సుప్రభాత కవిత ; -బృంద
గమనం సులభమయే దారి
గమ్యం చేరువ చేసే దారి
రమ్యపు సొగసులు నిండిన దారి
రమ్మని ప్రేమగా పిలిచేదారి.

కమ్మని ఊహలు కలలైతే
కన్నుల ముందర నిలబడితే
మిన్నుల తాకే ఆనందం
మనసును నిలవనిస్తుందా?

ఉత్సాహంగా ఉరకలువేసి
కొత్త బలమేదో కణకణాన
మెత్తగ మొత్తం పరచుకుని
అడుగులకు వడి పెరగదా??

మది వెదికే మధుర ప్రదేశం
ఇదే అని హృదయం తెలుపగా
కథ మారిన పయనం మనదై
వెతలన్నీ మాయం అవవా??

ఆశల సంచీ మోస్తూ 
అడుగులు ఆచీ తూచీ వేస్తూ
సాగే బ్రతుకును పండుగ చేస్తూ
ఆకాశమే ఆదరించే గొడుగవదా?

మౌనాలన్నీ ముద్దుమాటలై
మధురభావాల సుమమాలలై
మురిపించే మువ్వల సవ్వడులై
ప్రేమగా పలకరించే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు