సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -539
తరంగ ప్రతిబింబ న్యాయము
******
తరంగం అనగా అల కెరటం, గ్రంథ భాగము,దుముకు ,గంతు.ప్రతిబింబం అనగా ప్రతిఫలనము,ప్రతి ఫలించుట, పోలిక అనే అర్థాలు ఉన్నాయి.
తరంగముల యందు ప్రతిబింబించే సూర్యుడు ఒక్కడే అయిననూ వాటన్నింటిలో అనేక సూర్యులుగా కనిపిస్తుంటాడని అర్థము.
 సముద్రములో అలలు ఒకదాని తర్వాత ఒకటి ఆగకుండా వస్తూనే ఉంటాయని మనకు తెలిసిందే.ఆ అలలపై ప్రతిఫలించే సూర్యుడు అనేక సూర్యులుగా కనిపించి మనసుకు ఆహ్లాదాన్ని , ఆనందాన్ని, అంతకంటే మించి అందమైన అనుభూతిని కలిగిస్తూనే, అలాంటి అలల పడవపై పయనిస్తే ఎంత బాగుంటుందో కదా అనే ఊహల  పల్లకిలో ఊరేగిస్తాడు.
 అసలు అంతమంది సూర్యులుగా  ఎలా కనబడతాడో చూద్దాం. నీటిపై సూర్య కిరణాలు ప్రసరించినప్పుడు ఒక్కో కాంతి  కిరణం నీటి బిందువులో చేరి మెరుస్తుంది.అలా అలలలో మెరుపులు ఏర్పడతాయి.ఆ విధంగా అలలలో  చేరి అనేక సూర్యులుగా కనిపిస్తుంటాడు.
అలాగే  ఉదాహరణగా ఒక కుండలో నీళ్ళు తీసుకొని అందులో చూస్తే సూర్యుని ప్రతిబింబం ఒకటే కనిపిస్తుంది. అలాంటి నీటి కుండలు ఎన్ని తీసుకుని చూసినా అందులో అన్ని సూర్యులుగా కనిపిస్తాడు.అలా అన్నింటా కనిపించే సూర్యుడు ఒక్కడే కదా.అలాగే జల తరంగాలలో కూడా!
అందుకే ఆధ్యాత్మిక వాదులు ఈ విషయాన్ని అద్వైత భావంతో చూస్తూ ఏమంటారంటే "అంతటా వ్యాపించినది, సర్వశక్తి సమన్వితమూ,సకల విజ్ఞాన సమోపేతమూ,సమగ్రమూ, సంపూర్ణమూ అయిన భగవంతుని యొక్క ఈ సకల చరాచర సృష్టి.ఈ సత్యాన్ని గ్రహించాలి.అలాగైతేనే బింబ ప్రతిబింబాలుగా ప్రతిఫలించే సత్యము యొక్క యదార్ధ స్థితిని అర్థం, అవగాహన చేసుకోగలం" అంటారు.
ఇక దీనినే మనిషికి వర్తింపజేస్తూ చెప్పారు. ఒక వ్యక్తి గాని, మనం గాని అసంఖ్యాకమైన అద్దాలు ఉన్న గదిలోకి వెళితే అన్ని  అద్దాలలో ప్రతిబింబాలు అసంఖ్యాకంగా ప్రతిఫలిస్తాయి. ప్రదర్శించే హావభావాలు అందులోనూ కనిపిస్తుంటాయి.
మరి అద్దాలలో కనిపించే ప్రతిబింబాలు యథార్థమైనవా? శాశ్వతమైనవా? అనే ప్రశ్నలకు కాదనే సమాధానం వస్తుంది.అయితే ఆ ప్రతిబింబాలలో కూడా స్వరూప స్వభావాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా! కానీ అవి కేవలం అద్దాల గదిలో ఉన్నంత వరకే అవన్నీ అలా గోచరిస్తాయనీ,అదే వ్యక్తి లేదా మనం అద్దాల గది నుండి పక్కకు తప్పుకుంటే  ఇక అవన్నీ ఏవీ కనబడవనీ అంటే మన లేదా వ్యక్తి బింబము అనేది పరమాత్మ  అనుకుంటే కనిపించే ప్రతిబింబాలు ఆత్మలు అని, అవి పరమాత్మ రూపాలనీ ఉపనిషత్తులు చెబుతున్నాయి.
 
వేదాలు పురాణాలు మరియు ఉపనిషత్తులు ఏవి చెప్పినా "తరంగ ప్రతిబింబ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఓ సూర్యుడుగానో,  బింబంగానో భావిస్తే మన ఆలోచనా తరంగాలలో ప్రతిఫలించేది ప్రతి బింబాలుగా మనమే. మనం ఎలా భావిస్తే అలా ఆలోచనల్లో కూడా అలాంటి ప్రతిబింబాలం అవుతాం అన్న మాట.
మన మనసును మంచి బింబంగా మార్చుకుంటే, ఆలోచనా తరంగాలలో కూడా అలాగే ప్రతిబింబిస్తాం.మన ఆలోచనా ధోరణికి మూలమైన మనపైనే ఏదైనా ఆధారపడి ఉంటుందని ఈ "తరంగ ప్రతిబింబ న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.అంతే కదండీ.

కామెంట్‌లు