సుప్రభాత కవిత ; -బృంద
నిన్నటి కలతలు తీర్చే
కన్నుల నీటిని తుడిచే
వన్నెలు కోటిగా నింపే
చిన్నెల కాంతులు విరిసి

కుదురు లేని  కష్టాలతో
ఎదురీదిన గతాలన్నీ
నిదురలేని రాత్రులలో
మధించిన యోచనలన్నీ..

గుండెను పిండే ఘటనలూ
మండిన ఎదల మంటలూ
ఎండిన ఆశల పొదలూ
నిండిన నిరాశల నీడలూ....

రాయిగ మారిన మనసులూ
వేయిగ కమ్మిన చీకట్లూ
మోయక తప్పని బరువులూ
కాయగ లేని తప్పులూ....

కాలం చేసిన గాయాలు
గాలం వేసిన మాయలు
వేలం వేయబడ్డ విలువలూ
పాలబడ్డ ప్రారబ్దాలు ....

అన్నిటినీ మరిపిస్తూ
అందరినీ అలరిస్తూ
అంతటా ప్రసరిస్తూ
అరుదెంచే వేకువను ఆహ్వానిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు