సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఆర్కెన్సాస్ అమెరికా.

 న్యాయాలు -548
దంపతీ కలహ న్యాయము
*****"
దంపతీ అనగా భార్యా భర్తల బంధం.కలహం అనగా యుద్ధం,జగడం,తగాదా, తగవు, పేచీ అనే అర్థాలు ఉన్నాయి.
దంపతీ కలహం అనగా భార్యా భర్తల మధ్య వచ్చే తగాదా లేదా పేచీ.
భార్యాభర్తల మధ్య వచ్చే పేచీలు, తగాదాలు అద్దం మీద ఆవగింజలా జారిపోతాయనీ,అజా యుద్ధంలా పేరుకే గానీ తరచి చూస్తే ఏమీ ఉండదు, సర్దుకు పోవడమే వుంటుందనీ, అలా ఉండాలని చెప్పడమే ఈ "దంపతీ కలహ న్యాయము న్యాయము"లోని అంతరార్థం.
  వివాహ వ్యవస్థలో దంపతీ వివాహం, దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం గురించి వివరంగా తెలుసుకుందాం.
 భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ముఖ్యమైనది ధర్మబద్ధమైన వైవాహిక జీవితం.ఈ వైవాహిక ధర్మం ప్రపంచానికే ఆదర్శం.ఏక పత్నీ వ్రతం, పాతివ్రత్యంతో  కామాన్ని కూడా ధర్మబద్ధంగా నిర్వహిస్తుంది. దీనిని బట్టి ఈ దంపతీ ధర్మం ఏర్పడింది.ఎప్పుడైతే భార్యా భర్తలు ఒకరి పట్ల ఒకరు నిబద్ధత కలిగి వుంటారో వారి పిల్లలు కూడా తల్లిదండ్రులను  ఆదర్శంగా తీసుకుని వాటిని పాటిస్తూ వుంటారు. దంపతీ ధర్మంలోని గొప్ప తనం అదే.
 దంపతులు  అంటే ఆలుమగలు.దాంపత్యం అంటే దంపతి భావం లేదా భార్యాభర్తృ భావము.భార్య అనగా అగ్ని సాక్షిగా పరిణయమాడిన స్త్రీ,భరింపదగినది అని అర్థము.
ఇలా దాంపత్య బంధం అనేది ఓ శాశ్వతమైన బంధం.కుటుంబ వ్యవస్థకు పునాది,మూలం  దాంపత్య ధర్మమే.ఇందులో కలహాలు, పేచీలు రావడం అనేది సహజం. మన శరీరంలో వచ్చే అనారోగ్యాలను భరిస్తూ, తగ్గించుకునేందుకు ఎలా ప్రయత్నాలు చేస్తామో, జలుబు లాంటి చిన్న చిన్న వాటితో ఎలా రాజీ పడతామో అలాగే మానవ సంబంధాల్లో అతి ముఖ్యమైన భార్యాభర్తల బంధంలో కూడా రాజీ పడటం అనేది ఉండాలి.అది కూడా ఇరువైపులా ఉంటేనే సాధ్యం అవుతుంది.
హిందూ వివాహ ప్రక్రియను చూసినట్లయితే  'సామ్రాజ్ఞీభవ' అంటూ వరుని చేత వధువును మంత్ర పూర్వకముగా జీవితంలోకి ఆహ్వానింప చేయించడం,అలాగే వధూవరులను సప్తపది పేరుతో అగ్ని హోత్రం చుట్టూ ఏడడుగులు నడిపించడం అందరికీ తెలిసిందే.దీని పరమార్థం ఏమిటంటే ఇరువురూ పచ్చని పెళ్లి పందిరి కింద దేవతలు , పంచభూతాల సాక్షిగా జీవితాంతం రెండు దేహాలు ఒకటే ఊపిరిగా,స్నేహంగా కలిసి మెలిసి ఉండాలని. మరి స్నేహంగా ఉండటం  ఎందుకంటే స్నేహంలో ఆధిపత్య భావనకు చోటు వుండదు. సమానత్వం,ప్రేమను పంచడం, క్షమించడం,త్యాగించడం, రక్షించడం మొదలైనవి  అన్నీ ఉంటాయి.అంత గొప్పదైన దాంపత్య బంధం జన్మ జన్మలకు కొనసాగుతూ వుంటుందని, ఉండాలని వివాహంలోని మంత్రాలు చెబుతుంటాయి.
