న్యాయాలు-631
బర్హి ర్న్యాయము
****
బర్హిస్సు అనగా కుశ లేదా దర్భ,బలి గడ్డి అనే అర్థాలు ఉన్నాయి.
కుశ ఖండము వలె."బర్హిర్దేవసదనం దామి" అనగా దేవతలకై కుశను ఖండించు చున్నాను " అను వాక్యముపై ఈ న్యాయము ఆధారపడి ఉంది. అనగా దేవతల పూజకు దర్భ అంత అవసరం లేదు దాని కొనముక్క మాత్రం చాలు.కావున ఖండ మాత్రమే బర్హిస్సు గ్రహింపబడుతున్నది.అలా ముఖ్య భాగ గ్రహణమునకు ఈ "బర్హి ర్న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.అంటే జీవితంలో ఏది ముఖ్యమో దానిని గ్రహించుట అని భావము. అంటే మిగతా ఆలోచనలు వదిలేసి ముఖ్యమైన దానిని గ్రహించడం.
మరి ఈ "బర్హి ర్న్యాయము" నకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనం ఉంది.అదేంటో తెలుసుకుందామా,..
అనగనగా ఒక రాజు వ్యసన పరుడు .ఎలాంటి వ్యసనపరుడంటే యజ్ఞయాగాదులు చేసి జీవితాన్ని శాశ్వతం చేసుకోవాలనే వ్యసనం.
ఆయన చేసిన యజ్ఞాలలో ఉపయోగించిన బర్హిస్సు అనగా దర్భలను ప్రాచీనాగ్రములుగా/తూర్పు కొసలుగా ( చివరలను )తీర్పుగా, నేర్పుగా అలా నేల మీద కనుక పరిచినట్లయితే ఇల (భూమి) అంతా ఆక్రమిస్తాయట. అంటే దర్భలను అంతగా ఉపయోగించుకున్నాడ న్న మాట.అందుకే ఆ మహారాజుకు ప్రాచీన బర్హి అనే మరో పేరు కూడా స్థిరపడింది.
ఈ రాజు తన శరీరం శాశ్వతమనుకొని,ఈ భూమి మీద తాను శాశ్వతంగా ఉండిపోతాననుకొని అంతులేని అజ్ఞానంలో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడట.అతడి అజ్ఞానాన్ని తొలగించి త్వరగా జ్ఞానోదయం కలిగించేందుకు నారద మహర్షి ఈ ప్రాచీన బర్హికి ఓ కథ చెబుతాడు. ఆ చెప్పిన కథ పేరు 'పురంజనోపాఖ్యానం.
పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు ఉండేవాడు.అతడు తాను సుఖంగా నివసించడానికి అనుకూలమైన ప్రదేశాన్ని వెదుకుతూ ఈ భూమండలంలో అనేక ప్రాంతాలు తిరిగాడు.కానీ ఎక్కడా తాను అనుకున్నట్లు లేదు.చివరికి హిమాలయ పర్వతాల దక్షిణ సానువుల్లో కొసన ఉన్నటువంటి ఒక దుర్గాన్ని చూస్తాడు.అది బాగా నచ్చి అందులో ఉందామని అనుకుంటూ ఉండగా అందులోంచి చాలా అందమైన ఓ స్త్రీ బయటకు వస్తుంది.అంతేకాదు ఆమె వెనుక ఓ ఐదు తలలున్న పాము, ఆమెకు కాపలాగా పదకొండు మంది కాపలా భటులు వచ్చారు.మళ్ళీ వారి ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు.ఆవిడను చూసి పురంజనుడు ఎవరు నీవని? అడుగుతాడు.
ఆమె తానెవరో తనకే తెలియదని,తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదని, తానొక్కతే ఒంటరిగా కోటలో ఉంటున్నానని చెబుతుంది.
ఆ తర్వాత వారిద్దరూ కలిసి వందేళ్లు సుఖంగా జీవిద్దాం అనుకుంటూ వున్నప్పుడు ఆ స్త్రీ ఈ కోటకు తూర్పున ఐదు ద్వారాలు ఉన్నాయి.ఆ ఐదింటి నుండి బయటకి వెళ్ళాలంటే ఒక్కో కోట ద్వారంలోంచి బయటకు వెళ్ళాలంటే ఒక్కో మిత్రుడిని తీసుకుని వెళ్ళాలి.అలా బయటికి వెళ్ళి ఆ దేశంలో హాయిగా విహరించి రావచ్చు అంటుంది.అలా వాళ్ళు వివాహం చేసుకుని సుఖ జీవనం చేస్తారు.
అయితే నారదుడు ప్రాచీన బర్హితో ఆ పురంజనుడు ఎవరో కాదు మనిషే.ఇక్కడ మేడగా చెప్పబడింది శరీరంలోని తల.ఐదు తలల పాము పంచ ప్రాణాలు. పదకొండు మంది భటులు పంచ జ్ఞానేంద్రియాలు,పంచ కర్మేంద్రియాలు.ఇక ఐదు ద్వారాలు కళ్ళు , ముక్కు, చెవులు నోరు... ఇలా మనిషి దేహాన్ని విభజించి చెబుతాడు. ఆ తర్వాత దేహమనే కోటను కాల కన్య మృత్యు రూపమై పడగొట్టేయ గలదని,అలా చేసినప్పుడు ఐదు తలల పాము బయటకు వెళ్ళి పోతుందనీ,అలా వెళ్ళపోవడం అంటే ప్రాణాలు కోల్పోవడమనీ,ఆ తర్వాత కోట అగ్ని హోత్రంలో పడి కాలిపోతుందని చెబుతాడు..
కథ అంతా విన్న తర్వాత మనిషి జీవితం ఇలా వుంటుందనేది ప్రాచీన బర్హికి అర్థమవుతుంది.దర్భ లేదా కుశల కొసల ప్రాముఖ్యత వలె మన దేహంలో కొనలో అనగా తల అని అదే ముఖ్యమైన భాగమని తెలుస్తుంది. దేహం మీద వ్యామోహం నశిస్తుంది.
ఆ విధంగా బర్హికి జ్ఞానోదయం అవుతుంది.
మనం కూడా ఈ కథ లోని నీతిని గ్రహించి అనవసర వ్యామోహల నుండి బయట పడదాం కొసాగ్రంలో ఉన్న తల గొప్పతనం తెలిసిన మనం తెలివైన, ఆదర్శవంతమైన పనులు చేద్దాం.
సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం.
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి