బాలలార! (శతకం) ;- -ఉండ్రాళ్ళ రాజేశం సిద్దిపేట -9966946084

1) అక్షరాలు దిద్ది కుక్షిలో నింపుమా
వర్ణమాల రాసి వన్నె గూర్చి 
గుణములన్ని నేర్చి గణపయ్య వ్రాయుము
భావి పౌరులార ! బాలలార!

2) తెలుగు భాషనందు వెలుగుల రవళులు
పాట మాటలందు పరవశంబు 
నడిచినంత పదము నవరస భరితంబు
భావి పౌరులార ! బాలలార!


3 కులము మతము జాతి కుళ్ళిన ముచ్చటల్
రక్త మొకటి చూడు రాజసమున
సర్వ ప్రాణులందు సర్వేశ్వరుడి రక్ష
భావి పౌరులార!బాలలార!

4) పుస్తకాలు నెపుడు మస్తకమ్ములనుండు
చదువు డనుచు పిలుచు సకలముగను
పూర్ణ విద్యలందు పొత్తమై నిలుచును
భావి పౌరులార!బాలలార!

5) నల్ల పలకనందు తెల్లని గీతలు 
బలపముగను కదుల భవిత వెలుగు
నలుపు రంగు కొరకు నల్లారపు సొబగు
భావి పౌరులార!బాలలార!

6) గుండు సున్నయనుచు గుండ్రటి రాతలు 
గీసినంత మురియు గీతలందు 
రాత మంచిగున్న రంజిల్లుచుండును
భావి పౌరులార!బాలలార!

7) చిరుగెనింత చొక్క చింపురు జుట్టుతో 
పరుగు పెట్టుతారు పరవశమున
లాగు రంద్రమైన సాగెదరుబడికి 
భావి పౌరులార!బాలలార!

8) ముక్కు చీమిడైన ముసిరిన ఈగలు 
గాయమందు చీము గడుసు పరుగు
పాసు పండ్లయందు పర్వాల ముచ్చట్లు
భావి పౌరులార!బాలలార!

9) ఈత కమ్మలందు నింపైన పంకలు 
తిరుగుతున్న తీరు మరుపు రాదు 
చొప్ప బెండుతోడ సోపతులాటలు
భావి పౌరులార!బాలలార!

10) నడకలందు దెబ్బ నల్లారపురసము 
కట్టు కట్టినంత కంటనీరు
దెబ్బమీద దెబ్బ దబ్బునఁ దగులును
భావి పౌరులార!బాలలార
!
11) వరుస చేతులందు వాయిలి బరిగల
మోత మోగుతుంది వాతలుగను
భయము కలిగివుండి బాధ్యతనెఱగుమా
భావి పౌరులార!బాలలార!

12) కష్టమెంతవున్న కదిలి సాగవలెను
ఇష్టపడిన చోటు పుష్టి మేలు
నడిచినట్టి త్రోవ నలువురు మెచ్చాలి
భావి పౌరులార!బాలలార!

13) అట్టపుట్టలనుచు చుట్టూర తిరుగాడి
వేయువరకు నిలిచి వెంబడించు
కొత్త పుటల కొరకు కొట్లాటలెన్నెన్నొ 
భావి పౌరులార!బాలలార!

14) గోలిలాటలందు గురి చూసి కొట్టాలి
సిర్రగోనెచింది చిరుత పరుగు 
చారు పత్త యాట సందడి చేసెనే
భావి పౌరులార!బాలలార!

15)  మంచి మాటనున్న మహినంత మిత్రులే
కలిసి మెలిసి నపుడు కలుగు సుఖము 
ధర్మ మార్గమెపుడు దండిగా గెలుచును
భావి పౌరులార!బాలలార!

16) ముద్దు ముద్దు మాట మురిపించు యెదలందు 
నవ్వుమోము తోడ నాట్యమాడు
కల్మషంబులేక కదులెడి బాల్యంబు
భావి పౌరులార!బాలలార!

17) ప్రకృతి ఒడిలోన పసిడి పత్రాలచే
ఆడి పాడుచుండు నందుకొనుచు
కొమ్మ చిక్కినంత కోటొక్క కాంతులు
భావి పౌరులార!బాలలార!

18) తొర్రి పండ్లనందు జుర్రుతూ తిరుగుతూ 
ఇల్లు వాకిలంత చల్లుచుండు 
కోపగించినంత కొంగొత్త యేడ్పులు
భావి పౌరులార!బాలలార!

19) సందులన్ని తిరిగి చిందులు వేయుచు
బురద మట్టినందు పోరుసలిపి 
ఒళ్ళు మరిచిపోవ నొడలంతహాయినౌ 
భావి పౌరులార!బాలలార!


20) గంజి నీళ్లతోడ గట్కతో భోనమై 
అంచు మిర్చినద్ది చుంచుకుంటు
తాగినంతలోన తనువంత మురియదే
భావి పౌరులార!బాలలార!

21) మాడినట్టి బువ్వ మమకారమును పెంచు 
నూకలన్నమైన నోటదిగును
పర్వమొచ్చినపుడు పలుకుల బిర్యాని
భావి పౌరులార!బాలలార!

22) పప్పు దినుసులున్న పదుగురి బోనంబు 
పచ్చి పులుసు దావ పరవశంబు 
అంచుకావకాయ నాకలి తీర్చును
భావి పౌరులార!బాలలార!

23) పచ్చటాకులందు పరమాన్న మెట్టుచూ 
కొత్త పండుగంటు కోటి ప్రభలు 
సద్దికూడు నందు సకల నైవేద్యంబు
భావి పౌరులార!బాలలార!

24) జాతి కులమనుచును జగతి నందున లొల్లి 
రక్తమొకటి కాద రణమునందు 
వైరి వర్గమొదులు బ్రతికిన రోజులు
భావి పౌరులార!బాలలార!

25) నలుపు తెలుపు యనుచు నలుసైన మాటలు 
రూపుమార్పు కొరకు రొంపులాట
గొప్పలెందుకోయి గుణములుంటే చాలు
భావి పౌరులార!బాలలార!

26) అమ్మ భాషలందు నమృతము చిందును 
తెలుగు మాటలాడి వెలుగు నింపు 
అమ్మ వొడిన భాష కమ్మని పలుకులు
భావి పౌరులార!బాలలార!

27) అమ్మ భాషతోడ నన్యభాషలు నేర్చి
వేషమంత మార్చ వెర్రితనము 
అవసరాల కొరకు నన్యంబు మాట్లాడు
భావి పౌరులార!బాలలార!

28) ఒకటి రెండు యనుచు ఎక్కాలు నేర్చుకో 
లెక్కలన్ని చేయుపెక్కువిధము
గణిత శాస్త్రమెపుడు ఘనముగా కీర్తించు
భావి పౌరులార!బాలలార!

29) ప్రతిభ నుండవలెను పాఠాలు నేర్వగ
జతన చదవవలెను జడుపులేక
జీవ జాలమందు జీవవైవిద్యంబు 
భావి పౌరులార!బాలలార!

30) సంఘనీతి నందు సమరసభావము
పౌర హక్కులందు సౌరువిరియ 
సకల చరితలందు సమసమాజ ప్రమధ
భావి పౌరులార!బాలలార!

31) ఆటలాడవలెను పోటీన గెలువగా
ఓర్పు నుండవలెను వోటమైన
బొమ్మ బొరుసులందు పోరాట ఘట్టము
భావి పౌరులార!బాలలార!

32) కాళ్ళయందుమట్టి గట్టిగా నొత్తుతూ 
గుడులు చేయుచుండ్రి గడుసువారు
పైన పందిరేసి బాజాల సందడి
భావి పౌరులార!బాలలార!

33) చినుకు పడిన చాలు చిరునవ్వు సాగరము
మడులు కట్టి మురిసి మలుపు తిప్పి
తోక పడవ తోటి తొక్కులాట వరుస
భావి పౌరులార!బాలలార!

34) చెరువు నిండినంత ఎగురుతూ దూకుతూ
ఈత కొట్టువారు కూతబెట్టి 
గట్టు నుంచి బెట్టు గడియల తానాలు 
భావి పౌరులార!బాలలార!

35) చేదబావి నందు చేతాడు పరుగులు
నీళ్లు బొక్కెనందు నిండుగొచ్చు 
పట్టుతప్ప  పట్టె పాతాళగరిగెను
భావి పౌరులార!బాలలార!

36) చిట్టి గోతినందు పొట్టి మొక్కలు నాటి 
చుట్టు కంచె వేసి గట్టిజేసి
నీళ్లు పోసినంత నిలబడివృక్షమౌ
భావి పౌరులార!బాలలార!

37) పచ్చనైన చెట్లు పలు రకాలుగమేలుఁ
జెట్టు నీడ జీవి సేదదీరు
కాలమందు తరువు  కాపాడునేగదా
భావి పౌరులార!బాలలార!

38) పుస్తకంబు నెపుడు హస్తభూషణమౌను
కలము కదులుచుండ కార్యసిద్ధి
రెండు జతగనున్న రెట్టింపు ధైర్యంబు
భావి పౌరులార!బాలలార!

39) బక్క పలుచనైన బలశాలి చదువులో
పొట్టి వాడి మనసు గట్టి తనము 
అక్షరమున లేదు నవయవలోపంబు
భావి పౌరులార!బాలలార!

40) కాలినడకనైన గాలి మోటరైన 
మనిషి జీవితమున మనుగడకును 
నిలుపు నట్టి చోటు నిజమైన విద్యయే
భావి పౌరులార!బాలలార!

41) నీతి న్యాయమందు నిలుచును ధర్మంబు 
మంచి మార్గమున్న మరులుగొలుపు
ఒక్కటైన మాట ఒనరుగ బంధమౌ
భావి పౌరులార!బాలలార!

42) పిచ్చి గీతలందు వచ్చిన చిత్రము
మదిన తలుపులన్ని హృదిన దెఱుచు 
బొమ్మలేన్నొ వేయ బోసి నవ్వుల బాట 
భావి పౌరులార!బాలలార!

43) ఇంటి పనుల యందు నింపైన పాఠంబు
పాట పద్యమైన పరవశంబు 
వల్లె వేసినంత వడివడి చదువులు
భావి పౌరులార!బాలలార!

44) పద్యమెపుడు నిలుచు పదికాలములపాటు 
కంఠమందు సాగు కమ్మదనము
రాగయుక్త మందు రమణీయ పాదాలు
భావి పౌరులార!బాలలార!

45) ప్రాసలందు సాగి పాడగా గేయమై
భావి జీవితాన భవ్యమౌను
శ్రావ్య సుందరంబు సౌధామి సంబ్రంబు
భావి పౌరులార!బాలలార!

46) బడిన బాలలున్న బలము చేకూరును 
సకల విద్యలందు శౌర్యమలరు
విద్యసాగరంబు విజ్ఞులనిలయాలు
భావి పౌరులార!బాలలార!

47) గదుల నిండుగున్న గబగబా యరుపులు
తోడుబాలలున్న దూరి పలుకు 
సందడైన చోట సరితూగు విద్యలు
భావి పౌరులార!బాలలార!

48) మదిన తప్పులున్న మనసంత గాయాలు 
తప్పు మీద తప్పు ఒప్పులౌను
మసక చీకటిగను మనమున చిక్కులు
భావి పౌరులార!బాలలార!

49) గచ్చు మీద నున్న గమ్మత్తు గిల్లుడు
పిన్న వయసులందు పిలుపు మైత్రి 
బల్లలేని బాధ బాలలకుండదు 
భావి పౌరులార!బాలలార!

50) మాట చురుకుదనము మంత్ర పరిమళము
కఠిన భాషనంబు కన్నులందు 
తప్పులేని మాట తడవడదెప్పుడు
భావి పౌరులార!బాలలార!

కామెంట్‌లు