 అయితే దంపతుల్లో మాత్రమే కాదు స్నేహితుల మధ్య కూడా అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు వస్తుంటాయి.కానీ  స్నేహితులు స్పర్థను  పెంచుకోరు.ఎంతో త్వరగా సర్దుకుని  ఒకరినొకరు అర్థం చేసుకుంటారు . అలాగే భార్యాభర్తలు కూడా సహనంతో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.సర్థుకు పోవాలి. సమస్యకు మూలకారణం కనుక్కుని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి.ఓపిక, నిగ్రహం, సర్దుబాటు ఉంటే ఎంతటివైనా అద్దం మీద ఆవగింజలై జారిపోతుంటాయనేది గ్రహించాలి.
 సూర్యుని నుండి వెలుగును,చంద్రుని నుంచి వెన్నెలను, పువ్వు నుండి తావిని,మనిషి నుండి నీడను ఎలా విడదీయలేమో  భార్యాభర్తల బంధం కూడా విడదీయలేని అనుబంధమని, ధర్మార్థ కామ మోక్షాలు వైవాహిక బంధం ద్వారానే నిరాటంకంగా కొనసాగుతాయని మన పెద్దలు అంటుంటారు.
 ఇక విషయానికి వద్దాం  దంపతుల మధ్య కలహం వస్తే ఎవరూ అందులో తలదూర్చరు. కానీ  వాళ్ళ తగవు చూస్తే ఇక వీరు జీవితంలో కలిసి బతకలేరేమో అనిపిస్తుంది.అది అజా యుద్ధంలా కనిపిస్తుంది.అవి ఎంతగా అరుచుకుంటూ పోట్లాడుకున్నా పెద్దగా దెబ్బలూ తాకవు.కొద్ది సేపట్లోనే రెండింటిలో ఏదో ఒకటి రాజీ కొచ్చి‌ ఆపేస్తుంది.రెండూ  సర్థుకు పోయి సఖ్యంగా వుంటాయి.అలాగే అందుకే దంపతుల కలహం కూడా అంతే .
ఇద్దరి మధ్య గొడవ ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షంలా తోస్తుంది.ఆ వర్షం వెలిసిన తర్వాత ఎంత ప్రశాంతంగా వుంటుందో అంత ప్రశాంతంగా వారూ ఉంటారు.కారణం బంధాలు, బాధ్యతలు గుర్తుకు వస్తాయి. సర్దుకుపోవాల్సిన అవసరమూ  ఇరువురికీ తెలిసి వస్తుంది.
వీరి కలహం  ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాసిన సంస్కృత శ్లోకం చూద్దాం.
 "అజా యుద్ధే ఋషి శ్రాద్ధే ప్రభాతే మేఘడంబరే/దంపత్యోఃకలహేచైవ బహ్వారంభఃలఘు క్రియా!" 
అర్థం ముందే పైన చెప్పుకున్నాం కదా! అదండీ! "దంపతీ కలహ న్యాయము"అంటే.
 మరి ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఒక్కటే భార్య భర్తల బంధం- దాంపత్యం అనేది ఎంతో పవిత్రమైనది. అందులో ఎక్కువ తక్కువలు ఉండకూడదు.ఎలాంటి యిబ్బందులు వచ్చినా తెగే దాక లాగకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అనురాగం, అన్యోన్యత, సహకారం,సర్దుబాటు ఉంటే  ఏ దాంపత్యమైనా ఆనందంగా ,చూడటానికి అందంగా  ఆదర్శంగా ఉంటుంది.

కామెంట్‌లు