సుప్రభాత కవిత ; -బృంద
నీవెక్కడున్నా నిను వెదికి
నేనున్నా నీకంటూ తాకి
నిద్దుర మగతలు పోద్రోలి
నడిపించే తోడే ఉదయం.

వేగు చుక్క పొడవగానే
వేళకు వచ్చేస్తున్నానని
వేకువ తెచ్చే సందేశమే
వెలుగులు నింపే  ఉదయం

తూరుపు ఎరుపెక్కగనే
వేలుపు రాక తెలియగనే
పిలుపులు అందిన వేడుకలా
తలుపులు తీసే ఉదయం

మబ్బుల దారిని తొక్కి
దిబ్బల మీదికి ఎక్కి
కొమ్మల చాటున నక్కి
రెమ్మల పక్కన నవ్వే ఉదయం

చిటారు కొమ్మన కూచుని
చిన్నగ ఊయల లూగుతూ
చిన్ని చిలుకల చిందులతో
చిరు చిరు సందడి చేసే ఉదయం

కిరణపు దారుల  నడుమన
వెలుగుల తేరును నడిపిస్తూ
మబ్బులతో దోబూచులాడుతూ
నింగిని వెలిగించే ఉదయం

కోటి ఆశలు నిండిన మదిని
మీటి పోవు మధుర రాగమై
దాచిన కలతల దాటిస్తూ
వేచిన మదికి వెన్నెలై వచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు