శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు 
===============
51.
భ్రాంతి నొందితి నీమీద భక్తిలేక 
పాప బుద్ధిని విడువక పట్టుకొంటి 
దారి తప్పిన నామీద దయను జూపి 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//
52.
 ఇహము పరమునె ఱింగింప నీశ్వరుడవు 
కఱకు హృదయము నాదని కనలబోకు!
తప్పుజేసితిని విధించి దండనంబు 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
53.
దృష్టి దోషము తోడనే దీననైతి 
మంచి చెడులను దెలియని మందమతిని 
కనులు మూసి నే దిరిగితి కరుణ జూపి 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//
54.
జీవు డేరీతి చరియించు సృష్టి లోన 
తెలియ జెప్పవే వివరము తేట పఱచి 
పరము చూపవే నాకింత బలము కలుగ 
నన్నుఁ బాలింపు మాల్యాద్రి నారసింహ!//
55.
సురలు సిద్దులు యోగులు శుభము గోరి 
చేర వచ్చిరి నీచెంత జెప్ప తరమె?
భాగ్యమేమి జేసిరిట నీ బ్రాపుబడయ?
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు