జ్ఞాపకం ఉన్నదా...? ;- ఏడుకొండలు ఈతకోట ఇస్రో విశ్రాంతి ఉద్యోగి-సూళ్లూరుపేట
కుసుమ ధర్మన్న కళాపీఠం 
-----------------------------------
మగతనంతో మీసం మేలేస్తూ విర్రవీగే ఓ మగాడా

తొమ్మిది మాసాలు
నా గర్భంలో తలదాచుకున్న సంగతి గుర్తుందా..

నా రక్తాన్ని క్షీరంలా తాగి కడుపు నింపుకున్న సంగతి
గుర్తుందా...

నేను ఊదిన ఊపిరి నర నరాలలో నింపుకొని బ్రతుకుతున్న సంగతి గుర్తుందా...

తడబడు అడుగులతో బిత్తర చూపులు చూస్తున్న నిన్ను నిలకడగా నిలబెట్టిన సంగతి గుర్తుందా....

ఆకలి అంటే నా కడుపు మాడ్చుకొని నీ కడుపు నింపిన నీ తల్లిని గుర్తుందా...

అన్నా అంటూ అనురాగాన్ని పంచిన నీ అందాల చెల్లిని గుర్తుందా...

నువ్వు సంపాదించే చాలీచాలని వేడి నీళ్లకు
సాయంగా కష్టపడి చన్నీళ్లు చేర్చిన నీ అర్ధాంగిని గుర్తుందా...

నీ జీవితంలో అడుగుడిన నాటి నుంచి నీకు అన్ని విధాలా తోడున్న నీ సహ ధర్మచారిణిని గుర్తుందా...

మీ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక నాలో నేనే కన్నీళ్లను దిగమింగిన నీ జీవిత భాగస్వామిని గుర్తుందా...

నువ్వు పది కాలాలు జీవించాలని నీకన్నా ముందే మరణించాలని ఆశపడి నిస్వార్ధ జీవిని
గుర్తుందా...

మాపై మీకెందుకు చిన్న చూపు రాజా
ఓ మగ మహారాజా

"మహిళా నీకు వందనం" అంటూ
మహిళా దినోత్సవం నాడు జరిపే సంబరాలు మాకొద్దు

మీతో సమానంగా కలిసి బ్రతకనిచ్చే సంస్కారవంతులుగా ఉండండి చాలు

మహిళకు విలువనిచ్చి
మహిలో మాకు కూడా
సగ భాగం ఇవ్వండి
మహిని కాపాడండి



కామెంట్‌లు