న్యాయాలు-568
ధూమాగ్ని న్యాయము
******
ధూమం అంటే పొగ,బాష్పము, కేతువు,మేఘము.అగ్ని అంటే నిప్పు, అగ్నిదేవుడు, యాగాగ్ని, జఠరాగ్ని అనే అర్థాలు ఉన్నాయి.
"ధూమాగ్ని న్యాయము" అంటే నిప్పు లేనిదే పొగ రాదు అని అర్థము.
"నిప్పు లేకుండా పొగ రాదు" అనే సామెత తెలుగులో బాగా ప్రాచుర్యం పొందింది. తరచూ నోళ్ళలో నానుతూ, ఊహలతో సాగుతూ 'హవ్వా! అని బుగ్గలు నొక్కుకునేలానో 'అయ్యో! అలాగా!' తప్పుగా అనుకున్నామే' అని బాధ పడేలాగానో చేసే నానుడి ఇది.
"నిప్పు లేనిదే పొగ రాదు" అనే ఈ లోకోక్తి అనేక అనుమానాలకు తెర తీసేది.చూసేది. వాస్తవాన్ని అన్వేషింప జేసేది.ఆలోచనలు రేకెత్తించేది.
అవేంటో శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఈ"ధూమాగ్ని న్యాయము"లో రెండు రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి నిప్పు లేనిదే పొగ రాదు అనేది వాస్తవం.దీనికి సాక్ష్యాలు, ఋజువులు నిరూపణకు ప్రమాణంగా నిలుస్తుంటాయి. పొగ ఆధారంగా నిప్పును ఊహించడం సహేతుకంగా అనిపిస్తుంది ఎందుకంటే తరచి చూస్తే నిప్పుకు సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ కనబడతాయి.ఏవైనా చెక్క ముక్కలు, కాగితం, వస్త్రాలు ప్లాస్టిక్ వస్తువులు కాల్చినప్పుడు కొంత మసితో కూడిన పొగ వస్తుంది.అవి పూర్తిగా కాలి పోయినప్పుడు నిప్పు ఆరిపోతుంది కానీ దాని తాలూకు పొగ ఆ ప్రాంతంలో కొంత సమయం దాకా ఆవరించి కనిపిస్తుంది.
మరొక కారణం కూడా చెప్పుకోవచ్చు ఏదైనా ఒక ఇంధనాన్ని పూర్తిగా కాల్చడానికి సరిపడా ఆక్సిజన్ లేనప్పుడు పొగ ఏర్పడుతుంది. అందుకే నిప్పు లేనిదే పొగ వుండదు, రాదు అంటుంటారు.
ఇక రెండో కోణంలో చూస్తే 'నిప్పు లేకుండా కూడా పొగలు వస్తాయి. అంటే "నిప్పు లేనిదే పొగ వుండదు అనేది అవాస్తవం " అని చెప్పవచ్చు.నిప్పు లేకుండా కూడా పొగ వస్తుంది.అదెలాగో చూద్దాం .
బాగా గడ్డకట్టిన మంచు దిమ్మె లేదా ఐస్క్రీమ్ ను బయట ఉంచితే దాని నుండి పొగలు రావడం చూడవచ్చు.అయితే ఈ పొగలు మాత్రం మంట నుంచి వెలువడిన పొగనో లేదా, ఏదైనా వాయువుకు సంబంధించిన పొగనో కాదు. అవి ఎలా వస్తాయో ప్రొఫెసర్ ఈ.వి సుబ్బారావు గారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుందాం.
మంచు దిమ్మె చుట్టూ ఉన్న గాలి బాగా చల్లబడి అతి తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకోవడంతో గాలిలొ ఉన్న నీటి ఆవిరిలో కొంచెం ఘనీభవించి అతి సూక్ష్మమైన నీటి బిందువులుగా ఏర్పడతాయి. సూర్యుని వేడికి గాలి పైకి ప్రయాణిస్తుందని మనకు తెలుసు కదా! అలా సూక్ష్మ నీటి బిందువులు కూడా పైకి లేస్తాయి.అలా పైకి లేచే అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులే మనకు దట్టమైన పొగలా కనిపిస్తాయన్న మాట.
