సుప్రభాత కవిత ; - బృంద
లేత వెలుగుల ధారలతో
పోత పోసిన జిలుగులతో
కంటికింపుగ విరిసి కొమ్మల
హాయిగ ఊగే విరుల బృందాల
మదిలోని భావము ఏమో!

ప్రత్యూషమందే ప్రత్యేకంగా
ప్రకాశించే మల్లెలు మైమరపించే
సుగంధము వెదజల్లి
ప్రభాతసమయాన్ని ప్రభావితం
చేయాలని కోరిక దేనికో?

సాగునీటి వాగులోని 
చిన్ని చిన్ని అలలన్నీ
గలగలమంటూ నవ్వుతూ
కబుర్లెన్నో చెప్పుకుంటూ
సాగిపోయే తీరులోని
సందడేమిటో? సందేశమేమిటో?

నింగిలోని నీలమంత
కొంగులోన దాచుకుని
పరచుకుని పరవశించి
పాడుకుంటూ పులకరించే
నదీకన్య మదిలోని సొదలేమిటో?

నేలమీది వాగులూ
నింగిలోని మబ్బులూ
చెట్టు మీది పువ్వులూ
సూర్యకాంతి నవ్వులూ
ఆనందమే పరమావధిగా
అందంగా అమరిపోయి ఇచ్చే

స్వార్థం లేని సంతోషాలు
కల్మశం లేని సుగుణాలు
తరాల తరబడీ చూస్తున్నా
అర్థం చేసుకుని ఆచరించి
అందమైన ప్రకృతిని అనుసరిస్తూ
సాగించే జీవితం ధన్యమంటూ....

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు