న్యాయాలు-633
భామతీ న్యాయము
*****
భామతి అనగా ఒక పేరు, స్త్రీపేరు.
భామతి అను స్త్రీ భర్తను సంతోష పెట్టిన తీరు అని అర్థము.
భామతి అనే స్త్రీ మూర్తి కథ చరిత్రలో నిజంగా జరిగిన కథ. ఇది చదువుతుంటే అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది.మహిళ వివాహం అనే బంధానికి అత్యంత విలువనిస్తూ తన జీవితాన్ని భర్త సేవలకు అంకితం చేసిన విధానం తెలుసుకుందామా...
అనేక రచనలు చేసిన గొప్ప పండితుడు, భారతీయ తత్వవేత్త మరియు అద్వైత వేదాంత పాఠశాలల్లో ఒకటైన భామతీ పాఠశాల స్థాపకుడు. ఈ వాచస్పతి మిశ్రా క్రీస్తు శకం 900-980 మధ్య కాలంలో( అనగా 9వ శతాబ్దంలో) భారత దేశం నేపాల్ సరిహద్దుల్లోని మిథిలా ప్రాంతంలోని వాచస్పతి అనే నగర్ లో జన్మించాడు.వాచస్పతి మిశ్రా భార్య పేరు భామతి.
మరి ఈ భామతి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం.
వాచస్పతి తల్లి వత్సల భర్త సహకారం లేకపోవడంతో తల్లీ తండ్రీ తానే అయ్యి అనేక రకాల బాధలు పడుతూ కొడుకును మంచి విద్యావంతుడిని చేసింది. ఆమె తన కుమారుడికి వివాహం చేసేందుకు తాము ఉండే గ్రామానికి పక్కనే ఉన్న ఓ ఊరి అమ్మాయిని వివాహం చేసుకోవలసిందిగా కొడుకును పట్టుబట్టింది.
తల్లి మాటలు కాదనలేని వాచస్పతి ఆ అమ్మాయి తండ్రికి తనకు సంబంధించిన జీవిత లక్ష్యాన్ని వివరిస్తూ ఓ సందేశం పంపుతాడు. అదేమిటంటే "నేను బాదరాయణ వ్యాసుని వేదాంత సూత్రాలు అనగా బ్రహ్మ సూత్రాలపై భాష్య యొక్క వివరణను అనగా వ్యాఖ్యలు రాయడమే నా జీవిత ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాను.ఇది మానవాళికి నేను చేసే సేవ.ఈ గ్రంథాలన్నీ కూడా నా ప్రాణం కంటే ప్రియమైనవి.ఇలాంటి స్థితిలో ఉన్న నేను గృహస్థ బాధ్యతను నిర్వహించలేను. నేను మంచి భర్తను కాగలనా? కాలేనని సందేహంగా ఉంది. ఎందుకంటే నా మనసులో మరింకే ఆలోచనలు లేవు.కేవలం బ్రహ్మ సూత్ర భాష్యం రాయడం తప్ప.అది రాసిన తర్వాత నేను సన్యాసాన్ని స్వీకరిస్తానని ప్రమాణం కూడా చేశాను." అని తెలియజేస్తాడు.
ఆ వధువు తండ్రి ఈ సందేశం చదివి యువకుడైన వాచస్పతి పాండిత్యాన్ని, అతనిలోని స్పష్టత,స్వచ్జత మరియు నిబద్ధత, నిజాయితీకి ఆనందపడతాడు.ఎంతో గౌరవంతో అతనికి తన కుమార్తె భామతిని ఇవ్వాలని అనుకుంటాడు. విషయాన్ని చెబుతాడు.అప్పుడు భామతి తండ్రి చెప్పిన విషయానికి,అన్ని షరతులకు కట్టుబడి ఉంటానని చెబుతుంది.
వెంటనే భామతి తండ్రి ఈ విషయాన్ని తల్లి వత్సలకు తెలియజేస్తూ , వాచస్పతిని తన కుమార్తెను కలవాలనుకుంటున్నారా? చెప్పమని అడుగుతాడు.వాచస్పతి చిరునవ్వుతో ఆమె నన్ను ఇంతకు ముందే ఎన్నుకుంది కాబట్టి ఆమె ఎంపికను తిరస్కరించే హక్కు నాకు లేదు" అంటాడు.
అలా వ్యాస పూర్ణిమ రోజున భామతిని వివాహం చేసుకుంటాడు. అయితే అదే రోజు తాను అనుకున్న పనిని మొదలు పెట్టడానికి అత్యంత పవిత్రమైన రోజు. అందువల్ల పెళ్ళి కూతురుతో ఇంటికి చేరిన మరుక్షణమే రాయడం మొదలు పెడతాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు రేయనక పగలనక రాస్తూనే ఉంటాడు. చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులు ఏం మారాయో అతనికి తెలియదు. దైనందిన కార్య కలాపాల్లో శారీరక సంబంధమైన నిత్య జీవిత అవసరాలకు కొంత సమయం, మిత ఆహారం,మిత నిద్ర.. ఇక మిగిలిన సమయమంతా రాయడంలోనే మునిగి పోయాడు.
అలా అతడు ఏళ్ళ తరబడి రాస్తూ ఉన్నప్పుడు అతని భార్య భామతి ఎలాంటి విసుగు, విరామం లేకుండా అతని రచనా వ్యాసంగానికి ఎలాంటి లోటూ రాకుండా సేవలు చేసింది.
అతడికి వివాహమై భార్య ఉందన్న స్పృహలో లేనంత పనిలో మునిగి పోయాడు.అయితే తాను రాయడానికి తాటి ఆకులు సిద్ధంగా ఉండడం.దీపంలో నూనె నింపి రాత్రి పూట రాయడానికి వీలుగా అమర్చబడి వుండడం. రోజూ తాను ధరించే దుస్తులు ఉతికి తాజాగా కనిపించడం.వాటితో పాటు వేళకు ఆహారం తనకు అందివ్వ బడడం గమనించాడు కానీ అవన్నీ ఎలా ఎవరి వల్ల జరుగుతున్నాయో ఆలోచించలేదు.తన ఆలోచనలన్నీ రచనా వ్యాసంగం మీదే.అలా ఒకానొక రోజు రాత్రి అతని వ్యాఖ్యానాల పుస్తకం పూర్తి అయ్యింది.తాను కూర్చున్న ఆసనం మీద నుంచి లేవబోతూ దీపం వెలుగులో తనకు భోజనం సిద్ధం చేస్తున్న స్త్రీ మూర్తి కనిపించింది.ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వెవరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావని? అడుగుతాడు.
చాలా సంవత్సరాల క్రితం తనను వివాహం చేసుకున్న విషయాన్ని భామతి చెబుతుంది.
వాచస్పతి ఆశ్చర్య పోతాడు.ఏడు సంవత్సరాలుగా తన ఎదుట పడకుండా తనకు ఏ లోటూ రాకుండా సేవ చేస్తున్న ఆమెను అలా చూసేసరికి అతడికి దుఃఖం వస్తుంది. జారుతున్న కన్నీళ్ళతో ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని" ఇన్ని సేవలు చేసిన ఈ చేతులు నాకు తెలుసు కానీ ఇప్పుడెలా.. నేను ఈ వ్యాఖ్యానాలు పూర్తి చేసిన రోజునే సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్తానని ప్రతిజ్ఞ చేశాను." ఆవేదనతో అంటాడు.
ఆ మాటలకు భామతి "బాధ పడకండి. నేను మీ దారికి ఎప్పుడూ అడ్డు రాను.మీరు నన్ను ప్రేమిస్తున్నారని అర్థమైంది.అది చాలు నా జీవితానికి" అంటుంది. ఆ మాటలకు మంత్రముగ్ధుడైన వాచస్పతి "నాలాంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చు కానీ ఎలాంటి షరతులు లేని ప్రేమ, సహనం, హృదయ సంస్కారం, గొప్ప తనం గల స్త్రీమూర్తి ఉండటం అరుదైన విషయం.ఈ వ్యాఖ్యానాల పుస్తకానికి భామతి అని పేరు పెడతాను. చదివిన వారందరూ నిన్ను గుర్తుంచుకోవాలి." అంటూ ఆమె త్యాగానికి ప్రతీకగా తాను రాసిన వ్యాఖ్యానానికి భామతి అని పేరు పెడతాడు. అంతే కాదు తన జీవిత లక్ష్యం,పని ఆమె ప్రేమకు సాటి రాదని చెబుతూ ఆమె పాదాలకు శరణాగతి చేస్తున్నానని అంటాడు.
తాను సన్యసించి ఇల్లు వదిలి పోయాక ఏం చేస్తావు? ఎలా వుంటావు నిన్ను నీవు ఎలా చూసుకుంటావని అడిగితే చిరునవ్వుతో మీకు సేవ చేసే అవకాశం ఇచ్చిన భర్తే నన్ను చూసుకుంటాడు.మీ అంకిత భావం, చిత్తశుద్ధి నాకు స్ఫూర్తి నిస్తూ ఉంటాయని చెబుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే వాచస్పతి గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ అతని భార్య భామతి తన గుణగణాలతో మానసికమైన దివ్య సౌందర్యంతో దైవికమైన స్త్రీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది.
భర్తకు సేవలు చేస్తూ వారి ఉన్నతికి నిరంతరం శ్రమించే స్త్రీలను మన పెద్దవాళ్ళు "భామతి న్యాయము"తో పోల్చి చెబుతుంటారు.
మనం ఈ న్యాయము ద్వారా ఓ మహోన్నతమైన మహిళా మణిదీపమైన భామతి గురించి తెలుసుకో గలిగాం. చిటికెడు ప్రేమాభిమానాలు అందిస్తే బతుకంతా అంకితం చేసే స్త్రీమూర్తులు కోకొల్లలుగా ఉన్నారు.అలాంటి స్త్రీలు మన చుట్టూ సమాజంలో నాడూ నేడూ ఉన్నారు.ఎప్పుడూ ఉంటారు కూడా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి