నీలోఫర్ ;-- యామిజాల జగదీశ్
 నీలోఫర్ హనీం సుల్తాన్, రాయల్ ఒట్టోమన్ యువరాణి. ఈమె 1916 జనవరి 4న ఇస్తాంబుల్‌లోని గోజ్‌టేప్ ప్యాలెస్‌లో జన్మించారు. ఆమె అందమైన పేరు నీలోఫర్. పర్షియన్ భాషలో నీలోఫర్ అంటే "తామర పువ్వు" అని అర్థం. ఆమె దామద్ మొరలిజాడే సెలాహెద్దీన్ అలీ బే కుమార్తె. సుల్తాన్ మురాద్ - V  ప్రియమైన సంతానం అయిన ఆదిలే సుల్తాన్ మనవరాలు. ఆమె  రెండేళ్ళ వయస్సులో  తండ్రిని కోల్పోయారు.
1924లో, ఒట్టోమన్ సుల్తానేట్ రద్దయి రాజకుటుంబాన్ని బహిష్కరించనప్పుడు, నీలోఫర్ తన తల్లితో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లి నీస్ నగరంలో నివసించారు.  తరువాత, ఆమె హైదరాబాద్ చివరి నిజాం రెండవ కుమారుడు మోజమ్ జాను వివాహం చేసుకున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఆమె ప్రసిద్ది.  ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేశారు. హైదరాబాద్ వాసులు ఆమెకు "కోహినూర్ ఆఫ్ హైదరాబాద్" అనే బిరుదు ఇచ్చారు.
ఆమె పేరిట హైజరాబాదులో ఒక ఆస్పత్రి ఉంది. తల్లీ బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో 1953లో 100 పడకల ఆసుపత్రిగా ఏర్పడిన ఈ ఆస్పత్రి ప్రస్తుతం  అధునాతన ప్రసూతి, పీడియాట్రిక్, పీడియాట్రిక్ సర్జరీతో 1200 పడకల కేంద్రంగా మారింది. ఒక ఇన్‌స్టిట్యూట్‌గా వైద్య గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు ఇది వేదిక. ఈ సంస్థకు చెందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను నిరూపించుకున్నారు. అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ, గణనీయమైన సంఖ్యలో క్లిష్టమైన కేసులను నిర్వహించే ఘనత ఈ ఆసుపత్రికి ఉంది. 
నేడు నీలోఫర్ హాస్పిటల్ ప్రసూతి, పీడియాట్రిక్స్, నియోనాటాలజీ, మెటర్నల్ ఫీటల్ మెడిసిన్ కోసం క్వాటర్నరీ కేర్ హాస్పిటల్. అధ్యాపకులలో అధునాతన శిక్షణతో ఆసియాలోనే అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటిగా ఇది విలసిల్లుతోంది.

కామెంట్‌లు