని వేదాలు చెబుతున్నాయి.
కాబట్టి ఆడపిల్లలు, పడుచులు తమదైన వ్యక్తిత్వంతో వజ్రంలా కీర్తి ప్రతిష్టలు పొందాలని ఈ "కుల కన్యా న్యాయము"లోని ప్రధానమైన ఉద్దేశ్యం.
మరి వాళ్ళని ఎలా గౌరవించాలో కూడా వివరిస్తూ సుమతీ శతక కర్త  రాసిన మరో పద్యాన్ని చూద్దాం.
"కులకాంత తోడ నెప్పుడు/గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ/ కలకంఠి కంట కన్నీ/రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!"
అనగా  కులకాంత అనగా ఇక్కడ భార్య అనే అర్థంతో తీసుకున్నారు.భార్యతో ఎప్పుడూ గొడవపడవలదు.లేనిపోని నేరాలు ఆరోపించవద్దు.ఉత్తమ ఇల్లాలి యొక్క కంటనీరు క్రింద పడిన ఆ యింట్లో లక్ష్మి అనగా సిరి నిలవదని  చెప్పాడు
 ఇలా మహిళలను ఎంతో ఆత్మీయంగా, గౌరవంగా చూడాలని, వారితో సభ్యతగా ప్రవర్తించాలనేది సదా గుర్తుంచుకోవాలి.
 చట్టం ముందు అందరూ సమానమే అని గుర్తెరిగి మసలుకోవాలి.ఆడ మగ అనే వివక్ష లేకుండా స్త్రీకి, కులకాంతకు ఎలాంటి లక్షణాలు, గుణాలు ఉండాలని కోరుకుంటూ వున్నామో పురుషుడు కూడా అలాంటి సుగుణాలు కలిగి  కుల కన్య  లేదా కులకాంత కీర్తి ప్రతిష్టలు పొందేలా చూసినప్పుడు ఈ సమాజంలో  ఎక్కడా, ఎలాంటి అఘాయిత్యాలు, అన్యాయాలు జరగవు. శాశ్వతంగా రూపుమాసిపోతాయి.అందమైన లోకం ఆవిష్కృతం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు