నవ్వుతూ బ్రతకాలిరా - 2:-సి.హెచ్.ప్రతాప్
 (1) నువ్వు ఇంకా రెండు రోజుల కంటే బ్రతకవు. నీ ఆఖరి రొజులలో ఎవరినైనా కలవాలనుకుంటున్నావా ? " అడిగాడు డాక్టర్ దైవాధీనం
" అవును. ఒక మంచి డాక్టర్ ను కలవాలనుకుంటున్నాను" అసలు సంగతి తాపీగా చెప్పాడు పరమేశం.
(2). " ఒక సీరియల్ లో మీరు అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ పాత్రలు వేస్తున్నారట కదా ! బహుశా తెలుగు టి వి పై త్రిపాత్రాభినయం ఇదే మొదటి సారి అనుకుంటున్నాను.కంగ్రాచులేషన్స్. ఒకే సీరియల్ లో మీరు ఒకేసారి మూడు పాత్రలు ఎలా వేయగలుగుతున్నారు ?" ఆసక్తిగా అడిగాడు సినిమా పత్రికా విలేఖరి.
" ఏముందీ, వెరీ సింపుల్. ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ పూర్తయ్యేసరికి అమ్మను అయిపోతాను. మరి వెయ్యి ఎపిసోడ్స్ కు ఏజ్ బార్ అయ్యి నాచురల్ గా అమ్మమ్మ పాత్రను పోషించేస్తాను" అసలు సంగతి చెప్పింది వర్ధమాన నటి శిరీష..
(3)“ఏమిటోయ్ సుబ్బారావు ? హఠాత్తుగా పొద్దున్నే సతీ సమేతం గా ప్రయాణం కట్టావు ? ఎక్కడికి ?” ఆసక్తిగా అడిగాడు పుల్లారావు పళ్ళు తోముకుంటూ.
“ మా అల్లుడు సకుటుంబ సపరివార సమేతం గా వస్తున్నానని రాత్రే ఫోన్ చేసాడు. వచ్చాడో నెల రోజుల వరకు కదలడు,పైగా ఇల్లంతా గుల్ల చేసి వదుల్తాడు. చెంచాలను సైతం వదిలిపెట్టని పిసిని గొట్టు వెధవ. అందుకే ముందు జాగ్రత్తగా తీర్ధ యాత్రలకు ప్రయాణం కట్టాను. అల్లుడిఎ పీడా వదుల్తుంది, పుణ్యం, పురుషార్ధం కూడా వస్తాయి” హడావిడిగా సామాను బయటకు చేరవేస్తూ చెప్పాడు సుబ్బారావు.
(4). “ ఈ రోజులలో అడ్డుక్కుతినేవాళ్ళు కూడా హైటెక్నాలజీని ఉపయోగిస్తున్నారు తెలుసా !” అన్నాడు గోపి.
“ ఏమైంది ?’ అడిగాడు రాజు.
“ ధర్మం చేయమని ఆన్ లైన్ అక్కౌంట్ వివరాలను  ఎస్ ఎం ఎస్ పంపిస్తున్నారు “ అసలు సంగతి చెప్పాడు గోపి.

కామెంట్‌లు