సుప్రభాత కవిత ; -బృంద
పొగమంచు తెరలతో
నగమంత కప్పేసి
దినకరుడికి దారివ్వక
పగనెంతగ చూపినా
పగలవకుండా ఆపగలదా?

మబ్బులెన్ని కమ్మినా
ధారలెన్ని కురిసినా
నింగికి నేలకు వంతెనగా
నీటితీగలు సాగినా....
వెలుగు రేఖలనవి ఆపగలవా??

గగనమంత పరచుకున్న
కరిమబ్బుల గుంపులతో
భువనమంత చీకటిగ
మార్చేయాలనుకుంటే
సూర్యకాంతి తన పయనం ఆపునా?

చాపకింది నీరులా
వ్యాపించిన అధర్మం
అవని మీద రాజ్యం 
తనదేనని విర్రవీగితే
దునుమాడే అధికారం రాక మానునా??

సత్యమే జయించి తీరుననే
వేదవాక్యపు అర్థానికి
రూపురేఖలు మార్చివేసే
అవినీతిని  చెరపట్టక 
కాలచక్రం  ఆగునా?

అడ్డులన్నీ తొలగించి
గడ్డుకాలం రూపుమాపి
ఒడ్డు చేర్చే దైవం తాను
అవతరించి అన్యాయాన్ని
అందమొందించక  ఆగునా??

రేపటిపై ఆశ మాయక  
దైవంపై గురి తప్పక
మంచితనం నీడలో
మనగలిగేలా అసురత్వం
అణచివేసే అత్యవసరమైన
వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు