సునంద భాషితం;- వురిమళ్ల సునంద, న్యూజెర్సీ అమెరికా

 న్యాయాలు -521
జలాగ్ని న్యాయము
    ******
జలః అంటే నీరు ఉదకము.అగ్ని అంటే నిప్పు, అగ్ని దేవుడు అనే అర్థాలు ఉన్నాయి.
అగ్ని మరియు నీరు కలిసినప్పుడు  వాటిలో ఏది తక్కువ అయితే అది హరించి పోతుంది అనీ,ఏది ఎక్కువ అయితే అది మిగులుతుందని అర్థము.
 నీరూ, నిప్పు కలిసినట్లు, నిప్పుకు సంబంధించిన పదార్థాలు ఉంటాయే కానీ రెండూ కలవవు. నీరు నిప్పుకు సంబంధించి వేడిగా మారొచ్చు కానీ మంటగా మాత్రం కలవవు.శత్రుత్వంలాగే వుంటాయి.కలిసినప్పుడు ఒకదాన్ని మరొకటి హరించే ప్రయత్నం చేస్తుంది.కాబట్టి ఇందులో దేనిదో ఒకదానిది పై చేయి ఉంటుందనీ.ఒకరి అంతం చూసేదాకా మరొకటి వదలదని అర్థం చేసుకోవచ్చు.
ముందుగా నీరు విషయానికి వస్తే నిప్పును ఆర్పాలంటే తప్పకుండా నీరు కావాలి. నిప్పును ఆర్పగలిగేంత నీరు ఉంటేనే నిప్పు కన్నా నీరు తన ఆధిపత్యాన్ని బలంగా చూపగలదు.నిప్పును హరించి వేయగలదు.అలా నీటిని  నిప్పులపై చల్లితే బొగ్గుగా, బూడిదగా మారడం మనకు తెలిసిందే.
అలాగే నిప్పు విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఎగిసిపడే మంటల్లో ఎన్ని నీళ్ళు పోసినా ఆవిరి అయి పోతాయి.కానీ ఒకోసారి మంటలను ఆర్పలేని పరిస్థితి కూడా ఉంటుంది.ఉదాహరణ అడవుల్లో ఏర్పడే కార్చిచ్చు.అడవులు తగలబడి పోతున్నప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా, నీళ్ళు గుమ్మరించినా మంటలను ఆర్పలేని సంఘటనలు మనం పత్రికల్లో అప్పుడప్పుడూ చదువుతూనే ఉంటాం.
భగభగ మండే నిప్పులాంటి వేడిలో సముద్రాలూ,జలాశయాల నీరు ఆవిరైపోవడం, బావులు చెరువులు కుంటలు వాగులు వంకలు ఎండిపోయి నెర్రెలు వారడం మనకు తెలుసు.ఇదంతా నిప్పుకు సంబంధించిన వేడిమే.అంటే ఇక్కడ పరోక్షంగా నిప్పుదే పైచేయిగా చెప్పుకోవచ్చు.

మరి  ఇలాంటి "జలాగ్ని న్యాయాన్ని" మన పెద్దవాళ్ళు ఎందుకు మనుషులకు వర్తింపజేసి చెప్పారో చూద్దాం.
దీనిని ఆధిపత్య భావజాలానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు, కుటుంబం,సమాజములోని మంచీ చెడులనే మానవ మనస్తత్వాలకు కూడా దీనిని అన్వయించవచ్చు.
ఆధిపత్యం గురించి చెప్పాలంటే ఆలూమగలలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ  రెండు రకాల మనస్తత్వాల వారు, వర్గాల వారు వుంటారు.వారిలో ఒకరిది,ఒక వర్గం వారిది ఒకసారి పై చేయి అవుతుంది.మరోసారి ఇంకొకరిది అవుతుంది అవి మాటల విషయంలోనూ,సమస్యా పరిష్కార విషయంలోనూ,అధికారం చెలాయించడంలోనూ కావచ్చు.ఇలా రెండూ రకాల మనస్తత్వాలు సమయానుకూలతను బట్టి ఆధిపత్యం అనేది మారుతూ వుంటుందనేది వివిధ సందర్భాల్లో మనం గమనించవచ్చు.
 ఇక నీరూ, నిప్పులకు గుణాలను ఆపాదిస్తే నీటిని మంచితనానికి చిహ్నంగా భావించవచ్చు. నీటిలా మేలు చేసేవారు, ప్రాణాధారంగా ఉపయోగ పడేవారు కొందరుంటారు.
ఇక  నిప్పులాంటి మనస్తత్వం చెడుకు  ప్రతీకగా చెప్పుకోవచ్చు. మాటల్లో ,చేతల్లో నిప్పులు కురిపించే వారు కొందరు వ్యక్తులు ఉంటారు.అలాంటి వారితో  ప్రమాదమే మరి.ఎవరితోనూ సరిగా వుండక భగ్గుమని మండిపడుతూ బంధాలు, అనుబంధాల మధ్య నిప్పు పెట్టి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు.
నిప్పుకు ఇంకో మంచి కోణం కూడా వుందండోయ్.నిప్పులా ఎలాంటి ప్రభావాల చెదలు పట్టకుండా, వేటికీ నీరు కారి పోకుండా జ్వలించే జ్యోతిలా ఉండటం.
 ఇలా ఈ "జలాగ్ని న్యాయము"లోని  అంతరార్థం ఏమిటో గ్రహించాం కదా! దీనిని బట్టి మనం ఎలా వుండాలో,ఎలా ఉండకూడదో తెలుసుకున్నాం. మరి నీరా? నిప్పా? రెండూ కలిపి సమయానుకూలంగా ఎలా ఉండాలో ఎవరికి వారే తేల్చుకోవాలి. నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు