మబ్బుల వెనుక...;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు -9849305871
అంతరిక్షం ఆవల గాలి 
పరుచుకున్న ఆకుపచ్చ దేహం
రెపరెపల ఆశ విప్పుకున్న రెక్కలు
 
పూలు గుచ్చిన బాధ ముళ్ళ నాగళ్ళది 
తడిసిన పంటపొలాల కన్నీరు  విషాదప్రకృతి గుండె కోత
మనిషి ఉనికిని లక్ష్యించిన దాడిపై 
మానవత్వమే పోరాట ఆయుధం

చిరుజల్లులై ఎగిసి ముంచిన
నింగి నది ఓ ప్రళయగీతం 
మునిగిన నేల హాహాకార రణ క్షేత్రం
నీరైన ఒళ్ళంతా అలల కత్తి గాయాలు 
నీరైన ఖడ్గదాడి విలోమ పేరాశల దారి
 
నిద్ర లేవని సూర్యుడు వినని ఆర్తనాదం మనిషి నోటి గాయాలు 
తడి సోకని చెమట నీరైన వేదనకావ్యం 

ఎవరి మాట వినిపించని వాన మనసు 
తనువంతా అలల అల్లకల్లోల గర్భం 
ఏ వెన్నెల రాకకోసమో ఈ తండ్లాటలు 
ఏ సహాయ ఆత్మీయ చేతుల సోపతి కొరకో 
కష్టాలూ కన్నీళ్ళు కలిసిన కవిత్వం 
తడతడి తనువున రాసే మౌన రోదన 
మట్టీ మనిషి రాగానుబంధం 
జలాంతర్యామి ముంచెత్తిన పాట
ఎవరూ పాడని అస్తవ్యస్త విగత విషాదం
 


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Excellent balanced reflection through all angles of poetic vision over the present flood conditions. Congrats to the poet and publishers. Salutes