సిరిపురం ఉన్నత పాఠశాలలో మంజుల అనే అమ్మాయి 10వ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థిని. చిన్నతనం నుండి ఆమే ఆ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చేది. దాంతో ఆమెకు అహంకారం శ్రుతి మించింది. తెలివైన వారితోనే సహవాసం చేసేది. చదువు రాని వారిని చులకనగా చూసేది. హేళన చేసేది.
ఆ తరగతిలో శివాని, సిరి అనే అమ్మాయిలను మరీ హేళన చేసేది. వారిద్దరూ చదువులో సగటు విద్యార్థులు. చాలా మానసిక ఒత్తిడికి గురి అయ్యారు. ఎవరితో కలవక కుమిలి పోతున్నారు. ఈ విషయం 9వ తరగతిలో తెలివైన అమ్మాయి సరస్వతి గమనించింది. కారణం తెలుసుకుంది. "అక్కలూ! మీరు నిజంగా మొద్దు అవతారాలు." అని నవ్వింది. నివ్వెరపోయారు ఇద్దరూ. అప్పుడు సరస్వతి ఇలా అన్నది. "చిన్న తరగతుల్లో ఏం నేర్చుకున్నారు? ఏనుగు పోతుంటే దాని వెనుక బడి కుక్కలు మొరుగుతుంటే ఆ ఏనుగు కలత చెందుతుందా? పట్టించుకోకుండా పోతుంది. ఇది అర్థం కాని మిమ్మల్ని ఏమనాలి? మీరు కూడా ఎవరినీ పట్టించుకోకుండా చదువులో మరింత శ్రద్ధ చూపించి, మార్కులు బాగా తెచ్చుకుని, మంజులకు బుద్ధి చెప్పండి. అని. "మరి.మాకు పాఠాలు అర్థం కావు కదా!" అన్నది సిరి.
అప్పుడు సరస్వతి ఇలా అన్నది. "నిన్న చూసిన సినిమా కథ పూస గుచ్చినట్లు చెబుతారు కదా! ఎంతో ఆసక్తిగా చూస్తారు కనుక చెబుతారు. అదే ఆసక్తితో పాఠాలు వినండి. అర్థం కానివి ఉపాధ్యాయులను అడిగి, సందేహాలను నివృత్తి చేసుకోండి." అని. సిరి, శివాని సరస్వతి చెప్పినట్లు చేశారు. మంజులను పట్టించుకోవడం మానేసినారు. క్రమంగా మంజుల హేళనలను ఆపేసింది. పాఠాలు శ్రద్ధగా వింటూ. సందేహాలను నివృత్తి చేసుకుంటూ10వ తరగతి ప్రీ ఫైనల్స్ లో మంజుల కంటే ఎక్కువ మార్కులు సాధించారు శివాని, సిరి. నివ్వెరపోయింది మంజుల.
అణగిన అహంకారం : సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి