నాన్న...;- ప్రమోద్ ఆవంచ -013272452

 నాన్న.
అనే కఠిన పదం..పలకడానికే వెన్ను పూసలోనుంచి వణుకు మొదలవుతుంది.తప్పు చేస్తే ఏం చేస్తాడోనన్న భయం,అమ్మ కొంగు చాటున దాచుకున్నా గుండె లబ్ డబ్ అని కొట్టుకునే శబ్దాలు చెవిలో దడ పుట్టిస్తాయి.నాన్న ఒక పట్టాన అర్థం కాడు.కానీ మనల్ని ఆసాంతం చదివే శక్తి ఆయనకు ఉంటుంది.బయట పరేషాన్లతో వచ్చే నాన్నకు కోపం వస్తుంది అది సహజం.అక్కడ అమ్మ కలగజేసుకుంటుంది.
అమ్మ కొంగు లోపల పొట్ట మీద మన తలను పెట్టుకొని 
దాచుకుంటే,పాపం తిట్లన్నీ అమ్మకే.కానీ నాన్నకు కూడా 
ప్రేమ ఉంటుంది.చిత్తూరు జిల్లాకు చెందిన కవి సురేంద్ర రొడ్డ తాను రాసిన నాన్న పచ్చి అబద్ధాల కోరు అనే కవితలో  నాన్న మన కోసం చేసే త్యాగాలను చాలా హృద్యంగా వర్ణించారు.ఆ కవిత చదివితే మనకు కళ్ళల్లో 
నీళ్ళు తిరుగుతాయి.అరకొర జీతాలు ఉన్నా ఎప్పుడూ 
మన గురించే ఆలోచిస్తూ, మనకు మంచి సౌకర్యాలను 
అందించేందుకు నాన్న పడే తంటాలు కేవలం ఆయనకే 
తెలుసు.ఆయన అంతరంగం అమ్మకు కొంత మాత్రమే తెలుసు.తెలిసిన ఆ కొంతను నిజమే అని నమ్మి దానికి ఇంకొంచెం తన ఊహను జోడించి అదే నిజమని, మనల్ని ఊరడిస్తుంది.పాత రోజుల్లో నాన్న పని చేయాలి,
అమ్మ వంట వుండాలి...అనే పద్ధతి ఉండేది.నాన్న ఏదో పని చేయాలి సాయంత్రానికో,వారానికో,నెలకో డబ్బులు 
సంపాదించాలి,ఆ సంపాదించిన సొమ్మును అమ్మ పొదుపుగా వాడాలి.సంసారం బయట పడకుండా జాగ్రత్త 
పడాలి.అంతే కాకుండా  అమ్మా నాన్నల మద్య ఎన్నో వాదోపవాదాలు, మరెన్నో  మనస్పర్దలు, గొడవలు మాట్లాడకపోవడాలు...
ఇలా రోజూ జరుగుతూనే ఉంటాయి,అవన్నీ తాత్కాలికం
అందరి ఇంట్లో అవి సహజం.కానీ నాన్న బయట ఎన్ని కష్టాలు ఉన్నా తన పిల్లలను ప్రాణంగా చూసుకుంటాడు.
పిల్లల అవసరాలను తీర్చేందుకు తాపత్రయ పడతాడు..
పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అహర్నిశలూ 
కష్టపడుతూనే ఉంటాడు.అందుకే చిన్నప్పుడు నాన్నంటే భయం, ప్రేమ,రెండూ కలిసిన అనుభూతి ఉంటుంది,
మనం పెద్దయ్యాక నాన్న ఒక స్నేహితుడిగా,ఒక మార్గదర్శకుడిగా మన వెనక ఉండి నడిపిస్తాడు.....
నాన్న జ్ఞాపకాలు మనసు తలుపు వాకిట నిరంతరం తచ్చాడుతూనే ఉంటాయి.ఆయన గుండె లోతుల్లోని కంటి తడిని స్పర్శిస్తే ఏదో తెలియని అలజడి,
గుబులు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.నాన్న ఆలోచనలు వస్తే గుండె వేగంగా స్పందిస్తుంది,అంతే వేగంగా ఒక కన్నీటి పొర కళ్ళను మసకబారుస్తుంది.నాన్న
జీవితం కరిగిపోయే కొవ్వొత్తి.తాను కష్టపడుతూ పిల్లల 
కళ్ళల్లో వెలుగులు నింపుతాడు.అంతగా మా గురించి అహర్నిశలూ కష్ట పడి మమ్మల్ని పెంచి,పోషించి, విద్యాబుద్ధులు నేర్పించిన ఆయనకు మేం ఏం చేసి రుణం 
తీర్చుకోగలం,అంత చేసిన ఆయనకు ఏం తిరిగి ఇవ్వగలం.ఒకవేళ మేం తిరిగి ఇవ్వాలనుకున్నా తీసుకోవడానికి ఆయన ఏడి? ఎక్కడ ఉన్నాడు.......
