ఓ మిత్రుండింటికి వెళ్ళాను. మిత్రుడి అయిదేళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి నాకో ఆపిల్ ఇచ్చింది. తినడానికి ఇచ్చిందేమోనని థాంక్స్ చెప్తుంటే అయ్యో అది మీరు తినడానికి ఇవ్వలేదు అంకుల్ అంటూ లోపలికి వెళ్ళి ఓ కాగితం, పెన్సిల్ తీసుకొచ్చి ఇచ్చింది. నాకేమీ అర్థం కాలేదు.
ఆ చిన్నారి ఆపిల్ తీసుకుని దాన్ని చూసి అలాగే బొమ్మ గీసిమ్మంది నన్ను.
అదేం పెద్ద విషయమా అనిపించింది. కానీ గీయడం మొదలుపెట్టిన తర్వాతే తెలిసింది. కళ్ళముందున్న వాటిని కాగితంపై గీయడం అంత సులభం కాదని. అర గంటసేపు ఎలాగో పోరాడి ఓ ఆపిల్ని ఊహించుకుని ఓ బొమ్మ గీసాను. తీరా అది ఓ ఆనపకాయలా వచ్చింది. ఆ చిన్నారి ఆ బొమ్మనూ, నన్నూ చూసి పగలబడి నవ్వింది. పండిస్తే తినడం మాత్రం తెలుసు కానీ గీయడం తెలీదా అనుకుంటూ అంది. ఆ మాటకు సిగ్గేసింది.
వెంటనే నా మిత్రుడు ఓ కాగితం మీద ఆపిల్ పండు గీయడం మొదలుపెట్టాడు. అతను గీసిన బొమ్మ టొమాటోలా ఉంది. అది చూసి చిన్నారి నాన్నా మీకు కూడా ఆపిల్ గీయడం తెలీలేదు అని ముఖం ముడుచుకుంది. కళ్ళముందున్న ఆపిల్ని చూసి కూడా గీయడం తెలీలేదుగా అని చెప్పింది.
అనంతరం నేను చిననారి చేతిలో ఉన్న ఆపిల్ వంక తదేకంగా చూశాను. అప్పటివరకూ ఏదో ఆపిల్ చూడనట్లుగా చూశాను. నిజమే.
ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క వస్తువుకి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది.కానీ మనమెవరమూ వాటి వంక అంత దీక్షగా చూడం. వేప పువ్వు వాసన ఎలా ఉంటుందో అని మురికి వాడలో ఉంటున్న చిన్న పిల్లలకు తెలిసినంతగా మనకు చెప్పడం తెలీదు. నగరంలో వంకాయ రంగు, నెమలి మెడ రంగులను ఎవరైనా తదేకంగా చూసుంటారా....ఇంటి వాకిట్లోకొచ్చి అమ్మనే ఆకుకూరలలో సగానికి పైగా మనకు పేర్లు కూడా తెలియదు. కానీ చెప్పుకుంటాం నగరంలో ఉంటున్నామని.
ఇంతలో చిన్నారి ఓ కాగితంమీద ఆపిల్ బొమ్మ గీసి దాని కింద తన పేరుని అందంగా రాసి మాకు చూపించింది. ఆశ్చర్యమేసింది. కాగితంమీద వంకర టింకరో ఏది గీసినా సరే దాని కింద పేరు రాయాలన్న విషయం ఆ చిన్నారికి తెలిసింది. కానీ మన దేశంలో మహోన్నతమైన శిల్పాలను రూపొందించిన అజంతా, ఎల్లోరాలను ఎవరు చెక్కారో ఇప్పటికీ తెలీదు. అవి ఎన్నో శతాబ్దానివో చెప్పగలం కానీ వాటిని కచ్చితంగా ఫలానా శిల్పి సృష్టి అని ఎవరు చెప్పగలరు. అంతెందుకు చాలా గుళ్ళ గోపురాలపై ఉన్న బొమ్మలను ఎవు చెక్కరో ఎవరికీ తెలీదు. ఎవరు చెక్కించారో చెప్పగలం కానీ అసలు సృష్టికర్త వివరాలు తెలియవు.
ఓమారు స్థపతితో మాట్లాడాను. ఆయన అనేక దైవ విగ్రహాల రూపకర్త. మీరు చెక్కిన విగ్రహాలను అందరూ దేవుడిగా భావించి నమస్కరిస్తుంటారు. కానీ మీరు వాటిని చెక్కుతున్నప్పుడు వాటిలో దైవాంశను చూస్తారా అని అడిగాను.
దానికి ఆయన జవాబిస్తూ దైవాంశం అనేది మనిషిలో ఉంటుందన్నారు. ఏ రాయి దేవుడు విగ్రహం అవుతుందని ఎవరు చెప్పగలరు. జాతీయ రహదారి పక్కన కనిపించే మైలు రాళ్ళు రాళ్ళే. అలాగే దక్షిణామూర్తి అవడమూ రాయే. కానీ రెండూ నిజానికి రాళ్ళుగానే ఉన్నా కళ వల్ అవి ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. మనిషి జీవితం లాంటిదే అదీనూ.
దైవత్వం అనేది ప్రేమ, ఆప్యాయత, అనురాగం, శాంతి, ప్రశాంతత ఇలా అన్నీ కలిసినవే. ఎండలో తిరుగుతున్నప్పుడు చెట్టు నీడలో అమ్మయ్య అనిపిస్తుంది. ఆ చల్లదనమూ దైవాంశమే. కాదనగలమా. వేసవిలో దాహంతో గొంతు ఎండిపోతున్నప్పుడు చల్లటి నీరు తాగుతాం. ఆ నీటితో మనసు చల్లబడుతుంది. అదీనూ దైవాంశమే.
శిల్పాలను చెక్కే వారి మనసులో అబద్ధాలు, కుట్రలూ కుతంత్రాలూ ఉంటే మంచి రూపాలు తయారుకావంటూ ఆయన ఓ విషయం చెప్పాడు.
ప్రత్యేకించి ఓ ఆలయానికి మూలవిగ్రహం చెక్కివ్వమని అడిగారు. నేనూ చెయ్యడం మొదలుపెట్టాను. కానీ అది పూర్తి కావడానికి ముందరే వెంట పడి త్వరగా చేసివ్వమని ఒత్తిడి పెంచారు. నేను సహనం నశించి మరుసటి రోజే చేసిస్తానని చెప్పాను. అలాగే మరుసటి రోజే పూర్తి చేశాను. కానీ ఆ విగ్రహాన్ని నా దగ్గర నుంచి తీసుకుపోతున్నప్పుడు దాని వంక తదేకంగా చూశాను. ఆ విగ్రహం ముఖాన నాకున్న కోపమూ, అసంతృప్తి కనిపించాయి. డబ్బుని లారికి తిరిగిచ్చేసి విగ్రహాన్ని వెనక్కు తీసుకుని ఇంట్లోనే అటక మీద పెట్టేశాను అన్నారు.
కళాకారుల మనసులో ప్రేమ, అంకితభావం, ప్రశాంతత లేకుంటే ఆ కళ పండదు. పవిత్రంగానూ ఉండదు.
ఆయన చెప్పినదంతా నిజమో కాదో తెలీదు కానీ మనసు నిర్మలంగా లేకుంటే ఈ పనీ శుభ్రంగా ఉండదన్నది నిజం. మీరు సృష్టిస్తున్న విద్రహాల కింద ఎందుకు మీ పేరు వేసుకోవడం లేదని అడిగాను.
ఆయన నవ్వుతూ అది ఎప్పటి నించో వస్తున్న సంప్రదాయం. అడవిలో న్నంత వరకే అది వెదురు. అది వాయిద్యకారుడి చేతికొచ్చేసరికి వేణువు అవుతుంది. అలాగే మాదీనూ. ఇతరులకే ది రాయి. మాకు అది కళాఖండానికి మూలం.
ఏదైనా సృష్టించడం క్లిష్టతరం. నాశనం చేయడానికి క్షణం పట్టదు. సులువు కూడా. ఈ యాంత్రిక యుగంలో అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. ఈరోజు పెళ్ళిళ్ళో భోజనానికి అరిటాకులకు బదులు అరిటాకులలాంటి కాగితాలు ఒకింత గట్టివి కనిపిస్తున్నాయి. ఓవైపు అరటి చెట్లు సాగు చేసే రైతన్న వాటికి గిట్టుబాటు ధర లభించక నానా అవస్థలు పడుతున్నాడు. మరోవైపు దారుణం.
ఏదైనా స్థిరంగా ఆలోచించేందుకు మనసు లేదు మనకు. అసలు అలా చూడటమే కాలాన్ని వృధా చేయడమే అనుకుంటూ ఉంటాం. కానీ ఓ నిముషం నిదానంగా ఆలోచిస్తే అందులోని కష్టాలు నష్టాలు లాభాలు ఏమిటో తెలుస్తాయి. మన తలపై ఉన్న ఆకాశాన్ని, ఇంటికి పక్కనే ఉన్న చెట్లను, రాత్రి సమయంలో నక్షత్రాలను, వర్షం పటినప్పుడు మట్టి వాసనను, ఇలా ఏదో ఒక దాని వంక చూడటానికి మనసుని పోనిస్తే ప్రకృతి ఎంత అందమైనదో విశాలమైనదో తెలుస్తుంది. మనలో కోరికలు నెరవేర్చమని అడగడానికీ, ఏదో ఒక కష్టం చెప్పుకోవడానికి గుడికి వెళ్ళే వారే ఎక్కువ మంది. ఇంట్లో ఎవరూ మన గొంతు వినరు. లెక్కచేయరు. మరోదారి లేక ఏదో ఓ దేవుడి సన్నిధికి పోతుంటాం. అక్కడ మనసులోని బాధను చెప్పుకుంటాం. అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి శిల్పాలను చూసినప్పుడు వాటిని సృష్టించిన చేతులకు మానసికంగా దణ్ణం పెడితే బాగుంటుంది. రాతిని దేవుడిగా మలిచే శిల్పి ప్రజ్ఞ అమోఘం అనిపిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి