సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -646
మనోరాజ్య విజృంభణ న్యాయము
******
మనో అంటే మనసు. మనోరాజ్య అంటే మనసనే రాజ్యంలో విజృంభణ అంటే వికసించుట, ఆవులించుట, తెరచుట, వ్యాపించుట అనే అర్థాలు ఉన్నాయి.
మనసనే  రాజ్యంలో  ఏవి వికసిస్తాయి? ఏవి వ్యాపిస్తాయి? అనే ప్రశ్నకు ఠకీమని సమాధానం వస్తుంది.కోరికలు వికసిస్తాయి.కోరికలే వ్యాపిస్తాయనేది మనందరికీ తెలుసు.
ఆ విధంగా మనసులో వికసించే కోరికలకు అంతు లేదు.ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి.తామర తంపరలా...సముద్రంలో అలల్లా...పుట్ట గొడుగుల్లా వీటికి అంతూ పొంతూ ఉండదు అనే అర్థంతో ఈ "మనో రాజ్య విజృంభణ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
మనిషి మనసు పలు కోరికల పుట్ట,ఊట బావి అంటారు. ఒకటి తీరగానే మరొకటి  పుడుతూనే ఉంటుంది.తోడుతుంటే నీటిలా ఊరుతూనే వుంటుంది.మరి ఈ కోరికలన్నింటికీ మూలం మనసు. ఈ కోరికల పరంపరకు మనిషి వశమైతే అది పతనం చూసేంతవరకు వదిలి పెట్టదు.
అందుకే కోరికలను  గుర్రాలని కూడా అంటారు.ఈ గుర్రాలను అదుపులో పెట్టుకునేందుకు బుద్ధి అనే రౌతును నియమించాలి. నియమించిన రౌతు ఎప్పుడూ అప్రమత్తంగా నే ఉండాలి. ఎందుకంటే బుద్ధిని ఏమార్చి పట్టించుకోలేనంత వేగంగా మనసు లోని కోరికలు పరుగులు తీస్తూనే వుంటాయి.
 ఈ మనసుకు సంబంధించి మహా భారతంలో  "యక్ష ప్రశ్నలు" అనే  ఘట్టం ఒకటి వుంది అది చూస్తే లేదా  చదివితే మనసుకు సంబంధించి ఓ  ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది.
ఇందులో యక్షుడు ధర్మరాజును పిలిచి "గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏది? అని అడిగితే "మనసు" అని సమాధానం చెబుతాడు.
మనసు తలచుకోవాలే గానీ  క్షణాల్లో చంద్రమండలం పోయి రాగలదు.భూగోళాన్ని చుట్టేయగలదు.
దీనికి తోడు మనసు ఎంతో చంచలమైనది కూడా!" అందుకే దానిని ఎలా అదుపు చేయాలో చెప్పమని కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణుని అర్థిస్తాడు.దానికి కృష్ణుడు "అభ్యాసం,సాధన, వైరాగ్య భావన" ద్వారా మనసు చంచలత్వం నుంచి స్థిరత్వంగా వుండటం సాధ్యమవుతుందని చెబుతాడు.
అలాగే ప్రహ్లాద చరిత్రలో  ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్య కశిపుడితో 'మనసే పెద్ద శత్రువు' అని చెప్పిన ఈ పద్యాన్ని చూద్దాం.
 "వైరులెవ్వరు చిత్తంబు వైరి గాక/ చిత్తమును నీకు వశముగా జేయుమయ్య!/ మదయుతాసుర భావంబు మానవయ్య!/యయ్య!నీ మ్రోల మే లాడరయ్య జనులు."
అంటే నీ మనసే నీ శత్రువు. మనసును స్వాధీనంలోకి తెచ్చుకొని అరిషడ్వర్గాలలోని మదంతో కూడిన రాక్షస భావాన్ని వదిలిపెట్టు.ఈ విషయాలు నీ ముందు జనం చెప్పరయ్యా."ఇది నిజం  తెలుసుకో అంటాడు.
తన మనసు మీద తనకు అదుపు ఉన్న వ్యక్తి , తనను తాను అదుపులో పెట్టుకోగలిగిన వ్యక్తి వెయ్యి మంది శత్రువులను జయించిన వాడి కంటే గొప్ప వాడు " అని మన పెద్దలు చెబుతుంటారు.
మనసనేది కోతి  కూడా.మరి ఈ మర్కటాన్ని నియంత్రించడం కష్టమని అనుకుంటారు చాలా మంది. మర్కటానికి సైతం శిక్షణ ఇచ్చి అవసరమైన పనులు చేయించుకునే వాళ్ళను మనం చూస్తున్నాం.నదులు ఎంత వేగంగా  విజృంభించి ప్రవహించినా  అడ్డుకట్ట వేసి ఆపినట్టు  మనసునూ ఆపవచ్చు.
అవసరమైన,సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడే కోరికలను వికసింపజేసుకుంటూ,వాటి పరమార్థం నెరవేర్చుకుంటూ,  లక్ష్య సాధనలో విజయం సాధిస్తూ వుండే వాడే అసలైన మహనీయుడుగా పిలవబడతాడు.
కాబట్టి  "మనో రాజ్య విజృంభణ న్యాయము"లో సమాజ హిత కోరికలే  వికసించేలా చూద్దాం.వాటిని  నెరవేర్చుకునేలా చేసుకుని,ఆ మహనీయుల బాటలో మనమూ నడుద్దాం.


కామెంట్‌లు