సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా

 న్యాయాలు-555
దాంపత్య జన్మ పరంపరా న్యాయము
*****
దాంపత్యం అంటే ఆలూమగల అన్యోన్య సంబంధము.జన్మ అంటే పుట్టుక, ఉత్పత్తి ,జీవన కాలము.పరంపరా అంటే ఒకరితర్వాత ఒకరు,ఉత్తరోత్తరుడు,అవిచ్ఛేదము,ఆను పూర్వి, ఎడతెగకుండుట,వరుస, వంశము అనే అర్థాలు ఉన్నాయి.
 ఆలూమగల అన్యోన్య సంబంధము అనేది  జన్మ జన్మలతో ముడిపడి పరంపరగా వచ్చే  అనుబంధం అని అర్థము.
 హిందూ సంప్రదాయంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన, ఆమోదయోగ్యమైన మరుపురాని, మధురమైన ఘట్టం.అటూ ఇటూ ఏడేడు తరాలతో ముడిపడి వుంటుందని మన  పెద్దలు చెబుతుంటారు.అందుకే దాంపత్యం అనేది జన్మజన్మల బంధమని, "పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి"(మ్యారేజస్ ఆర్ మేడిన్ హెవెన్) అంటారు.కాబట్టే దాంపత్య బంధానికి అంత మహత్తు ఉంది .ప్రాముఖ్యత ఇవ్వబడింది.
అవి విన్నప్పుడూ,ఇలా చదివినప్పుడు ఎవరికైనా నిజమే కదా! అనిపిస్తుంది.ఎందుకంటే మన జీవితంలో  జరిగే సంఘటనలు, సందర్భాలు,పరిచయాలు, బంధాలు అనుబంధాలు చూస్తుంటే వాటిల్లో మన ప్రమేయం ఏమీ లేదనీ, అనుకోకుండా జరిగినవేననీ అర్థమవుతుంది.ఒకవేళ మన ప్రమేయం ఉందని తెలిసినా ఆ తర్వాత జీవితం ఎలా కొనసాగుతుందో  మనం ఊహించలేం.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే బంధంతో ఒకటవుతారు. కలిసిన మనసులతో బతుకంతా  కలిసి సంతోషంగా సమస్యలను ఎదుర్కొంటూ ఒకరికి ఒకరు తోడుగా నీడగా ప్రయాణం చేస్తూ ధర్మార్థ కామ మోక్షాలను నిర్వహించి ఆదర్శ దాంపత్యం కొనసాగిస్తారు.అందుకే "పెళ్ళంటే నూరేళ్ళ పంట", "ఏడేడు జన్మల బంధమనీ, బ్రహ్మ దేవుడు ఎవరితో పెళ్ళి అవుతుందో ముందే రాసి పెడతాడు" అని అంటుంటారు.
ఈ మాటనే శృంగార నైషధం కావ్యంలో శ్రీనాథుడు నలదమయంతుల వివాహానికి సంబంధించి హంసచేత చెప్పిస్తాడు.దమయంతి ఉద్యానవనంలో విహరించే  సమయంలో ఆమెను చెలికత్తెల నుండి దూరంగా తీసుకుని పోయిన  హంస  నలుడి యొక్క గుణగణాలను,మహనీయతను,సత్యనిష్ఠను వర్ణిస్తూ " బ్రహ్మ దేవుని వాహనంగా ఆకాశంలో వెళ్తూ ఒకసారి ఆ స్వామిని అడిగాను " భూలోకంలో నలమహారాజుకు ఎవరిని ఇల్లాలుగా రాసి పెట్టారని? ఆ స్వామి దమయంతి అని చెప్పినట్లు నాకు వినబడింది.రథం వేగంగా పోవడం.ఆ గాలి శబ్ధంలో కొద్ది కొద్దిగా వినిపించింది.అది నీ గురించి చెప్పినట్లు తోచింది." అంటుంది.ఆ తర్వాత నలదమయంతుల  వివాహం హంస చెప్పినట్లు జరగడం మనం అందులో చదువుకోవచ్చు.
ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు వుంటాయని మనకు తెలుసు.అందులో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి మన పెద్దవాళ్ళు పూర్వీకులు, ఋషులు ఎంపిక చేసిన ఏకైక మార్గం వివాహం అన్న మాట.ఇందులో వధువును లక్ష్మీ సరస్వతీ, పార్వతీ దేవిల ఏకాత్మ రూపంగానూ, వరుడు సాక్షాత్తు త్రిమూర్తుల దివ్య స్వరూపంగానూ  భావిస్తారు.
పనిలో పనిగా ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయో చూద్దాం. యాజ్ఞవల్క్య స్మృతిని అనుసరించి  ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటిది బ్రహ్మ వివాహం - అనగా విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం.2. దైవ వివాహం -అనగా యజ్ఞ యాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుము బదులుగా కన్యాదానం చేయడం. 3.ఆర్ష వివాహం -అనగా కన్యాశుల్కంగా వరుని నుండి ఒక జత ఆవు ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం. 4. ప్రాజాపత్య వివాహం -అనగా కట్నమిచ్చి పెళ్ళి చేయడం.5.ఆసుర వివాహం -అనగా వరుడు ధనం ఇచ్చి వధువును కొనడం.6. గాంధర్వ వివాహం -అనగా ప్రేమ వివాహము.7.రాక్షస వివాహం -అనగా వధువును ఎత్తుకెళ్లి పెళ్ళి చేసుకోవడము.8. పైశాచ వివాహం -అనగా వధువు నిద్రిస్తున్న సమయంలోనో, స్పృహలో లేని సమయంలోనో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించి చేసుకోవడం.
 వీటిల్లో బ్రహ్మ, దైవ,ప్రాజాపత్య,ఆర్ష  వివాహాలు ఆమోదయోగ్యమైనవనీ, వీటితో పాటు స్వయంవరం అనే వివాహ సంప్రదాయం కూడా మంచిదేననీ, ఈ స్వయంవరం ద్వారా సీతాదేవి శ్రీరాముడిని, ద్రౌపది అర్జునుడిని వివాహం చేసుకోవడం రామాయణ, మహాభారతాలలో చూస్తాము.
 ఇలా దాంపత్య బంధానికి సంబంధించిన వ్యవస్థకు ఋగ్వేద కాలంలోనే పునాదులు పడ్డాయి.అలా స్త్రీ పురుషుల  బంధం వివాహం పేరుతో ఎంతో ధృడంగా ,పవిత్రంగా మారి జన్మ జన్మల బంధంగా బలపడిపోయింది.ఇలా బలపడి పోయిన భారతీయ సంస్కృతిలోని ఆలూమగల అన్యోన్య దాంపత్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.
కాబట్టి "దాంపత్య జన్మ పరంపరా న్యాయము" ద్వారా ముఖ్యంగా మనం  తెలుసుకోవలసినది దాంపత్యం అనేది ఇరు మనసులు,తనువులను కలిపిన పవిత్ర బంధం అని. ఆలోచనలు,ఆనందాలు  ఒకటై వైవాహిక జీవితంలోని  మాధుర్యాన్ని రుచి చూసే దంపతులు ఎప్పుడూ జన్మ జన్మలకు ఇలాగే తమ బంధం కొనసాగాలని కోరుకోవడం సహజం. మరి పెళ్ళి చేసుకున్న ప్రతి జంట యొక్క అనుబంధం కూడా ఎలాంటి విభేదాలు, పొరపొచ్చాలు లేకుండా జన్మజన్మల బంధం కావాలని మనమూ ఆశీస్సులు అందజేద్దాం.

కామెంట్‌లు