సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-643
మణి ప్రభామణి మతి న్యాయము
******
మణి అనగా రత్నము, శ్రేష్టమైన వస్తువు. ప్రభామణి అనగా కాంతివంతమైన మణి.మతి అనగా జ్ఞానము,తలంపు,తెలివి, సంకల్పము,హృదయము, విశ్వాసము,అభిప్రాయము, ప్రతిష్ట, కోరిక,ఉపదేశము,ఆదరము అనే అర్థాలు ఉన్నాయి.
మణి ప్రభను మణి అనియు,మణిని మణి ప్రభ అనియు భ్రమించి తుదకు వాస్తవము తెలుసుకొనుట.
ఒకరి ఇంట్లో ఒక చోట దీపమును పెట్టారు.దాని ప్రభ మణి వలె ప్రకాశించుచు గుమ్మంలో పడుతోంది.ఆ ఇంటికి ఎదురు ఇంటిలో  దీపమునకు ఎదురుగా ఒక మణి ఉంచబడింది.దాని కాంతి మణి వలె ప్రకాశించుచు గుమ్మమున పడుతున్నది.వాటిని చూసి ఒక వ్యక్తి దీప ప్రభయే మణి అనుకుంటూ ఆ భ్రాంతితో దీపప్రభ వద్దకు పరుగెత్తాడు.ఇక మరొక వ్యక్తి మణియనే భ్రాంతితో మణిప్రభ వద్దకు పరిగెత్తాడు.వారిద్దరూ ప్రభా ద్వయమును చేరి పరిశీలించారు. ఇవి మణులు కావనియు,మణీదీప ప్రభలనియు , తాము తెలియక భ్రమించి ఆ విధంగా పరుగులు పెట్టామని తెలుసుకున్నారు.
దీప ప్రభను మణి అనుకున్న వానిది విసంవాది భ్రమ, మణి ప్రభను మణి అనుకున్న వానిది సంవాది భ్రమ అంటారు.
ఒకోసారి మనిషి దూరం నుంచి కొన్ని వస్తువులను చూసి తప్పుగా ఆలోచిస్తాడు.అయితే అలా ఆలోచించడం వల్ల కూడా అసలు సత్యాన్ని తెలుసుకుని అనుకున్నది పొందగలడు. పైన చెప్పుకున్నట్లు రత్నం యొక్క మెరుపు లేదా కాంతిని చూసి రత్నంగా భావించి దాన్ని పొందడానికి పరుగెత్తుతాడు.అయితే మిలమిలా మెరిసే కాంతిని రత్నం అనుకోవడంలో. పొరబడ్డప్పటికీ ఎలాగైతేనేం రత్నాన్ని పొందడంలో విజయం సాధిస్తాడు. తన భావన తప్పు అయినప్పటికీ విజయవంతమైన ముగింపును పొందడాన్ని "సంవాది భ్రమ" అంటారు.
అలాగే మరొక వ్యక్తి దీపం యొక్క కాంతిని రత్నంగా భావించి దాని వైపు పరుగెత్తుతాడు.కానీ ఆ కాంతి  రత్నానిది కాకపోవడం వల్ల అతడు అనుకున్నది నిజం కాలేదు.నిజం కాని భావనను అనగా తప్పు భావనను విసంవాది భ్రమ అంటారు.
సంవాది భ్రమ గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణకు పొగను చూసి అక్కడ ఆ పొగకు కారణమైన నిప్పు ఉంటుందని భావించి అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగానే నిప్పును కొనుక్కోవడాన్ని 'సంవాది భ్రమ' అంటారు.అంటే ఆశించిన ఫలితానికి దారి తీసే సరైన జ్ఞానమును 'సంవాది భ్రమ' అనవచ్చు.
ఇక వాస్తవానికి దగ్గరగా కాకుండా ఊహించడం అనేది మనసు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా ఊహించి ధ్యానం చేయడం ద్వారా వస్తువును గుర్తించడం అనేది వుంటుంది.అయితే ఈ ధ్యానం ఎప్పుడైతే  ఆగిపోతుందో అప్పుడే గుర్తింపు కూడా ఆగిపోతుంది.అలాంటిదానిని 'విసంవాది భ్రమ' అంటారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 'సంవాది భ్రమ' జ్ఞానానికి సంబంధించినది. జ్ఞానం ద్వారా పొందినది ఏదైనా ఎప్పటికీ మరిచిపోవడం అనేది ఉండదు.
ఈ న్యాయం ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే రెండూ భ్రమలే.కానీ విషయాన్ని విచక్షణా జ్ఞానంతో దగ్గరగా ఊహించడం వల్ల  అసలు నిజాన్ని కనుగొనగలుగుతాము.వాస్తవానికి దూరంగా ఊహలపై ఆధారపడితే అది పాక్షిక ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలదు అని తెలిసిపోయింది.
  మొత్తంగా ఈ "మణి ప్రభామణి మతి న్యాయము" ను మన పెద్దలు ఉదాహరణగా చెప్పడానికి కారణం "ఊహల్లో కాదు వాస్తవంలో జీవించు,జ్ఞానం ద్వారా గ్రహించు అని".పెద్దల మాటను విందాం. విషయ జ్ఞానం పొందుదాం.


కామెంట్‌లు