సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-462
కుల్యా ప్రణయన న్యాయము
******
కుల్యా అనగా కాలువ, కుటుంబం లేక వంశంతో సత్సంబంధం కలిగిన వాడు.ప్రణయన అనగా తెచ్చుట,రచించుట,కొనిపోవుట,అనుష్ఠించుట అనే అర్థాలు ఉన్నాయి.
పంటలు పండించడానికి పొలములకు నీళ్ళు పారించడానికి  కాలువలు త్రవ్వి  నీటి వసతి ఏర్పాటు చేయడం.అలా ఏర్పాటు చేయబడిన కాలువ నీరు అటు పొలానికి ,ఇటు తాగడానికి ఉపయోగ పడుతుంది అనే అర్థంతో ఈ "కుల్యా ప్రణయన న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలా చేయడంలో పుణ్యం,పురుషార్థం రెండూ కలుగుతాయి.మంచి పనులు చేయడం వల్ల పుణ్యము,సత్ శాస్త్రాలలోని ఉపదేశాలను,ఉపాయాలను అనుసరించి మనసును నడపడమే పురుషార్థము.
 విషయానికి వస్తే ఒకప్పుడు రైతు బిడ్డలు రైతులుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వుండేవారు. రాన్రానూ కష్టం, నష్టంతో కూడి లాభసాటి లేని వ్యవసాయాన్ని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.చాలా మంది నీడపట్టున వుండే ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారు.
అటువంటి సమయంలో రైతుగా బాధ్యతను తీసుకున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పుణ్యాత్ముడే.తన పని ద్వారా ఎందరికో అన్నదాత అవుతున్నాడు.అలా తాను చేసిన మంచిపని ఎందరికో ఉపయోగపడుతుంది.
ఇలా ఒక మంచి ఆలోచనతో, ఆశయంతో మొదలు పెట్టిన పని అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందనేది ఇందులోని అంతరార్థం.
 అలాగే ఏ పనినైనా చేయడానికి తప్పకుండా సానుకూల దృక్పథం కలిగి వుండాలి.అలాంటప్పుడే చేసే పనుల్లో విజయం శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా వివిధ ప్రయోజనాలు చేకూరుతాయి.
 ఈ సందర్భంగా ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాత,ఇంజనీరు ఐన ఝసర్ ఆర్థర్ కాటన్ గురించి చెప్పుకుందాం.
ధవళేశ్వరం ఆనకట్టను సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట అని కూడా అంటారు.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట ఇది.దీని వల్ల పరీవాహక ప్రాంతంలోని పొలాలన్నీ పచ్చని పైరుతో కళకళలాడినవి.
ఆ దృశ్యం చూడటానికి ఓ రోజు సర్ ఆర్థర్ కాటన్ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో  కపిలేశ్వరపురం ప్రజలు, పండితులు గోదావరి నదిలో స్నానం చేసి  సూర్య నమస్కారంతో సంకల్పం చెప్పుకుంటూ కాటన్ దొర పేరును ప్రస్తావించడం కాటన్ దొర విన్నాడట.
వెంటనే పడవలో తనతో పాటు ఉన్న గుమాస్తాను వాళ్ళ దైవ నామస్మరణలో నా పేరు వినిపించింది.అలాంటి పేరు వారి దేవుళ్ళలో వున్నాడా? అడిగి తెలుసుకొమ్మని పంపాడట.
అప్పుడు ఆ గుమాస్తా వెళ్ళి వారిని కనుక్కున్నప్పుడు చెప్పిన మాట ' కాటన్ దొర అనే గొప్ప ఇంజనీర్ చలువ వల్లే ఈ రోజు కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఒకప్పుడు పంట పొలాల సంగతేమో కానీ తాగునీటికే అలమటించి పోయాం.కాటన్ దొర పుణ్యమా అని నేడు అటు సేద్యం,ఇటు పాద్యం దేనికి కొదువ లేదు.అందుకే ఆయనను దైవ సమానంగా సంకల్పంలో చెప్పుకుంటున్నాం అన్నారట. ఆ మాటలు విన్న కాటన్ దొర వారి గౌరవ భావానికి, కృతజ్ఞతకు ఆశ్చర్య పోయాడట.
ఆ విధంగా కాటన్ దొర గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట వలన నీరు కాలువల ద్వారా ప్రవహించి స్నాన పానాదులకూ, ప్రజల ఆకలి తీర్చే పంట పొలాలకు ఉపయోగపడిందన్న మాట.
ఇలా ఒక మంచి పని అనేక మంచి పనులకి కారణభూతమైనప్పుడు ఇలా "కుల్యా ప్రణయన న్యాయము"తో పోల్చి చెబుతుంటారు.
మనమూ మంచి పనులు చేద్దాం.తద్వారా నలుగురికి నాలుగు రకాలుగా ఉపయోగపడేలా చూద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు