చెప్పలేని కలతలేవో
మనసు నిండా దాచి
మౌనమే నీ తోడుగా
సాగిపోయే ప్రవాహమా!
చెప్పవమ్మా నిన్ను కాల్చే
నిప్పులన్నవి ఉన్నవా?
నింగి నుండి జారిపడ్డ
నాటినుండీ నీ పయనం
కొండవాలున మొదలై
బండలన్నీ దాటుకుంటూ
నేలకురిసిన ధారవై
మెండు నీటిని కలుపుకుని
నిండు నదిలా కదిలిపోతూ...
ఎత్తుపల్లాలు దాటుకుంటూ
పల్లె పల్లెనూ పలకరిస్తూ
పంట చేలకు సహకరిస్తూ
వెంట వచ్చే కాలువలకు
స్నేహ హస్తం అందిస్తూ
జీవజాలపు అవసరాలకు
అహర్నిశమూ ముందుంటూ..
తోడులేని వేదనలూ
వీడిపోని వాదనలూ
గూడు చెదిరిన కథలూ
మోడై మిగిలిన బ్రతుకులూ
ఎన్ని వేదనలో నీ ఒడ్డున
అన్నీ కలుపుకుని నిశ్శబ్దంగా....
నీ కనులముందు జరుగుతున్న
అక్రమాలకు మూగసాక్షిగ
నీ దరి చేరిన చెత్త అయినా
విత్తమైనా మొత్తంగా నీలో కలిపేసుకుని మోసుకొస్తూ...
నిన్ను చూసే కోరికతో
కన్ను తెరచి చూస్తున్న
చిన్ని పువ్వుల నవ్వు చూసి
కలతలన్నీ మరచిపోయి
నీకంటూ రూపం లేక
కడలిలో కలిసిపోయే
నీ కోరిక తీరేలోగా......
నన్ను చూసి పలకరించి
చల్లగా సేద దీర్చి
నా లోని మౌనంతో
చేయికలిపి ఓదార్చి
వస్తున్న ఉషోదయం
తెస్తున్న తాయిలమేదో
చిన్నగ నా చెవిలో
చెప్పేసి పోరాదా??
వేచి వున్న వేకువ కోసం
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి