సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా

 న్యాయాలు -550
దగ్ధ బీజ న్యాయము
     ******
దగ్ధ అనగా సంపూర్ణంగా కాలి బూడిద అగుట,కాలుట. బీజము అనగా గింజ,  విత్తనము, మూలము, వీర్యము అనే అర్థాలు ఉన్నాయి.
కాలిన విత్తనము మొలకెత్తదని అర్థము.అలాగే మనిషిలో రాగము నశించిన సంసార బంధాలేవీ అంటవు అనే అర్థంతో ఈ "దగ్ధ బీజ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 కాలిపోయిన విత్తనంలో జీవత్వముతో కూడిన  చైతన్యం నశిస్తుంది కాబట్టి మొక్కగా ఆ బీజము మొలవలేదు.అలాగే మనిషిలో కూడా రాగం అనేది  నశించాలి.రాగం అంటే ఇష్టం. ఇష్టం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలనే ఇష్టం కావచ్చు,బంధాలు అనుబంధాల పట్ల  ఇష్టం కావచ్చు. మరేదైనా కావచ్చు. అలాంటి రాగం ఎప్పుడైతే నశిస్తుందో  అప్పుడు సంసార బంధాలు,మోహాల్లాంటివి ఏవీ మనసుకు అంటవు. అప్పుడే  మనిషి నిర్వికారంగా ఉండగలడు.
 రాగంతో పాటు ద్వేషం కూడా  బంధాలు, అనుబంధాల మధ్య అయిష్టతను కలుగజేస్తుంది.ఈర్ష్య అసూయలకు దారి తీయిస్తుంది.కాబట్టి  ద్వేషం అనే పదాన్ని కూడా కలిపి రాగ ద్వేషాలు అంటుంటారు. వీటిని గురించి కొంత విపులంగా తెలుసుకుందాం.
 రాగం అంటే ఇష్టం అని, ద్వేషం అంటే అయిష్టం అని కొంతవరకు తెలుసు. ఈ ద్వేషం అంటే మరేమిటో కాదు.అది ప్రతికూలమైన అనుబంధమే.రాగమనే మమకార బంధం పదే పదే ఏవిధంగా జ్ఞప్తికి వచ్చేలా చేస్తుందో అదే విధంగా ద్వేషింపబడే విషయం అంటే అయిష్టత కూడా పదే పదే గుర్తుకు వచ్చేలా చేస్తుంది.అనుభవజ్ఞులైన వారు ఏమంటారంటే  రాగమూ,ద్వేషమూ రెండూ కూడా మనస్సుపై ఒకే రకంగా తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి.ఇవి ఒకే నాణేనికి రెండు వైపులుగా ఉన్న  బొమ్మ బొరుసు లాంటివని అంటుంటారు.
మన ఇంద్రియాలు సహజంగానే కొన్ని వస్తు, విషయాలపై,వ్యక్తులపై రాగద్వేషాలు కలిగి ఉంటాయి. మనం చూస్తుంటాం ఒకరికి నచ్చిన విషయం కానీ, వస్తువు కానీ పదార్థం కానీ ఇంకొకరికి అస్సలు నచ్చక పోవడం. వాటి మీద అకారణమైన అయిష్టతను పెంచుకుంటూ ఉండటం.
ఇదంతా మనలోని దశేంద్రియాల వల్ల( కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు) జరుగుతుంది. ఈ ఇంద్రియాలు మనసును ప్రభావితం చేస్తుంటాయి.అందుకే ఏ బంధమైనా, అయిష్టత అయినా సహజంగా మనసు కారణంగానే ఏర్పడుతుందని పెద్దలు అంటుంటారు.
ఇలా మనిషి  రాగ ద్వేషాలకు లోబడి నట్లయితే బంధాలు బాధ్యతల్లో  ఇరుక్కుపోతాయి. వదిలించుకోవాలన్నా  వదలవు.విడిపోవు.పాశంలా చుట్టుకుంటాయి. వాటి నుండి విముక్తుడైతేనే  'దగ్ధ బీజములా' రాగ ద్వేషాలకు అతీతంగా మారి జన్మంటూ లేకుండా మోక్షం లభిస్తుంది.
మరి వాటిని వదిలించుకోవడం ఎలా? అంత సులభం కాదు కదా! ఎలా వదిలించుకోవాలో ఆధ్యాత్మిక వాదుల మాటల్లో చూద్దాం.
మనసులోని  రాగముపై వైరాగ్యము పెంచుకోవాలనీ, ద్వేషమునేమో విశ్వ ప్రేమగా మార్చుకోవాలని చెబుతారు.అలా మార్చుకోవడమే  బ్రహ్మజ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానముతో ప్రాపంచిక బీజమును దహింపజేసినట్లయితే  రాగ ద్వేషాలకు అతీతంగా వ్యక్తి మారిపోతాడని అంటారు.
మరి బ్రహ్మ జ్ఞానము అంటే ఏమిటో తెలుసుకుందాం. బ్రహ్మ జ్ఞానం అంటే బ్రహ్మను గురించి తెలుసుకోవడం.బ్రహ్మ అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం అని అర్థము.జ్ఞానం అంటే తెలిసి వుండటం. ముఖ్యంగా ఉపనిషత్తులన్నీ జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అని ఈ విషయాలనే చెబుతుంటాయి.
ఈ విధంగా బ్రహ్మ జ్ఞానం అనేది అంతిమ సత్యం, వాస్తవిక స్వభావాన్ని మార్చి స్వీయ అవగాహన లేదా సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది.తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలుగుతుంది.అనగా విముక్తి లేదా మోక్షానికి మూలం అవుతుంది.
 ఈ "దగ్ధ బీజ న్యాయము" ద్వారా  అర్థం చేసుకోవాల్సిన  ముఖ్య విషయం ఏమిటంటే  రాగ ద్వేషాలకు అతీతమైన బ్రహ్మ జ్ఞానం మనలో ఉన్నప్పుడే దగ్ధ బీజంలా మారిపోగలం. పొందాలనుకున్న  మోక్షాన్ని పొందగలము. మరి మనం కూడా ఆ దిశగా జ్ఞానోదయం కలిగేలా ప్రయత్నాలు మొదలు పెడదాం.

కామెంట్‌లు