'శంభో!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 కందములు.
21.
శిరియాళును బ్రోచితివట
వరముగ సాయుజ్య మిచ్చి పశుపతి నాధా !
కరుణింపర! యీ దాసిని 
నిరతము సేవలు సలిపెద నిష్ఠగ శంభో !//

22
స్థిరముగ నమక చమకములు 
నిరతము జపియించు రుద్రు నిష్ఠను జూడన్
మురిపెముగా దిగి వచ్చిన 
హర !నిను గాంచి భజియింతు హాళిగ శంభో !//
23.
మేరునగంబును విల్లుగ 
నారాయణుడే శరముగ నయముగ నీవే 
వీరుడి వై త్రిపురములను 
నీఱుగ మార్చిన నిను మదిని దలఁతు శంభో !//
24.
పరిమళములు వెదజల్లెడు 
విరిమాలలు దెచ్చి కొల్తు వినయము తోడన్ 
బరిమార్చ రార !యఘముల 
దరియించెడి దారి జూపి దయగొని శంభో !//
25.
 గురుతెఱుగని బాల్యము నన్ 
బరిహాసము జేసితి నిను బసిదాననయా !
పరికించితి నీ ముదిమిన 
బరిహారము తోడ గొలుతు బ్రణతుల శంభో !//

కామెంట్‌లు