న్యాయాలు -677
విని గమన న్యాయము
*****
ఒక విషయాన్ని గానీ వస్తువును గానీ రెండు కోణాల్లోంచి చూసినా , రెండు విధాలుగా సాధించడానికి వీలున్నప్పుడు గానీ ఫలితములో ఎలాంటి వైరుధ్యం రాకుండా , కలగకుండా సాధించవలననే నియమమును వినిగమనము అంటారు.
అయితే ఒకోసారి ఇతర అంశాలు కూడా సాధ్యమైనప్పుడు కొన్ని కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడమని కూడా అర్థము వస్తుంది
అలా దీనిని ఎక్కువగా పంచాంగం రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.పంచాంగంలో చెప్పబడే వివిధ విషయాలు సూర్య,చంద్ర గమనాల ఆధారంగా సూర్య సిద్ధాంతము ప్రకారము దృగ్గణిత పద్దతి ప్రకారము గ్రహ స్థితులలో కొన్ని తేడాలు వస్తూనే ఉంటాయి, అలాంటి తేడాలు లేకుండా వుండే విధంగా వినిగమనమును తీసుకుంటారు.
ఇవన్నీ చదువుతుంటే కొంచెం అయోమయం కలుగుతుంది కానీ విషయాలను జాగ్రత్తగా గమనిస్తే ఈ "వినిగమన న్యాయము"అంటే ఏమిటో తెలుసుకోగలం.
మొదట పంచాంగం అంటే ఏమిటో తెలుసుకుంటే కొంత మనకు అవగాహన కలుగుతుంది.
పంచ అంటే ఐదు.అంగ అంటే అంగాలు.అవి తిథి,వారం, నక్షత్రం,కరణం, యోగం- ఈ ఐదు భాగముల యొక్క కలయికే పంచాంగం.
ఈ పంచాంగాన్ని చంద్రుడి గమనంతో అనుసంధానం చేసి రూపొందిస్తే చాంద్రమాన పంచాంగం అని, సూర్యుని గమనంతో అనుసంధానం చేసి రూపొందిస్తే సూర్యమాన పంచాంగం అని అంటారు.
పంచాంగంలో రాసిన కాలములకు, విషయాలకు సరిగ్గా ఆకాశమందు దృశ్యములు గోచరిస్తే లేదా కనిపిస్తే అది దృక్సిద్ద పద్దతి లేదా దృగ్గణిత పద్దతి అంటారు.దృక్ అంటే కన్ను.కంటికి ప్రత్యక్షంగా కనిపించే లేదా గోచరమయ్యే గణితమని అర్థం.
అంటే ఖచ్చితమైన సమయాల్లో ఖచ్చితముగా గ్రహణాలను కంటి ద్వారా చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పిన గణితాన్ని దృగ్గణితము అంటారు.
అన్నీ కంటికి కనబడవు కదా! అలాంటి లోపాలను సూర్య సిద్ధాంతమును అవలంభించి సరిచేసుకొని పంచాంగం రాస్తారు.
సూర్య సిద్ధాంతం అనేది హిందూ మతస్థుల ఉపయోగించే ఒక ఖగోళ శాస్త్ర సిద్ధాంతము.
ఈ సిద్ధాంతంలో గ్రహాల కదలిక, వాటి స్థితి,దిశ, ప్రదేశము, సమయము , సూర్య,చంద్రుల కక్ష్య, నక్షత్రాలు, సూర్యోదయం, అస్తమయం ... మొదలైన అంశాలు వుంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని పంచాంగం రాస్తారు.దీనిని మాననం చేస్తూ రాయడాన్ని సూర్య మానం అంటారు.ఈ సూర్యమానానికి సంవత్సరం పునాది.
ఇక చాంద్రమానం అంటే చంద్రుని గమనాన్ని బట్టి తిథులు, వారాలు,నెలలు, సంవత్సరాలను నిర్ణయించుకునే విధానం.తెలుగు,కన్నడ వారి పంచాంగములు, క్యాలెండర్లు చాంద్రమానం ప్రకారం ఉంటాయి.
చాంద్రమానానికి నెల ఆధారం. నెల అంటే ఒక పౌర్ణమి నుండి మరో పౌర్ణమి వరకు గాని లేదా అమావాస్య నుంచి అమావాస్య వరకు గాని లెక్కిస్తారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కాలాన్ని ఒక నెలగా లేదా మాసంగా లెక్కిస్తారు.చాంద్రమానం 30 తిథులు ఉన్నప్పటికీ చంద్రుడు భూమి చుట్టూ తిరుగడానికి 27. 32 రోజులు మాత్రమే పడుతుంది.దీని వల్ల చాంద్రమానానికి, సూర్యమానానికి మధ్య తేడా తలెత్తుతుంది. దానిని సమన్వయం, సర్దుబాటు చేసేందుకు వీలుగా చాంద్రమానంలో అధిక మాసం అనే పేరుతో ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా మన తెలుగు వారు చాంద్రమానం ప్రకారంగానే పండుగలు జరుపుకుంటారు.
ఇలా చాంద్రమానం, సూర్యమానానికి మధ్య , అలాగే సూర్య సిద్ధాంతానికి, దృగ్గణితములో గ్రహస్థితులను బట్టి వచ్చే తేడాలను సరిచేసి ఏ విధమైన వైరుధ్యం కలుగకుండా మధ్యే మార్గంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ యొక్క నియమమును వినిగమనము అంటారు. ఈ "వినిగమన న్యాయము"లో ఇంత సమాచారం దాగివుంది.
ఈ న్యాయాన్ని మానవ జీవితానికి అన్వయించి నట్లయితే...
ఏవైనా సమస్యలు అంటే కుటుంబం, మత పరమైన,మానవీయతకు సంబంధించిన ధర్మ సందేహాలు, సమస్యలు వచ్చినప్పుడు పట్టు విడుపుల విషయంలో ఇరువైపులా కోపతాపాలకు తావు లేకుండా, ఎలాంటి వైరుధ్యాలు పొడసూపకుండా, ఏ విధమైన తేడాలు రాకుండా మధ్యే మార్గాన్ని అనురింప చేసేట్లు ఈ "వినిగమన న్యాయము"తో పోల్చి చెప్పవచ్చునని, ఏకత్వాన్ని సాధించవచ్చని మనం తెలుసుకోగలిగాం.
సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి