సునంద భాషితం- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు -503
చక్షుశ్రవణ న్యాయము
      *****
చక్షు అనగా కన్ను,చూచు, పరిశీలించు. శ్రవణ అనగా చెవి.
 పాము వింటే చూడలేదు.చూస్తే వినలేదు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
మరి పాముల గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం.
 పాములు లేదా సర్పాలు పొడవుగా, పొలుసులు కలిగి,కాళ్ళు లేని భూచరాలైన సరీ సృపాలు. కళ్ళు ఉంటాయి .కానీ కనురెప్పలు కదలలేవు.
అయితే కొన్ని పాములు గుడ్డివి కూడా ఉంటాయట.అవి వేటినీ చూడలేవు.కాంతిని కూడా పసిగట్టలేవట.
పాముల జాతిలో అలాంటివి కొన్ని ఉన్నాయని తెలుసుకున్నారు.
ఇక పాము చెవుల విషయానికి వస్తే మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు కొందరివి "పాము చెవులు ఎంత చిన్నగా మాట్లాడుకున్నా వినబడుతుంటాయి "అని విసుక్కోవడం, అలాంటి వారిని చూసి తాము గుసగుసగా అనుకున్న మాటలు వాళ్ళకు  ఎక్కడ వినబడ్డాయో ఏమోనని భయపడటం జరుగుతూ ఉంటుంది.
 మరి నిజంగా పాముకు చెవులు వుంటాయా? అది వినగలదా?  అంటే పాములను గురించి పరిశీలించిన శాస్త్రజ్ఞులు చెప్పింది ఏమిటో చూద్దాం.
పాముకు కర్ణభేరి వుండదు. బాహ్య చెవులు వుండవు.. కేవలం లోపలి చెవులు మాత్రమే ఉంటాయి. ఆ అంతర్ చెవుల నిర్మాణాల సహాయంతో గాలిలో గల ప్రకంపనలు దవడల సహాయంతో గ్రహించడం ద్వారా అతి సూక్ష్మమైన శబ్దాలను కూడా వినగలవు అంటారు.
అలాగే పాములు రెండు వినికిడి వ్యవస్థలను కలిగి ఉన్నాయని అమెరికా మరియు జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందట. మనకు లాగా వాటికి చెవులు లేకున్నా వాటి దవడ ఎముక దగ్గర లోపలి చెవిలోని  అంతర్ భాగము బాగా అభివృద్ధి చెంది,అది దవడ ఎముకకు ఆనుకొని వుంటుందిట.
అలా చెవులు బయటికి కనబడకపోయినా  లోపల వుంటాయని మనకు కొంత అర్థమైపోయింది కదా.
 ఇలా పాములలో కళ్ళు కనబడనివి, చెవులు బయటికి కనిపించనివి ఉంటాయని మనకు తెలిసిపోయింది. అయితే కళ్ళతో చూసినప్పుడు చెవులు వినబడక పోవడం, చెవులతో విన్నప్పుడు కళ్ళు కనబడక పోవడం మాత్రం ఇంతవరకు  అలా వాటికి జరుగుతుందనేది ఎపరూ చెప్పలేదు.
కానీ మన వాళ్ళకు నమ్మకాలు,మూడ నమ్మకాలు  చాలా ఎక్కువ కాబట్టి పాముల పట్ల రకరకాల అభిప్రాయాలు అపోహలు వ్యక్తం చేస్తుంటారు.
 పాము పగ పడుతుందని అంటారు. కానీ అందులో నిజం లేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు.అలాగే మరో ఆసక్తికరమైన నమ్మకం ఏమిటంటే గర్భిణీ స్త్రీల జోలికి పాములు పోవట. వాళ్ళను కరవవట.ఇది మంచి విషయమే కానీ నిజమా కాదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
మరి వాటికి గర్భిణీ స్త్రీలని ఎలా తెలుస్తుంది? అనే ప్రశ్నకు వాటికి ప్రత్యేకమైన ఇంద్రియ శక్తి వుందట.వాటి ద్వారా తెలుకోగలవనీ బ్రహ్మ వైవర్త పురాణంలో వీటికి సంబంధించిన అనేక విషయాలు, ఋజువులు ఉన్నాయని అంటారు. ఒక గర్భిణీ స్త్రీ శివుని గురించి ఘోర తపస్సు చేస్తున్న సమయంలో రెండు పాములు ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో  ఆమె మీద పాకుతూ బుసలు కొడుతూ చివరికి ఆమె తపస్సు భంగం చేశాయట. ఆ కోపంతో ఆ గర్భిణీ స్త్రీ ఆ పాముల వంశానికి మొత్తంగా ఎవరైతే గర్భిణీ స్త్రీల జోలికి వెళ్ళినా వారిని చూసినా కళ్ళు పోతాయని అన్నదట. అలా గర్భిణీ స్త్రీల జోలికి పోవని అంటారు.
 ఇలా పాములు కొన్ని వినలేవనీ చూడలేవనీ అంటారు.
ఏది ఏమైనా పాములు వినలేవనేదీ నిజం కాదు.చూడలేవనేది నిజం కాదని తెలిసింది.
 మన పెద్దవాళ్ళు ఏ న్యాయము చెప్పినా అందులో ఏదో ఒక అంతరార్థం దాగి వుంటుంది.
ఇక్కడ పాము లాంటి మనిషి గురించి చెప్పుకుందాం.పాము లాంటి మనిషికి అహంకారం గర్వంతో కళ్ళు మూసుకుపోతాయి,ఎవరి మంచి మాటలూ చెవికి ఎక్కవని అంటారు.నిజమే కదా!పామంటేనే దుష్టత్వానికి చిహ్నం అంటారు.అలాంటి పాముల కాట్ల వల్ల ఎందరో చనిపోతూ ఉన్నారు.
 మహా భారతంలో జనమేజయుడు సర్పయాగం చేస్తాడు.అతడి వుద్దేశ్యం పాములన్నింటినీ చంపేయడమే... అలా చేయడం వెనుక ఒక కారణం కూడా ఉంది.
  "చక్షుశ్రవణ న్యాయము" ద్వారా  పాములు ఏమో కానీ కొంతమంది మనుష్యులలో అహం  పెరిగి కళ్ళు నెత్తికెక్కి కనబడక పోవడాన్ని చూస్తుంటాం..అలాగే మరికొందరికి గర్వం తలకెక్కి ఎవరి మాటలు వినబడవు.అంటే వినిపించుకోరు, దృష్టి పెట్ఠరు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు.
 అలాంటి వారిని పాముల్లానే చూస్తారు.దూరం పెడతారు అనేది అర్థం చేసుకొని మనలో ఏమూలో అలాంటి లక్షణాలు వుంటే  వెంటనే వదిలించుకోవాలి. అంతే కదండీ.


కామెంట్‌లు