మీ మాట వినండి;- - యామిజాల జగదీశ్

 అనారోగ్యంతో మంచం పట్టిన ఓ పెద్దాయన  తన వైద్యునితో ఇలా అన్నాడు 
"డాక్టర్, చింతించకండి. నేను చనిపోతానని నాకు తెలుసు. నేను ఇక్కడికి రావాలని అనుకోలేదసలు. కాని మా వాళ్ళు నన్నిక్కడికి తీసుకొచ్చారు.
  
దయచేసి నా గురించి చింతించకండి, నా జుట్టు చూడండి. నేను చాలా పెద్దవాడిని, కానీ మీరు నాకంటే చాలా చిన్నవారు.  నేను జీవితం నుంచి చాలా నేర్చుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను వాటిలో కొన్నింటిని మీకు చెప్తాను.
నా నాలుగో ఏట, ఈ ప్రపంచం నాకోసమే ఉందనుకున్నాను. నా గురించే ఆలోచిస్తుందని అనుకున్నాను.  నాకు 14 ఏళ్లప్పుడు, నేను ప్రపంచాన్ని పాలించాలనుకున్నాను. నేనే గొప్ప వ్యక్తినవుతానని అనుకున్నాను. నాకు 21 ఏళ్లప్పుడు, నేను అత్యంత ధనవంతుడు కావాలనుకున్నాను, నా 25వ ఏట నేను ప్రేమను తెలుసుకోవాలనుకున్నాను. నా నలభయ్యో ఏట నేను ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలనుకున్నాను. ఇప్పుడేమో నేనిక్కడ ఉన్నాను, నేను చనిపోవాలనుకుంటున్నాను.  
మీరు చూడండి, నేను చాలా సార్లు చాలా విషయాలనుకున్నాను. ముఖ్యంగా, నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నాను.  సంతోషంగా ఉండాలంటే ఇతరుల మాటలు వినడమే ఉత్తమమైన మార్గం అని నేననుకున్నాను.
 
నేను యూనివర్శిటీలో చేరాలనుకున్నప్పుడు, నేను జువాలజీ చదవాలనుకున్నాను, కాని నేను గొప్ప ఇంజనీర్ అవుతానని అందరూ ఇంజనీరింగ్ చదవాలని చెప్పారు.  కాబట్టి నేను వారి మాటలు విన్నాను. అప్పట్లో నా ఫీజు చెల్లించడానికి నాకెవరూ లేరు, నేను పని చేయాల్సి వచ్చింది. నా ఫీజు చెల్లించుకోవడం కోసం నౌకరీ తప్పలేదు. కానీ కొన్ని పరిస్థితులవల్ల నా థర్డ్ ఇయర్లో చదువు మానేశాను.  
నాకు 28 ఏళ్లు వచ్చేసరికి అందరూ నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నారు.  నాకొక భార్య ఉండాలన్నారు. అందుకే వాళ్ళ మాటలు విని పెళ్లి చేసుకున్నాను.  పెళ్లయిన 6 సంవత్సరాలకు, నా భార్య నా పొరుగువారితో సంబంధాలు పెంచుకుని దారి తప్పింది. ఎందుకలా చేస్తున్నావని అడిగాను. అప్పుడామె నన్ను చెంపదెబ్బ కొట్టింది. నాకు కోపం వచ్చి ఏమీ మాట్లాడలేదు.  మరుసటి రోజు నేను పని నుండి తిరిగి వచ్చాను, ఆమె నా పిల్లలతో పారిపోయింది. ఇప్పుడు నేను ఒంటరి మనిషిగా చనిపోతున్నాను.
 40 ఏళ్ల వయసులో నాకు భారీ కాంట్రాక్ట్ వచ్చింది. నా పేరు వార్తల్లో నిలిచింది.  మరుసటి రోజు, నా స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ నా ఇంట్లో ఉన్నారు. అందరికీ తీవ్రమైన సమస్య. ఒక్క వారంలోపు, తిరిగి చెల్లిస్తామని మాటివ్వడంతో నేను మొత్తం డబ్బును అడిగిన వాళ్ళకు  ఇచ్చాను. కానీ తీసుకున్న వాళ్ళెవరూ డబ్బులు తిరిగివ్వలేదు. నేనప్పటికే చేసుకున్న ఒప్పందాలనుంచి మధ్యలోనే తప్పుకున్నాను. దాంతో నేను ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించాను.  జైల్లో నుండి బయటకు వచ్చాను. కానీ నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళెవరూ లేరు.
 
ఈ సమయంలో నేను చేసిన తప్పు ఒకటి ఉంది.  ఇప్పుడు నాకు స్పష్టమైంది.  దాని గురించి నేను మీకు చెప్తాను.  
నా మాట వినడానికి నేను నిరాకరించాను.  నేను నా స్వయాన్ని విస్మరించి ఇతరుల మాటలు వింటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాతో ఉన్న ఏకైక వ్యక్తి నేనే.
మీరు చూడండి, ఇతరుల మాటలు వినడం చాలా మంచిది.  ఇతరుల నుండి సలహా తీసుకోవడం చాలా తెలివైన పని.  కానీ మీ భావాలను మనసు మాటను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. మీ హృదయాన్ని కాదనుకోవడం పెను నష్టం కలిగిస్తుంది.
మీరు ఈ రాత్రి ఏకాంతంలో కూర్చోండి. ఒక గ్లాసు నీరు తీసుకోండి.  మీకు కావాలంటే మీ కళ్ళు మూసుకోండి లేదా మీకు కావాలంటే తెరవండి, ఆపై మీతో మాట్లాడండి, మీతో తర్కించుకోండి. మీరు ఒంటరిగా రహదారిపై నడవవచ్చు. మీరు నడుస్తున్నప్పుడు, మీతో మాట్లాడటం ప్రారంభించండి.
మిమ్మల్ని మీరు అధిగమించగల ఏకైక వ్యక్తి భగవంతుడు... దేవుని తర్వాత, మిమ్మల్ని మీరే వినండి...  ఇది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చునని నాకు తెలుసు, కానీ మీ మాట వినడం నేర్చుకోండి అని నేను మీకు చెప్పడాన్ని  ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.

కామెంట్‌లు