ఈ  ప్రశ్నలు గుండెను తొలుస్తూ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఒంటరిగా కన్నీరు పెడుతుంది....
కట్ చేస్తే.....
                     రెండు నెలల క్రితం మా పెద్దక్క చిన్న కూతురు ఇండియాకు వచ్చిన సందర్భంలో మేం నలుగురం (మంజు, కాంతి, మాధవి ప్రమోద్) ఒక గెట్ టు గెదర్ ప్రోగ్రాంలో కలిసాం. ఈ సారి నాన్నారి జయంతి వేడుకలను ఆయన పుట్టిన ఊర్లో,ఆయన పని చేసిన స్కూల్లో,చేయాలనీ అనుకున్నాం.అందరూ చదువుకోవాన్నది,ఆయన కల.బాగా చదివే విద్యార్థులు 
అంటే చాలా ఇష్టం.ఆర్దికంగా వెనకబడిన విద్యార్థుల
చదువు విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు ఆయనకు ఉన్న దాంట్లో ఆర్థిక సహాయం కూడా చేసేవాడు.అందుకే,ఈ సంవత్సరం నుండి ప్రతి ఏడాది పదవ తరగతి పరిక్షలలో  మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేయాలని మేం నలుగురం నిర్ణయించుకున్నాం....
అదీ మా ఊరు చర్లపల్లి స్కూలు పిల్లలకు.నాన్న జూన్ 
పదకొండు, పందొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో చర్లపల్లిలో జన్మించారు.ఆ తరువాత 
యాభైవ దశకంలో చర్లపల్లిలోనే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసాడు.ఆ తరువాత రోజుల్లో మా ఊరి పక్కన ఉన్న ఎల్లారెడ్డి గూడెం లో పనిచేసారు.తర్వాత శివన్నగుడెం,హాలియా దగ్గర ఒక ఊర్లో పని చేసి,నల్గొండ 
జేబిఎస్ స్కూలు, అక్కడ అప్పట్లో మల్టీ పర్పస్ స్కూలుకి 
వచ్చాడు.దాంట్లో కొంత కాలం పని చేసాక,ఆ తరువాత మాన్యంచెలక స్కూలులో ఉర్దూ మీడియం విద్యార్థులకు పాఠాలు బోధించేవాడు.నాన్నారు ఎక్కువ కాలం పని చేసిన పాఠశాలలు రామగిరి హై స్కూల్,బొట్టుగుడ హైస్కూల్.ఈ రెండు స్కూళ్ళల్లో నాన్నారు  వందల మంది విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించారు.చివరగా 
పందొమ్మిది వందల ఎనభై ఆరులో బొట్టుగుడ స్కూలు 
నుంచి పదవీ విరమణ చేశాడు.ఆ తరువాత ఆంధ్ర 
సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నడిచే ఓరియెంటల్ 
కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేసారు.ఆయన బాల సాహిత్యం మీద  పుస్తకాలు రాసారు.ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల నుంచి తెలుగులోకి ఆయన ఎన్నో అనువాదాలు చేశాడు.పదవీ విరమణ తర్వాత ఆయన 
వ్యాపకం కేవలం చదవడమే.చదువుకుంటూ గంటలు 
గంటలు గడిపేవాడు.తన ఎనభై ఆరవ ఏట,అంటే 
రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆయన పరమాత్మలో లీనం అయ్యాడు....కట్ చేస్తే...
             ప్రస్తుతం చర్లపల్లి స్కూలుకి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా,అరుందతి గారు ఉన్నారు.ఆమె నల్గొండ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్.మేడం చాలా బిజీగా ఉంటారు.మిత్రుడు కరుణాకర్ సహాయంతో మేడం నెంబర్ తీసుకొని ఫోన్ చేసాను.మా నాన్న గారి జయంతి 
సంధర్భంగా ఆయన స్మారకార్ధం పదవ తరగతిలో ప్రతిభ చాటిన విధ్యార్థులకు నగదు పురస్కారాలు ఇవ్వాలనుకుంటున్నాం, దానికి మీ అనుమతి కావాలని 
రిక్వెస్ట్ చేసాను.ఆమె వెంటనే ఒప్పుకున్నారు.కానీ జూన్ 
పదకొండు స్కూలుకి సెలవు కాబట్టి పన్నెండు రోజు మీ 
కార్యక్రమాన్ని పెట్టుకోండి,ఆ రోజు స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి అందరు టీచర్లు, విధ్యార్థులు ఉంటారని చెప్పింది.జూన్ పన్నెండు.... డేట్ ఫిక్స్ అయ్యింది.అందుబాటులో పిల్లలు,పెద్దలం అందరం రెండు కార్లల్లో మా ఊరికి వెళ్ళాం.ఆ రోజే స్కూల్స్ రీఓపెన్ కాబట్టి పిల్లలను ఆహ్వానించేందుకు స్కూలును 
అందంగా అలంకరించారు.క్లాసు రూములలో,అందమైన 
బెలూన్లను అమర్చారు.హైస్కూలులో పదిహేను మంది,
ప్రైమరీ స్కూల్ లో ఏడుగురు మొత్తం కలిపి ఇరవై రెండు 
మంది టీచర్లు.ఆ రోజే మొదటి రోజు కావడంతో పిల్లలు 
కూడా ఇచ్చు మిచ్చుగా అంతకన్నా కొంచెం ఎక్కువగా వచ్చారు.అరుందతి మేడం స్వాగతోపన్యాసం తరువాత మా పెద్దక్క మంజుల మాట్లాడింది.మా పెద్దక్క తన డిగ్రీ 
పూర్తయ్యాక ఊర్లో ఇంగ్లీషు మీడియం స్కూల్ నడిపింది.
అప్పట్లో మా ఊర్లో మొదటి ప్రైవేటు స్కూల్ నడిపింది 
బహుశా మేమే అనుకుంటా.ఆ తరువాత రోజుల్లో మా అన్నయ్య క్రాంతి మన ఊరి స్కూలులో అనియత విధ్యా
కేంద్ర రాత్రి పాఠశాలను కూడా నడిపాడు.క్రాంతి సాయంత్రం కాలేజీ నుండి రాగానే, ఇంట్లోనే కందీలు వెలిగించుకొని, స్కూలుకి వెళ్ళేవాడు.మా నాన్న దగ్గర ట్యూషన్ చదువుకోవడానికి పిట్టంపల్లి,బాదెగూడెం,
మర్రిగుడెం ఊర్ల నుంచి వచ్చేవారు.ఇంగ్లీష్ సబ్జెక్టు అప్పట్లో చాలా టఫ్ గా ఉండేది.ముఖ్యంగా గ్రామర్ ఒక
పట్టాన అర్థం అయ్యేది కాదు.మా ఇంటి ముందు 
విశాలమైన అరుగు, సాయంత్రం కాగానే ఆ అరుగు మీద రెండు, మూడు చాపలు పరిచి ఉండేది.అక్కడే పిల్లలందరూ కూర్చునే వాళ్ళు.చర్లపల్లి ఊరి పిల్లలు కూడా సాయంత్రాలు ట్యూషన్ కి వచ్చే వాళ్ళు.
మా పెద్దక్క, చిన్నక్క కలిసి చదువు చెపుతుంటే చూసిన 
జ్ఞాపకం.కరెంట్ లేని రోజులు,చదువులన్నీ కందిళ్ళు,
ఎక్కాలు,దీపం ప్రమిదల వెలుగులోనే సాగేవి....
                 పెద్దక్క ఉపన్యాసం తరువాత మా చిన్నక్క 
మాధవి ఇచ్చిన స్పీచ్ ఆ మొత్తం కార్యక్రమానికే హైలైట్.
అంత అద్భుతంగా మాట్లాడింది.నేను రాయడం కన్నా 
ఆమె స్పీచ్ వీడియోను ఈ పోస్ట్ లోనే పెడతాను.నాకు 
స్టేజ్ ఫియర్ ఎక్కువ.పబ్లిక్ మీటింగులలో మాట్లాడాలంటే 
భయం.ఎంతో ప్రిపేర్ అయి పోతాను.తీరా అందరినీ చూసాకా మైండ్ బ్లాక్ అవుతుంది.ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగింది.అందరి ఉపన్యాసాల తర్వాత 
బహుమతి ప్రదానం చేసాం.టీచర్లకు,మా ఊరి మిత్రులకు 
అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం.భోజనాలు అయ్యాక అందరం హైదరాబాద్ దారి పట్టాం....
                       స్కూలులో ఈ కార్యక్రమానికి ముందు 
చర్లపల్లి గ్రామంలో నల్లవాగు దగ్గర కొత్తగా కడుతున్న 
అయ్యప్ప స్వామి దేవాలయానికి,మిత్రుడు విద్యాసాగర్
ఆహ్వానంపై వెళ్లి,దర్శనం చేసుకుని గుడి నిర్మాణానికి నాన్నగారు,అమ్మగారి పేరు మీద మా శక్తి మేరకు కొంత 
విరాళాన్ని ఇచ్చాం....
                                

కామెంట్‌లు