త్రిగుణములు; -సి.హెచ్.ప్రతాప్
 సత్వ, రజో, తమో గుణాలను త్రిగుణములు అని అంటారు. ఈ మూడు గుణాలు ప్రతీ జీవిలో మిళితమై ఉంటాయి. మనలో ఏ ఒక్క గుణం స్థిరంగా ఉండదు. మనిషిని ఆశ్రయించిన ఈ మూడు గుణాలకు ‘మనస్సే’ ప్రధా న కారణం. ఆధార భూతం కూడా.మనిషి ప్రవర్తించే త్రిగుణాలు పూర్వజన్మ కర్మలవల్లనే స్పందింస్తుంటుంది. దీనికి కారణం మనస్సు పై నియంత్రణ లేకపోవడమేనని ఆధ్యాత్మిక వాదులు చెబుతారు.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునికి త్రిగుణాలు గురించి ఈ క్రింది శ్లోకం ద్వారా చక్కగా వివరించారు.
”సత్వ రజస్త మ ఇతి గుణా: ప్రకృతి సంభవా!
నిజద్నంతి మహాబాహోదేహ దేహన మవ్యయమ్‌!”
సత్వ—రజో—తమో—గుణములు ప్రకృతి వల్ల ఈ జీవా త్మను, దేహాన్ని బంధించడం వల్ల, మనిషి ఆ త్రిగుణాలులో బందీ అవుతున్నాడు. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు — సత్త్వము, రజస్సు, తమస్సు — నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను అని కూడా భగవానుడు స్పష్టంగా త్రిగుణాల ప్రాశస్థ్యం గురించి చెప్పాడు.ఈ మూడు గుణములలో సత్త్వగుణం నిర్మలమైనది. కనుక ప్రకాశవంతమైనది. వికార రహితమైనది. అయినప్పటికీ అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మానవుని బంధిస్తుంది.రజోగుణము రాగాత్మకమైనది. అది కామము, కోరికలు, ఆసక్తుల నుండి మాత్రమే ఉత్పత్తి చెందుతుంది. అది జీవాత్మను కర్మల యొక్క, కర్మ ఫలముల యొక్క సాంగత్యముతో బంధించుచున్నది. అదే ఈ భవ బంధాలన్నింటికీ మూల కారణము.తమోగుణము సకల దేహాభిమానులను మొహితులుగా, సమ్మోహితులుగా చేస్తుంది. అది అజ్ఞానము వలన జన్మిస్తుంది. అది జీవాత్మను ప్రమాద, ఆలస్య నిద్రాదులతో బంధిస్తుంది. అనర్ధకమైన ప్రాంచిక జీవనానికి అది పునాది వేస్తుంది.భక్తి ద్వారా త్రిగుణములు దాటవచ్చని చెప్పినా, ఆ భగవద్భక్తి ఉద్భవించడానికి కామక్రోధములతో నిండిన విషయములపై, విరక్తి లేక వైరాగ్యము రావాలి. అంటే సంసార విషయములు క్షణికములు అన్న భావన రావాలి. 

కామెంట్‌లు