అంతే కాదు చలికాలంలో మాట్లాడేటప్పుడు నోట్లోంచి పొగలు రావడం చూస్తుంటాం.మరి నిజంగా నోట్లోంచే వస్తున్నాయా అంటే కాదనే చెప్పాలి.అవి బయటి గాలిలోనే ఏర్పడతాయి. చలికాలంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటుంది.బయట గాలిలోని తేమ ఉష్ణోగ్రత కన్నా మన నోటిలోంచి వచ్చే గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నోటిలోని గాలి బయటకు రావడంతో ఆ గాలి లోని ఉష్ణాన్ని బయట తక్కువ ఉష్ణోగ్రతలో ఉన్న తేమగాలి గ్రహిస్తుంది. అలా గ్రహించిన వెంటనే బయటి గాలిలోని తేమ ఆ వేడికి ఆవిరిగా మారుతుంది.ఆ ఆవిరే మనకు పొగలా కనిపిస్తుంది.ఇలా వెంట వెంటనే పొగలుగా మారడంతో ఆ పొగలు నోటి నుండి వస్తున్నట్లు కనిపిస్తాయి.
అయితే పై విషయాలన్నీ సైన్స్ కు సంబంధించినవి. శాస్త్రీయంగా ఋజువు చేయబడినవి.
మరి ఈ సామెతను మన పెద్దవాళ్ళు వ్యక్తులకు వర్తింపజేసి ఎందుకు చెప్పారో చూద్దాం.
దీనిని కూడా రెండు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది.చేసిన చెడ్డపని గానీ మంచి పని కానీ నివురు కప్పిన నిప్పులా వుండి నివురు ఎగిరిపోయే సందర్భం వచ్చినప్పుడు దానిని అందరికీ తెలియజేసే ఆజ్యం మరియు గాలి లాంటి వారి వల్ల వారి విషయం నెమ్మదిగా రగులుకొని పొగలా చుట్టూ ఉన్న సమాజంలో వ్యాపించే అవకాశం ఉంది.అంటే అక్కడ నిప్పులాంటి విషయం గలిగిన వ్యక్తి ఉన్నాడన్న మాట. ఈ విధంగా చూస్తే "ధూమాగ్ని న్యాయము" నకు ఇది సరిగ్గా సరిపోతుంది.
ఇక రెండవ కోణంలో చూస్తే మానవీయ విలువలు గలవారిని,వారి వ్యక్తిత్వాన్ని, వారికి వచ్చే మంచి పేరును చూసి తట్టుకోలేని వారు కొందరు మన చుట్టూనే వుంటారు. అలాంటి వారు చేసే చెడు ప్రచారం పుకార్లుగా షికార్లు చేస్తూ విన్న వారందరినీ నిజమేనేమో అనే సంశయంలో పడేలా చేస్తుంది. ఎంత నీతీ నిజాయితీ గల వ్యక్తులైనా వీరి బారిన పడి నీలాపనిందల పాలవుతుంటారు. ఆ సందర్భంలో "నిప్పు లేనిదే పొగ రాదు" కదా అనుకోవడం పరిపాటి.ఆ తర్వాత తెలిసి అయ్యో అనుకోవడం కూడా సహజమే .
ఇవండీ "ధూమాగ్ని న్యాయము"లోని రెండు కోణాలు.పుకార్లతో హెచ్చించే వారు,తగ్గించే వారు ( అవమానించే వారు) రెండు రకాల వాళ్ళు ఉంటారనేది ఎప్పుడూ గమనంలో పెట్టుకోవాలి. పూర్తిగా విషయం తెలియకుండా ఏవిధమైన నిర్ణాయానికి రాకూడదని ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి