ఆ కుర్రాడే ఓ మహాను భావుడు ;- యామిజాల జగదీశ్ఇ
 
ద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు.
"మీ అబ్బాయి ఏడీ" అని అడిగాడు మిత్రుడు.
"మా వాడా, ఎక్కడైనా  మూల గుడ్డు మీద కూర్చుని ఉంటాడు" అన్నాడు కుర్రాడి తండ్రి.
"ఏమిటీ, గుడ్డు మీదా....అదెలా సాధ్యం. అయినా కూర్చోవడానికి మరొక చోటంటూ లేదా" అడిగాడు మిత్రుడు.
మా వాడు చేసేదల్లా విచిత్రంగానూ వింతగానూ ఉంటుంది. నిన్నేం జరిగిందో అడగండి....వాడు చాలాసేపు ఇంట్లో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడా అని వెతికాను. చివరికి వాడు పెరట్లో ఓ మూల కొన్ని గుడ్లను నేల మీద ఉంచి వాటి మీద కూర్చున్నాడు. ఏమిట్రా అది అని అడిగాను. దానికి వాడిచ్చిన జవాబేంటో తెలుసా...మన ఇంటి కోడి చేస్తున్నట్టే నేనూ చేసాను. గుడ్ల నుంచి కోడిపిల్లలను రప్పించబోతున్నాను అన్నాడన్నాడు.
బలేవాడురా మీ వాడు. ఈ వయస్సులోనే వాడు పరిశోధనకు దిగిపోయాడు. వాడి బుర్ర ఎంతలా ఆలోచిస్తోందో కదూ...అన్నాడు మిత్రుడు.
వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగా, బయటకు వెళ్ళిన  ఆ కుర్రాడు అక్కడికి వచ్చాడు.
ఆ కుర్రాడి జుత్తంతా చెదరిపోయి ఉంది. బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. వాడివి చూసీచూడడంతోనే ఏమిట్రా అలా ఉన్నావు...ఏమైంది అని అడిగాడు కుర్రాడి తండ్రి.
వెంటనే ఆ కుర్రాడు చెప్పడం మొదలుపెట్టాడు...
నేను వస్తున్న దారిలో ఓ పొడవాటి గొట్టం ఉంది. దాని మీద వృత్తాకారంలో ఓ మూత ఉంది. ఆ మూతను తెరచి దాని గుండా గోధుమను పోస్తున్నారు కొందరు. వాళ్ళు అట్టా పోస్తున్న గోధుమ లోపలకు వెళ్ళి ఎలా బయటకు వస్తోందా అని చూడాలనే ఆశ కలిగింది. వెంటనే నేనా దాని మీదకు చకచకమని ఎక్కాను. పైభాగన ఉన్న రంధ్రం గుండా లోపలకు తొంగి చూసాను. అప్పుడు కాలు జారి లోపల పడిపోయాను అన్నాడు.
అయ్యో, ఆ తర్వాత అని కంగారుగా అడిగాడు తండ్రి.
మంచివేళ...వెంటనే అక్కడున్న పనివాళ్ళు నన్ను కాపాడారు. లేకుంటే లోపల నలిగి చనిపోయి ఉంటాను అన్నాడు ఆ కుర్రాడు.
అతనికి మాత్రమే కాదు, మనందరికీ అది  మంచి కాలమే. ఎందుకని అడుగుతున్నారా....అతను గానీ ఆ రోడ్డు ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటే, మనకు ఈరోజు గ్రాంఫోన్ తెలిసేది కాదు. సినిమా హాల్లో సినిమా చూసేవాళ్ళం కాదు. ఇంట్లో స్విచ్ వేస్తే దీపం వెలిగేది కాదు. ఈ అద్భుతాలన్నింటికి ముఖ్యకారకుడు ఆ చిన్నోడే. వాడి పేరు థామస్ ఆల్వా ఎడిసన్.  

కామెంట్‌లు