సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా
 న్యాయాలు-576
నాసికాగ్రేణ కర్ణ మూల కర్షణ న్యాయము
*****
 నాసికా అనగా ముక్కు.అగ్రేణ అనగా ముందు ,ఎదుట ,తలపై, అనంతరము,మొదట.కర్ణ అనగా చెవి, చుక్కాని,కన్నము,కుంతి మొదటి కుమారుడు.మూల అనగా కారణము, మొదలు, వేరు, ఆరంభము, ఆధారము, పాశము,మూల ధనము. కర్ష అనగా దున్నుట,లాగుట,ఆకర్షించుట అనే అర్థాలు ఉన్నాయి.
ముక్కు చివరతో చెవి మొదలిటిని లాగెనన్నట్లు.
 ముక్కు కొస లేదా  ముందు భాగాన్ని పట్టుకొని చెవి చివరిదాకా లాగడం  సాధ్యం కాదని అర్థము.
మరి  ముక్కు కొన పట్టుకొని చెవి చివరిదాకా లాగడమనేది  సాధ్యమయ్యే పనేనా అంటే సాధ్యం కాదనే చెప్పాలి.ఇది అతిశయోక్తిగానో, అసహనంతోనో అన్నదిగా భావించవచ్చు.ఇది "వేలికి వేస్తే కాలికి- కాలికి వేస్తే వేలికి అనే సామెతతో పోల్చి చెప్పవచ్చు.
అంటే ముఖాముఖీ గానో,ముక్కు సూటిగానో త్వరగా పరిష్కారం కానివ్వకుండా, సమస్య యొక్క మూల కారణం వదిలేసి తెగేంత వరకు లాగడానికి, ఒక పట్టాన నిర్ణయానికి రానీయకుండా చేసే చర్యనే  "నాసికాగ్రేణ కర్ణ మూల న్యాయము" అంటారన్న మాట. 
కొందరు వాళ్ళ తాలుకు సమస్య గురించి చర్చ నడుస్తుంటే దాని నుండి తప్పించుకోవడానికి  వేరే ప్రస్తావన తీసుకుని  వచ్చి దానిని దీనిని కలగాపులగం చేసి చికాకు చేస్తుంటారు.అంతటితో పోనీయకుండా "బోడి గుండుకు మోకాలికి ముడి" పెడుతుంటారు.
 బోడి గుండుకు మోకాలికి ముడి పెట్టడం" అంటే  తెలుసు కదా!బోడిగుండు మీద ఎలాగూ జుట్టు ఉండదు.అలాగే మోకాలి మీద కూడా  లాగి ముడేసె జుట్టు అసలే ఉండదు.ఇక ఆ రెంటిని కలిపి ముడి వేయడం ఎలా కుదురుతుంది. కుదరదు కదా! అలాంటిదే ముక్కు కొనను చెవి చివరిని లాగి కలపడం కూడా.
మరెందుకు మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పి వుంటారనేది ఆలోచిద్దాం.
 కొందరు వ్యక్తులు ఇలాగే చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తిరకాసు పెడుతూ ఎదుటి వ్యక్తులను ఏమీ ఆలోచించుకోనీయకుండా, సరైన అవగాహన రానివ్వకుండా, నిరుత్తరులను చేస్తూ ఉంటారు.
ఆ విధంగా అర్థం పర్థం లేని  మాటలతో ఎంత పెద్ద సమస్యనైనా పక్కదారి పట్టించి, దాని నుండి తాము తెలివిగా తప్పించుకొనే ప్రయత్నం  చేస్తుంటారు.అలాంటి వాళ్ళను ఎలా నిలువరించాలో తెలియక అయోమయంలో పడుతుంటాం . అదిగో అలాంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పినదే ఈ "నాసికాగ్రేణ కర్ణ మూల కర్షణ న్యాయము".
అసలు విషయం మరుగున పరిచి కొత్త సమస్యకు తెర లేపి జరిగే వాటిని సరదాగా ఓ సినిమాలా చూసే వాళ్ళు కూడా మన మధ్యలో చాలా మందే వుంటారు. అందుకే అలాంటి వారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పొంతన లేని వాటిని తీసుకుని వచ్చి, తాము తప్పించుకుంటూ సమస్యను మరింత జటిలం చేసేవారిని ఉద్దేశించి చెప్పడమే ఈ న్యాయము లోని అంతరార్థము.అది గ్రహించి మన జాగ్రత్తలో మనం ఉందాం. ఏమంటారు?

కామెంట్‌లు