వాడుక భాష వధువుకు
బాజా భజంత్రీలు మోగించావు
నవ్య సాహితీ క్షేత్రంలో
నిత్య సత్యశోధకుడవు..!
అలుపెరుగని అభ్యుదయ
కవితా పితామహుడవు
నిర్భయ మనస్తత్వం
నిష్కల్మష అక్షర సంజీవుడవు..!
నీ మహోన్నత ప్రతిరూపం
దేశభక్తికి నిలువెత్తు దర్పణం
నీ కలంపాళీ కొసల్లోంచి
జాలువారిన ముత్యాలసరం..!
ఒట్టి మాటలు కట్టిపెట్టమని
గట్టి మేలు తలపెట్టమని
సాంఘిక దురాచారాలపై
సాహితీ సమరం చేశావు..!
తెలుగు భాషా కళామతల్లికి
మణి హారమైనావు
దేశమంటే మట్టి కాదన్నావు
ప్రజలే ప్రధానంగా ఎలుగెత్తి చాటావు..!
సాహిత్యమే కాదు
సంఘ సంస్కరణ బాధ్యతన్నావు
కన్యాశుల్క దురాచారంపై
నిప్పులు చెరిగిన నిర్భయుడవు..!
పుత్తడి బొమ్మ పూర్ణమ్మతో
బాల్యవివాహాలు ఖండించావు
అధునాతన దిద్దుబాటుతో
తెలుగు కథానికకు ఆజ్యం పోశావు..!
తెలుగు వినీలాకాశాన
ధృవతార మహాకవి గురజాడ
యువ కవులెందరెందరో
కవిగురువు గురజాడ అడుగుజాడ..!
(21సెప్టెంబర్, గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా..)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి