సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -474
ఖరాశ్వ న్యాయము
   ******
ఖరము అంటే గాడిద.అశ్వము అంటే గుర్రము.
చూడగా చూడగా గుర్రం గాడిద అయినట్లు 
అనగా గుర్రమేమో వేగానికి, హోదాకు గుర్తు."కోరికలే గుఱ్ఱాలైతే" అని కోరికలను గుర్రాలతో పోలుస్తారు. "గుఱ్ఱం ఎగరావచ్చు" అంటుంటారు. ఇలా మనస్సులోని  కోరికలు,ఆశల వేగానికి గుర్రాన్ని పోల్చి చెబుతారు.
 రాజులకు,మహా రాజులకు జాతి గుర్రాలు వుండేవి.అవి తమ యజమాని మనోభావాలను కూడా అర్థం చేసుకునేవి. రాజులు ఉపయోగించిన గుర్రాలు యుద్ధంలో పాల్గొన్న సమయంలో సందర్భోచితంగా ప్రవర్తించేవని చదువుకున్నాం.
మరి గుర్రానికి సంబంధించిన వివరాలను మరికొన్ని తెలుసుకుందాం.
గుర్రం భూమి మీద వేగంగా పరుగెత్తే జంతువుల్లో ఒకటి.బండ్లు,రథాలు నడపడానికి గుర్రాలను ఉపయోగిస్తారు. మానవుడు సుమారుగా 4500 సంవత్సరాల క్రితం నుండే గుర్రాలను మచ్చిక చేసుకొని వాటి సేవలను ఉపయోగించుకున్నాడని చరిత్ర చెబుతోంది.
వేదాలు ఉపనిషత్తులు పురాణాలు, మహా భారతం వంటి సంస్కృత సాహిత్యంలో గుర్రానికి సంబంధించిన దేవుడి గురించి వుంది.అతడే హయగ్రీవుడు అంటే వెలిగించిన గుర్రపు తల గలవాడు అని అర్థము. హయ అంటే గుర్రము.గ్రీవము అంటే మెడ లేదా తల.ఇతడు జ్ఞానానికి అత్యున్నతమైన ప్రభువుగా, శక్తి, తెలివి తేటలు మరియు వేగానికి, స్వేచ్ఛకు ప్రతీకగా పూజింపబడ్డాడు.
ఇక గాడిద గురించి కూడా నాలుగు విషయాలు తెలుసుకుందాం.
గాడిద లేదా గాడిదె కూడా గుర్రం లాంటి జంతువే. ఇది కూడా గుర్రంలా పెంపుడు జంతువు.దీనిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. గాడిద ఎంతో బరువును మోస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సంచార జీవులు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉపయోగించుకునే నిత్యావసర వస్తువులు, సామగ్రిని గాడిదలపై వేసి మోయించుకుని వెళ్తుంటారు.చాకిరేవు దగ్గర బట్టలు ఉతికే వారు తాము తెచ్చిన బట్టల మూటలను మోయడానికి గాడిదలను ఉపయోగించడం పల్లె ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది.
 గాడిద ఎక్కువగా చాకిరీ అనగా మనుషులకు సేవ చేస్తుంది కాబట్టి గాడిద చేసే సేవను, బరువైన లేక విసుగు పుట్టే చాకిరిని "గాడిద చాకిరి" అనడం పరిపాటి .
 గాడిదలు  మనుషులు మచ్చిక చేసుకొంటే చక్కగా మచ్చికయ్యే జంతువులు. తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో దృఢమైన బంధాలను పెంచుకుంటాయి.మానవుల పట్ల స్నేహంగా ఉండటమే కాకుండా విధేయతను కలిగి, ఆజ్ఞలను అనుసరించే తెలివైన జంతువులు.ప్రతిరోజూ యజమానులతో  కలిసి పనులు చేస్తూ వుంటాయి. వీటిని కొంచెం ప్రేమగా చూస్తే భక్తితో తమ ఒంట్లో ఉన్న శక్తినంతా వెచ్చించి  సేవ చేస్తాయి.
మానవజాతి చరిత్ర మలుపు తిరగడానికి గాడిదలు కూడా కారణం అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఇలా గాడిద, గుర్రం రెండూ పెంపుడు జంతువులే. మానవులకు ఉపయోగపడేవే.
అయినా గుర్రానికి ఇచ్చే గౌరవం గాడిదకు లేదు. "అడ్డ గాడిద"లా ఎదిగావు? ఏం లాభం అని చీవాట్లు వేస్తూ వుంటారు.
 ఎవరిమీదనైనా  బాగా కోపం వచ్చినప్పుడు గాడిద కొడకు/ కొడుకా అని తిడుతుంటారు. విషయం ఏమీ లేదు అంతా కట్టుకధ అని చెప్పడానికి "గాడిద గుడ్డు" అనే పదబంధాన్ని ఉపయోగిస్తారు. "వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని" వ్యంగ్యంగా చెబుతుంటారు.
గుర్రానికి ఇచ్చిన విలువ గానీ, గౌరవం గానీ పాపం గాడిదకు అస్సలు ఇవ్వరు.  రెంటినీ పోల్చినప్పుడు" గాడిద గాడిదే", గుర్రం గుర్రమే అని గాడిదను కించపరుస్తూ మాట్లాడుతారు.
ఇక అసలు విషయానికి వద్దాం.
గుర్రం తన అస్తిత్వాన్ని మరిచిపోయి అంటే తన శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలు, వేగము, స్వేచ్ఛ మరిచిపోయి గాడిదలా చాకిరీ చేయడానికి అలవాటు పడినప్పుడు "చూడగా చూడగా గుర్రం గాడిద అయ్యిందే" అని వ్యంగ్యంగా  అంటుంటారు.
మరి ఈ మాటలు  విని గుర్రం, గాడిద ఏమైనా బాధ పడే అవకాశం ఉందా? అంత లోతుగా అవి ఆలోచిస్తాయని మనమైతే అనుకోం.
మరెందుకిలా ?  కొంచెం ఆలోచిస్తే ఈ మాటలు, పోలికలు అన్నీ మనుషులకేనని ఇట్టే అర్థమవుతుంది కదండీ!
అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని అంటుంటారు. గుర్రం చేసే పనులు గాడిదకు చేతగావు.కానీ గుర్రంతో గాడిద చేసే పనులు కొంత వరకైనా చేయించుకోవచ్చు.కానీ అలా చేయించుకుంటే గుర్రాన్ని అవమానించిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా చేసే వ్యక్తులను ఉద్దేశించి ముఖం మీద అనుకుండా ఇలా "చూడగా చూడగా గుర్రం గాడిద అయినట్లు" అనే సామెతతో చురకలు వేస్తుంటారన్నమాట.
 
మరి ఈ "ఖరాశ్వ న్యాయము" ద్వారా  "ఎంత గాడిద చాకిరీ చేసినా మంచిదే కానీ,గుర్రం పొందే గౌరవం, దాని తెలివి తేటలు, శక్తి సామర్థ్యాలు, స్వేచ్ఛా రూపమైన ఆత్మాభిమానం మాత్రం మనం  ఎట్టిపరిస్థితుల్లోనూ మరవొద్దనేది" తెలుసుకోవాలి.అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు