సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -525
జలూకా న్యాయము
   *****
జలూకా అంటే, జెనిగె, జలగ,జల సర్పిని,జలాత్మిక,రక్తపాత అనే పేర్లు ఉన్నాయి. ఇది ఇతర జంతువుల దేహమును పట్టుకొని వాటి రక్తమును పీల్చి త్రాగే జీవి. జంతువుల రక్తాన్ని పీల్చుకొని నీళ్ళలోనే జీవించు పరాన్న జీవి.ఇంగ్లీష్ లో దీనిని లీచ్ అంటారు.
జలగను పాలిచ్చే స్త్రీ స్తనములపై ఉంచినా అది పాలను పీల్చదు.ఆ స్త్రీ యొక్క రక్తాన్నే పీలుస్తుంది.
దుష్టత్వం గల వ్యక్తులను  ఎంత మంచిగా మార్చాలన్నా వారి దుష్టబుద్ధి మానరు అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "జలూకా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 మరి అలాంటి జలగల గురించి వివరంగా తెలుసుకుందామా.
జలగ లేదా జెనిగ అనెలిడా హిరుడీనియా విభాగానికి చెందిన జంతువు. ఇది రక్తాన్ని పీలుస్తుంది.శరీరం పొడవునా ఐదు జతల కళ్ళు ఉంటాయి.మూడు దవడలు కూడా వుంటాయి.అవి తిరగేసిన వై ఆకారంలో ఉంటాయి. వాటి అంచున తెల్లని కణజాలం ఉంటుంది.వాటిల్లో చిన్న పళ్ళు దాగి వుంటాయి.ఇలా ప్రతి దవడలోనూ ఇలాంటి పళ్ళు 90 ఉంటాయని జలగల కేంద్రం ప్రొడక్షన్ హెడ్ యెలీనా టిటోవా చెప్పడం జరిగింది.
ఇవి ఏ జంతువు శరీరాన్నైతే  అంటి పెట్టుకొని రక్తాన్ని పీలుస్తాయో, ఆ జంతువు రక్తాన్ని కడుపు నిండా తాగగానే కిందికి రాలిపోతాయి.
అయితే ఇవి జంతువు దేహాన్ని అతుక్కునే టప్పుడు అక్కడ శరీరము తిమ్మిరెక్కడానికి  అవసరమైన రసాయనాన్ని విడుదల చేసి ఆ జంతువుకు తాము అతుక్కున్నది కూడా తెలియకుండా చేస్తాయట.ఇవి నీళ్ళలో ఉంటాయి. జంతువులు గాని, మనుషులు గాని నీళ్ళలో దిగినప్పుడు పట్టేస్తాయి.
 మా చిన్నప్పుడైతే ఎక్కువగా బర్రెలను/ గేదెలను పట్టుకున్న జలగలను చూసేవాళ్ళం. అవి ఒక్కసారి పట్టుకున్నాయంటే ఒక పట్టాన వదలవు.వాటి కడుపు నిండేదాకా అలా పట్టుకునే ఉంటాయి. చిటికెన వేలంత జలగ జానెడు పొడవుకు పైగా సాగేవి.వాటిని వదిలించడానికి పొగాకు కాడను మండించి అవి పట్టుకున్న దగ్గర కాల్చేవారు.ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు వదిలేవి.అందుకే "జెనిగె పట్టు లేదా జెలగపట్టు" అంటారు.మనుషులను పడితే ఉప్పు పట్టీ వేయాలిట. అలా వేసిన కొద్ది నిమిషాలకు శరీరాన్ని వదిలి కింద పడుతుందిట.
 "జలగపట్టినట్టు పట్టిండు ఇక ఒక పట్టాన వదలడు" అని మన పెద్దలు కొందరి విషయంలో అనడం పరిపాటి.అంటే ఎవరైనా మొండి పట్టుతో అనుకున్నది సాధించేదాక ,జిడ్డులా వదలని వారిని ఉద్దేశించి ఈ మాట అంటుంటారు. 
 అయితే ఈ జలగలను ప్రాచీన కాలంలో వైద్య చికిత్సలో ఉపయోగించే వారట.అయితే నేటికీ రష్యా , బ్రిటన్ లాంటి కొన్ని  దేశాలలో వైద్యంలో జలగలను ఉపయోగిస్తున్నారట. ఒక్క బ్రిటనే సంవత్సరానికి యాభై వేల జలగలను ఎగుమతి చేస్తోందట.అంటే వాటి వైద్యానికి అంత గిరాకీ ఉందన్న మాట .
 అదండీ! జలగ లక్షణం. జలగ చరిత్ర,జలగతో వైద్యం.
ఈ జలగ పనేంటంటే రక్త పిశాచిలా పట్టిన పట్టు వదలకుండా రక్తం పీల్చడమే.కొందరు  మనుషులూ ఆంతే.రక్తం పీల్చినట్లు ఇతరుల నుండి అన్నీ లాగేసుకుని ఏమీ లేని బికారులుగా చేసేదాక వదలరు.ఎదుటి వారి సున్నితత్వం, సౌకుమార్యం లాంటి మనసు,మనిషితనం లాంటివి  ఏవీ వారికి కనబడవు.తాము జలగల్లా పట్టి పీడించడమే తెలుసు.అలాంటి వారిని ఉద్దేశించి  మన పెద్దలు ఈ "జలూకా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 అమ్మో! జలగల్లా పట్టి పీడించే వారి జోలికి అస్సలు పోవద్దు.నొప్పి బాధ తెలియకుండా పట్టి పీడించే జలగల్లాంటి వారికి ఎంత దూరంలో వుంటే అంత మంచిది‌.అంతే కదండీ.

కామెంట్‌లు