సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -472
ఖండిత శాఖా న్యాయము
    *****
ఖండిత అనగా ముక్కలు చేయబడిన,తెగగొట్టబడిన,త్రోసిపుచ్చబడిన.శాఖా అనగా కొమ్మ అని అర్థము.
కొమ్మను నరికినప్పటికి మళ్ళీ చిగురిస్తుంది. మనసు విరిగినా మళ్ళీ ఆశతో చిగురిస్తుందని అర్థము.
 ఎవరైనా చెట్టు కొమ్మను నరికితే దానికి బాధ కలుగుతుంది కాని అది జీవిస్తుంది.మళ్ళీ మనుగడ కోసం ప్రయత్నం చేస్తుంది. వేళ్ళూనుకున్న బతకాలనే ఆశ చెట్టును చిగురింప జేస్తుంది.
మనిషిలోని ఆశ కూడా అంతే.మొదలంటా మానసికంగా కృంగదీసి నానా హింసలు పెట్టి నరికినా భవిష్యత్తు  మీద  ఉండే ఓ పరమాణువు అంత  ఆశ చావకుండా బతికేలా  మనిషి చెట్టును చిగురించేలా చేస్తుంది.
అందుకేనేమో  అన్నీ కోల్పోయిన మనిషి కూడా చెట్టులా మనుగడ సాగిస్తూనే వుంటాడు.
మనిషి- చెట్టు, చెట్టు- మనిషి,.. ఒకసారి ఇలా  పోల్చి చూద్దాం.
చెట్టుకు మనిషికి బలమైన సంబంధమే వుంది. చెట్టు  మానవుడు కొన్ని ఒకేరకమైన లక్షణాలు కలిగి వున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఊపిరి తిత్తులలోని సన్నని గొట్టాల వంటి నాళాల ద్వారా దేహమంతటికీ శాఖలుగా విస్తరించిన మూల వ్యవస్థ ఉన్నట్లే, చెట్టు మూల వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది.
 చెట్లు ఇలా దేహ సంబంధమైన పోలికే కాదు ఆధ్యాత్మిక సంబంధమైన పోలిక కూడా ఉంది.అనేక పురాణాలలో, మతాలలో, సంప్రదాయాలలో చెట్టును మనిషి జీవితానికి చిహ్నంగా భావిస్తారు.
"చెట్టంత మనిషి","చెట్టులా ఎదిగిపోయాడు", మానూ మాకును కాను, గురువు తరువు...ఇలా చెట్టుతో మనిషిని  పోలుస్తూ చెప్పే జాతీయాలు, సామెతలు చాలానే ఉన్నాయి.
వృక్ష శాస్త్రవేత్తలు ఏమంటారంటే చెట్లలో కూడా మనిషిలో ఉన్నట్లు పంచభూతాలు కొలువై వున్నాయి.మనిషి వలెనే వినడం, చూడటం, రసం,స్పర్శ దృష్టి అనే ఐదు ఇంద్రియాలకు సంబంధించినవి ఉన్నాయని అంటారు.
ధ్వనికి సంబంధించి చూస్తే ఉరుములు,పిడుగుల శబ్దాలకు చెట్టుకు ఉన్న పువ్వులు, కాయలు, పండ్లు రాలిపడటం.దృష్టికి సంబంధించి గమనిస్తే ఏదైనా తీగ తన దగ్గరలో ఉన్న ఆధారాన్ని గమనించి దానిపైకి పాకడం.ముట్టుకుంటే ముడుచుకు పోవడం.చీడపీడలు సోకినప్పుడు అనారోగ్యంతో బాధపడటం. తగ్గిన తర్వాత కొత్త చిగుళ్లతో నవనవ లాడటం. పెరగడం జీవితం తరగడం.మరణం లాంటి లక్షణాలు ఎన్నో మనిషిని పోలి ఉన్నాయి.
 ఇలా  చెట్టు లాంటి మనిషైతే త్యాగధనుడై జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు.మనిషి  లాంటి చెట్టైతే తాను చక చక ఎదుగుతాడు.మనిషిలా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నిలువునా నరికితే మోడైన జీవితాన్ని మళ్ళీ చిగుర్చుకోవాలని తపిస్తాడు.
కాబట్టే మన పెద్దలు "ఖండిత శాఖా న్యాయము" తో మానవుణ్ణి పోల్చి చెబుతుంటారు.
చెట్టుకైనా, మనిషికైనా ఆశనే బతికిస్తుంది.ఆశనే ఎదిగేలా చేస్తుంది.ఐతే చెట్టు మళ్ళీ చిగురించేది మాత్రం తన కోసం కాదు.సమస్త జీవుల కోసమే ప్రాణ వాయువు,నీడ,పూలు పండ్లు మొదలైనవి ఇవ్వడానికే.మనుషులమైన మనమూ చెట్టులా జీవించాలి.
ఎదుటి వారు మనసును ముక్కలు ముక్కలుగా ఖండించినా చెట్టులా క్షమిస్తూ పరోపకారియై జీవితం గడపాలని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు