శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న
కుదమ తిరుమలరావు 1989లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, తన నిరంతర కృషితో విద్యార్థులందు పెక్కు సామర్ధ్యాలు మెరుగుపరుస్తూ సత్ఫలితాలను సాధించడంతో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా 2009లో పొందారు.
కుదమ గ్రామానికి చెందిన కుదమ తిరుమలరావు,
అరంజ్యోతి, నరసింగరావులకు నాలుగో కుమారుడు.
వారి ధర్మపత్ని సుకన్య
రాజాం సెంటాన్స్ స్కూల్ లో హిందీ టీచర్.
ఏకైక సంతానమగు
కుమార్తె స్నేహ
అల్లుడు కుప్పిలి సందీప్
హైదరాబాద్ లో నివసిస్తున్నారు.
భామిని మండలం పసుకుడిలో తన తొలి సేవల్లో భాగంగా ఆ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల విధానాన్ని అమలుపర్చి మండలంలోనే తొలి ఆచారాన్ని నెలకొల్పారు. వనస్రవంతి వారి సహకారంతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించి మంచి వాతావరణం నెలకొల్పారు. బాలబాలికలను మండల కేంద్రానికి తీసుకుని వెళ్ళి మండల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, తంతి తపాలా కార్యాలయంలను సందర్శింపజేసి, అక్కడ జరిగే విధి విధానాలను అవగాహన పర్చారు. రెండో పాఠశాల వీరఘట్టం మండలం దశుమంతపురంలో కూడా మండలంలోనే తొలి ఏకరూప దుస్తుల విధానాన్ని అమలుపర్చి, పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖాధికారి లింగమూర్తి ప్రశంసలు అందుకున్నారు. ఆ గ్రామంలోనూ, పాఠశాలలోనూ, రామమందిరంలోనూ తన చేతిరాతతో బొమ్మలు, అక్షరాస్యతా నినాదాలు చిత్రీకరించారు. గుణాత్మక విద్యాసాధనకై అనునిత్యం పరిశ్రమించడంతో మూడవ, నాల్గవ, ఐదవ పాఠశాలలైన నడిమికెల్ల, చలివేంద్రి, నర్శిపురంగోరలలో పనిచేస్తుండగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందారు తిరుమలరావు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించి అనేక విద్యా పథకాలను విజయవంతంగా అమలు చేసారు. ఆరో పాఠశాల సంతకవిటి మండలం మాధవరాయపురంలో పనిచేస్తుండగా ఆ పాఠశాల ఎ ప్లస్ గ్రేడ్ పాఠశాలగా జిల్లా స్థాయిలో ఎంపికై ప్రధానోపాధ్యాయులుగా తిరుమలరావు పురస్కారాన్ని అందుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ గా తన చివరి పాఠశాల గడిముడిదాం కాగా, స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతిపై రాజాం మండలం కొత్తవలసలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టారు. పాఠశాలను సందర్శించిన విజయనగరం డైట్ లెక్చరర్స్ బృందం తిరుమలరావు సేవలను జిల్లా సదస్సులో కొనియాడారు. నేడు కొత్తూరు మండలం కడుము హైస్కూల్ లో పనిచేస్తున్నారు.
విద్యార్థులలో సృజనాత్మకత పెంచే దిశగా కవితలు, పాటలు, నటనా రంగం, చిత్రలేఖనం, పత్రికా వ్యాసంగం, సామాజిక సేవాకార్యక్రమాలు కూడా ప్రవృత్తిగా గావించారు తిరుమలరావు.
సాహిత్య, కళల ప్రస్థానంలో భాగంగా అనేక ఉన్నత శిఖరాలను చేరుకోవడం మిక్కిలి అభినందనీయం.
విజయనగర సామ్రాజ్యం చరిత్ర - దిక్సూచి అను గ్రంధంలో స్థానం పొందుట,
విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆవిష్కృతమైన
"ఆదినుండి అనంతందాకా" గ్రంథంలో తన కవిత ప్రచురితమగుట,
ప్రపంచ తెలుగు మహాసభల 1994 సంకలనం తెలుగు జగతిలో కళ్ళు
అను కవిత చోటు చేసుకోవడం బహు ప్రశంసనీయం.
మాతృస్ఫర్శ, నీస్నేహం, ప్రాణదాత, ఆకుపచ్చనినేస్తం, కొండగట్టుఆంజనేయం,
తిరుమలతిరుపతిచరిత,
అవినీతిపైఅక్షరాయుధం,
గాంధేయం, నిశాచరి, కరోనాపైసమరం, పొడుస్తున్నపొద్దు,
కవన, స్పందన, కవనకిరణాలు, తిరుపతి బ్రహ్మోత్సవాల సంకలనం
మున్నగు వందకు పైగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి సంకలనాలలో తిరుమలరావు కవితలు ప్రచురితమైనాయి.
ఈ నేపథ్యంలో తిరుమలరావుకు
పురస్కారాలెన్నో వరించాయి.
హైదరాబాద్ తెలుగు కళా వైభవం వారిచే సహస్ర కవిమిత్ర బిరుదాంకిత పురస్కారం,
విద్యల నగరం విజయనగరం వాగ్దేవి సమారాధనం వారిచే 2024 ఉగాది సందర్భంగా
వాగ్దేవి విద్యా భారతి బిరుదాంకిత ఉగాది పురస్కారం,
తెలుగుదీప్తి, తెలుగుతేజం, తెలుగు భాషాభిమాని, హైదరాబాద్ లో విద్యారంగ లెజెండరీ పి.వి.అవార్డులు,
అమరావతి పురస్కారం వంటి అనేక పురస్కారాలు పొందారు.
జన్మభూమి పాటలపోటీలో రాష్ట్ర విజేతగా రాష్ట్ర ప్రభుత్వం చే పురస్కారం, సెన్సస్-2001 పురస్కారం,గురుస్పందన, గురుబ్రహ్మ, సర్వేపల్లి పురస్కారం, కాళోజీ పురస్కారం,
గోదారమ్మపురస్కారం, విజయనగర ఉత్సవాల, బొబ్బిలి రచనా సమాఖ్య గురుబ్రహ్మ పురస్కారాలు వందకు పైగా పొందారు. కవితలు1000కి పైగా, ప్రచురణ300కి పైగా, బహుమతులు 100కు పైగా వారి ఘనత అని చెప్పక తప్పదు.
పాతిక వరకూ చిన్న చిన్న పుస్తకాలు ఆవిష్కరణ ఐనవి.
నీహారిక నవలలో 13వ భాగం రచయిత,
త్వరలో మాయాలోకం నవలలో 35వ భాగం తన రచన.
అంతర్జాతీయ స్థాయిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు మరో వందకు పైగా అంతర్జాతీయ తెలుగు సంఘాలు సంయుక్తంగా అంతర్జాలం ద్వారా వారంరోజుల పాటు హమ్ ఫర్ నేచర్ అనే అంశంపై నిర్వహించిన పాటల పోటీల్లో 2400 మంది పాల్గొని ఆలపించగా కేటాయించిన 9 బహుమతుల్లో కుదమ తిరుమలరావు ఆలపించిన స్వీయ గీతానికి 8వ బహుమతి లభించింది.
పదేళ్ల సర్వీస్ లోనే
మండల, జిల్లా బెస్ట్ టీచర్ అవార్డులు అందుకున్నారు తిరుమలరావు.
పదిహేనేళ్ళ సర్వీస్ లో
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా,
ఇరవయ్యేళ్ల సర్వీస్ లో
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు తిరుమలరావు.
నిరంతర కృషితో విద్యార్థులకు చదువుల స్థాయిని పెంచే దిశగా అడుగులు వేస్తూ, దస్తూరీ లేఖనం, సరైన ఉచ్ఛారణతో పఠన నైపుణ్యాలను కలిగిస్తుంటారు.
తాను నిరాడంబరంగా ఉంటూ, సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ, దుర్వసనాలకు లోను కాకుండా మెలుగుతూ, విద్యార్థులు కూడా పాటించాలని తిరుమలరావు పిలుపునివ్వడం జరుగుతోంది. తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించే లక్ష్యంలో భాగంగా ఇరవైనాలుగు తాళపత్ర గ్రంథాలను సేకరించి ఆనాటి కలెక్టర్ కోటేశ్వరరావుకు అందజేసారు తిరుమలరావు.
పాఠశాల కార్యక్రమాలన్నింటినీ నెరవేర్చుతూ, వాటి పరమార్ధాన్ని బాలబాలికల మదిలో ముద్రితమయ్యేలా తిరుమలరావు శ్రమిస్తున్నారు. ఇంకా ఐదేళ్ల సర్వీసు కలిగియున్న తిరుమలరావు, తనదైనశైలిలో సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయుడుగా ప్రఖ్యాతి నొందుతున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి