వానదేవుడు... గాలిదేవుడు... అగ్నిదేవుడు- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో రంగయ్యని ఒకడుండేటోడు. వానికి చిన్నప్పుడే వాళ్ళ నాయన చచ్చిపోయినాడు. వాళ్ళమ్మ చానా మంచిది. తాను తిన్నా తినకపోయినా కొడుక్కి మాత్రం కడుపు నిండా పెట్టేది. ప్రేమగా చూసుకొనేది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో కష్టం చేసి సంపాదించిన సొమ్ముతో కొడుకుని పెంచి పెద్ద చేసింది.
పెద్దగైనాక పెండ్లి సేయాల గదా... వెదికీ వెదికీ ఆఖరికి ఒక ఊర్లో ఒక అందమైన పిల్లుంటే తెచ్చి చేసింది. ఆమె చూడ్డానికి పైకి అందంగుంటాదే గానీ లోపల మాత్రం విషం. చానా చెడ్డది. పెండ్లయిన నాలుగు నెల్లకే అత్త మీద మొగునికి వున్నవీ లేనివీ చెప్పి మనసు విరిచేసింది. దాంతో వాడు రోజూ వాళ్ళమ్మను తిట్టేటోడు, కొట్టేటోడు. పాపం... ఆమె ఏమీ చేయలేక లోపల్లోపల బాధపడతా వుండేది.
ఒకరోజు రాత్రి ఆ పెండ్లాం, మొగుడూ ఇద్దరూ ఆమెను తీస్కోనిపోయి మట్టసంగా అడవిలో వదిలేసి రావాలని అనుకున్నారు. వాడు పొద్దుగాలనే లేచి పెండ్లాం చేసిచ్చిన రొట్టె, పప్పు మూటగట్టుకోని వాళ్ళమ్మ దగ్గరికి పోయి "అమా! అమా! పక్కూర్లో పెద్ద తిరణాల జరుగుతా వుందంట. చూసొద్దాం పా" అన్నాడు. “అబ్బ నా కొడుకు మారిపోయినట్టున్నాడు'' అనుకోని ఆమె సంబరంగా కొడుకు వెంట బయలుదేరింది. అట్లా వాళ్ళిద్దరూ పోతాపోతా ఒక పెద్ద అడవి మధ్యకి చేరుకున్నారు.
వాడు వాళ్ళమ్మతో “అమా! అమా! నడిచీ నడిచీ కాళ్ళు నొప్పి పెడ్తా వున్నాయి. కాసేపు కూచో. ఇక్కడెక్కడైనా నీళ్ళుంటే పట్టుకోనొస్తా. తిని మళ్ళా పోదాం" అన్నాడు. ఆమె సరేనని ఒక చెట్టు కింద కూచోనింది. వాడు మట్టసంగా ఆమెనక్కడే వదిలేసి వెనుదిరిగి చూడకుండా ఎల్లిపోయినాడు.
ఆమెకు కొడుకు విడిచిపెట్టి పోయినేది తెలీదుగదా. దాంతో "అయ్యో పాపం! నా కొడుకు అడవిలో యాడ దారి తప్పిపోయినాడో ఏమో" అని అంతా వెదకసాగింది. కాసేపటికి చీకటి పడింది. ఆమె చెట్టు కింద కూచోని కొడుకు జాడ తెలీక కొడుకుకి ఏమైందో ఏమో అని వెక్కివెక్కి ఏడవసాగింది.
ఆకాశంలో పోతావున్న అగ్నిదేవుడు, వానదేవుడు, గాలిదేవుడు ఆమెను చూసి, “అరెరే పాపం! ఆ ముసల్దానికెంత కష్టమొచ్చిందో ఏమో, కనుక్కుందాం పా" అని మనుషుల రూపంలో కిందికి దిగి ఆమె దగ్గరికొచ్చి.
"అవ్వా అవ్వా ఎందుకే అట్లా ఏడుస్తా వున్నావ్. ఏంది నీ బాధ" అనడిగినారు. దానికా ముసల్ది కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడుస్తా "ఏముంది నాయనా... నా బిడ్డ నన్నిక్కడ పెట్టి నీళ్ళు తెస్తానని పోయినాడు. ఇంత రాత్రయినా ఇంకా రాలేదు. పాపం బిడ్డ దారి తెలీక ఎంత విలవిలలాడుతున్నాడో ఏమో" అనింది ఏడుస్తా.
దానికి వాళ్ళు "అట్లాగా, మేము మూడు ప్రశ్నలడుగుతాం. దాండ్లకుగాని సమాధానం చెప్పినావనుకో... నిన్ను నీ కొడుకు దగ్గరికి చేరుస్తాం" అన్నారు. ముసల్ది "సరే" అనింది.
మొదట అగ్నిదేవుడు "అవ్వా! అవ్వా! అగ్నిదేవుని గురించి నీవేమనుకుంటా వున్నావ్'' అనడిగినాడు. దానికామె "అయ్యో నాయనా! అగ్నిదేవుడే లేకపోతే ఎట్లా చెప్పు. ఆ దేవుని దయ వల్లనే గదా మేమింత వంట చేసుకోని తింటా వున్నాం. రాత్రిపూట చీకట్లో ఇంత దీపం పెట్టుకోని చూడగలుగుతా వున్నాం" అనింది.
అంతలో వానదేవుడు ముందుకొచ్చి "సరేగానీ, మరి వానదేవుని గురించి ఏమనుకుంటా వున్నావ్" అనడిగినాడు. దానికామె “అయ్యో నాయనా! వానదేవుడు లేకపోతే పంటలెట్లా పండుతాయి. మా నోటికాడికి కూడెట్లా వస్తాది. ఆ దేవుని దయ వల్లనే గదా కడుపు నిండా ఇంత తిండి తింటా వున్నది" అనింది.
అప్పుడు గాలిదేవుడు ముందుకొచ్చి "సరేగానీ, మరి గాలిదేవుని గురించి ఏమనుకుంటా వున్నావ్'' అనడిగినాడు. దానికామె "అయ్యో నాయనా! గాలిదేవుడే లేకపోతే అసలు మనుషులు, పశువులు ఏమి పీల్చి బదుకుతారు. ఆ దేవుని దయ వల్లనే గదా మేమంతా హాయిగా, ఆనందంగా చల్లని గాలిలో సేద తీరుతా వుండేది" అనింది.
వాళ్ళు ముగ్గురూ ఆ మాటలకు బాగా ముచ్చటపడి ఆమెను పదహారేళ్ళ పడుచుపిల్లని చేసి, ఒంటి నిండా బంగారునగలు తొడిగి, మోయలేనంత బంగారమిచ్చి "పోమ్మా... పోయి హాయిగా ఎవరి మీదా ఆధారపడకుండా
నీ బదుకు నీవు బదుకుపో... నీ కొడుకూ, కోడలూ నీవనుకున్నట్లు మంచోళ్ళు గాదు" అంటూ జరిగిందంతా చెప్పి పంపిచ్చినారు. ఆమె సంబరంగా అవన్నీ తెచ్చుకోని ఒక పెద్దమేడ కట్టుకోని హాయిగా బదకసాగింది...
అత్త వైభోగం చూసిన కోడలు ఒక రోజు అత్త దగ్గరికి పోయి “అత్తా! అత్తా! ఏదో బుద్ది గడ్డి తిని పొరపాటు చేసినాను. నన్ను క్షమించు” అంటూ దొంగ ఏడుపు ఏడ్చి “అవ్ అత్తా! అసలిదంతా నీకెట్లా వచ్చింది" అనడిగింది. అత్త జరిగిందంతా చెప్పింది. అట్లాగా అని ఆమె వురుక్కుంటా మొగుని దగ్గరికి పోయి, అంతా చెప్పి "రేపు నన్ను గూడా తీస్కోని పోయి మీ అమ్మను యాడైతే విడిచిపెట్టినావో ఆన్నే విడిచిపెట్టు" అనింది. వాడు సరేనన్నాడు.
తరువాత రోజు ఆమె పప్పు, రొట్టె మూటగట్టుకోని అడవికి పోయింది. వాడు వాళ్ళమ్మను విడిచి పెట్టిన చోటు చూపించినాడు. ఆమె సరేనని ఆడ కూచోని రొట్టె పప్పు బాగా తిని "సరే వాళ్ళు రాకముందే నువ్వు పోయి యాడైనా దాచి పెట్టుకోపో" అనింది. వాడు పోయి దూరంగా వున్న ఒక పెద్ద రాయి వెనుక దాచి పెట్టుకున్నాడు.
కాసేపటికి చీకటి పడింది. వెంటనే ఆమె "అయ్యయ్యో! నా మొగుడు నన్నిడిచి పెట్టి యాడ తప్పిపోయినాడో... ఏమో..." అంటూ గుండెలు బాదుకుంటా కిందా మీదా పడి దొంగేడుపు ఏడ్వసాగింది.
ఆకాశంలో పోతా వున్న గాలిదేవుడు, అగ్నిదేవుడు, వానదేవుడు ఆమెను చూసి “అరెరే పాపం! ఆమెకు ఎంత కష్టమొచ్చిందో ఏమో... కనుక్కుందాం పా" అని మనుషుల రూపంలో కిందకు దిగి, ఆమె దగ్గరకొచ్చి "అమా! అమా! ఎందుకట్లా పొర్లి పొర్లి ఏడుస్తా వున్నావ్. ఏంది నీ బాధ" అనడిగినారు. దానికామె కళ్ళెమ్మట సరసరసర నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏముంది సామీ! నా మొగుడు నన్నిక్కడ విడిచిపెట్టి నీళ్ళు తెస్తానని పోయినాడు. ఇంత రాత్రయినా ఇంకా రాలేదు. పాపం! దారి తెలీక ఎంత విలవిలలాడుతున్నాడో ఏమో" అనింది.
దానికి వాళ్ళు "సరేగానీ మేము మూడు ప్రశ్నలడుగుతాం. దాండ్లకుగాని సమాధానం చెప్పినావనుకో... నిన్ను నీ మొగుని దగ్గరికి చేరుస్తాం సరేనా" అన్నారు. ఆమె 'సరే' అనింది.
మొదట అగ్నిదేవుడు ముందుకొచ్చి "అమా! అమా! నీకు అగ్నిదేవుని గురించి తెలుసుగదా. ఆయన గురించి ఏమనుకుంటా వున్నావ్" అనడిగినాడు. దానికామె “ఎవడూ... అగ్నిదేవుడా! వాని మీద బండ పడ.
రొట్టెలు చేస్తా వున్నప్పుడు, అన్నం దించేటప్పుడు సుర్రుమని చేతికి తగుల్తా ఒకటే సతాయిస్తా వుంటాడు. దొంగ సచ్చినోడు" అనింది మెటికలిరుస్తా. అగ్నిదేవునికి ఆ మాటలింటానే సర్రుమని ఒళ్ళు మండిపోయింది.
అంతలో వానదేవుడు ముందుకొచ్చి “అది సరే గానీ, మరి వానదేవుని గురించి ఏమనుకుంటా వున్నావ్" అనడిగినాడు. దానికామె కోపంగా “ఎవడూ... వానదేవుడా! వాని మీద బండపడ...
రాత్రి మిద్దె మీద హాయిగా పన్నుకోనుంటే చెప్పాపెట్టకుండా వచ్చి కొట్టి కొట్టి లేపుతాడు. రోడ్డు మీదంతా బురద బురద చేస్తాడు. దొంగ సచ్చినోడు" అనింది. ఆ మాటలింటానే వానదేవునికి ఒళ్ళు సలసలసల మండిపోయింది.
అంతలో గాలిదేవుడు ముందుకొచ్చి "సరే! సరే! అగ్నిదేవుడు, వానదేవుడు సంగతి వదిలెయ్! ఇంతకూ గాలిదేవుని గురించి ఏమనుకుంటా వున్నావో చెప్పు" అనడిగినాడు. దానికామె కోపంగా "ఎవడూ... గాలిదేవుడా! వాని మీద బండపడ... ఊల్లో యాడాడి దుమ్మునంతా ఎత్తుకోనొచ్చి ఇండ్లంతా సల్లుతా వుంటాడు. మాటి మాటికీ కసువు నూకలేక సస్తా వున్నా" అనింది. అంతే... ముగ్గురూ భగభగ మండిపోయినారు. దీనికి బాగా ఒళ్ళు కొవ్వెక్కినట్టుంది. అందుకే కన్నుమిన్ను గానక మనల్నిట్లా తిడతా వుంది. దీనికి బాగా బుద్ది చెప్పాల'' అనుకోని ఆమెను, ఆమె మొగున్ని గాడిదలని చేసి అన్నించి తన్ని తరిమేసినారు.
***********

కామెంట్‌లు