ఆడపిల్ల పుట్టినప్పటినుండి వృద్ధాప్యం వరకూ ఏదోరూపంలో సమస్యలను ఎదుర్కొంటూనే వుంది . లేదంటే ,ఒకప్పుడు పూర్తిగా బానిస బ్రతుకును అనుభవించిన స్త్రీ జీవితం ఇప్పుడు ఎంతగానో మారిపోయింది . దీనికి కారణం అక్షరాస్యత ,తమకాళ్ళమీద తాము నిలబడగలిగే శక్తిని కలిగివుండడం ,తమశక్తిని
సత్తాను నిరూపించగలిగిన స్థాయికి చేరుకోగలగడం . ఇది ఆహ్వానించదగ్గ విషయం !
అయినప్పటికీ ,ఇప్పటికీ కొన్ని విషయాలలో మహిళా మూర్తులను కొన్ని సమస్యలు వెంటాడక తప్పడం లేదు . జీవితంలో పెళ్లి చేసుకోవడం ,పెళ్లి చేసుకొనకపోవడం వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉన్నప్పటికీ ,పెళ్లి చేసుకున్నాక ఎదురయ్యే సమస్యల్లో అతి సున్నితమైన అంశం ‘ మాతృత్వం ‘ ఇందులో మళ్ళీ పిల్లల్ని కన్న
తరువాత వచ్చే సమస్యలు ,పిల్లల్ని కనకపోతే ఎదురయ్యే నిందలు తద్వారా ఏర్పడే మానసికవ్యధలూ కొన్ని చెప్పుకునేవి ,కొన్ని చెప్పుకోలేనివి ఇలా .. ఎన్నెన్నో . ఈమధ్య రచయిత్రి శ్రీమతి బండారు విజయగారు ఇంచుమించు ఒక యజ్ఞంలాంటి ప్రయత్నంచేసి మాతృత్వానికి సంబందించిన ఇతివృత్తంమీద మిత్ర రచయిత్రు–
లతో చర్చించి 53 మంది రచయిత్రులనుండి వారివారి కథలు సేకరించి ,494 పేజీలుగల ‘ యోధ ‘ అనే కథాసంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకువచ్చారు.
ఇంతమంది రచయిత్రులను కూడగట్టి వారిచేత కథలు రాయించి అతితక్కువ సమయంలో వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం అంత సులభమైన విషయమేమీ కాదు ! ఈ విషయంలో ‘ యోధ ‘ సంపాదకురాలు ,తమ అమూల్యమైన కథలు అందించిన రచయిత్రులు అభినందనీయులు ,
యోధ -కథాసంకలనం నా చేతిలోనికి రాగానే ,పుస్తకం తెరిచిన వెంటనే (మాములుగా అయితే ముందు మాటల దగ్గరనుండి మొదలుపెడతాను సుమండీ ) నా కళ్లబడ్డ కథ
304 పేజీలోని 34వ కథ ‘ చిగురువేయని స్వప్నం ‘ రచయిత్రి శ్రీమతి సునీత గంగవ-
రపు . వీరు కవయిత్రిగా నాకు పరిచయం . ఈ కథ చదవడం ద్వారా వీరు కథలుకూడ
బాగారాస్తారని అర్ధమయింది . తెలిసిన రచయిత్రి కథ ముందుచదివే అవకాశం రావడం యాదృశ్చికమే !
ఈ రచయిత్రి ,కవయిత్రికూడా కావడంమూలాన ,కథాశీర్షిక ఆకర్షణీయంగా పెట్టుకోగలిగారు . శీర్షిక చూడగానే ,కథ అప్పటికప్పుడు చదవాలనిపిస్తుంది . కథా వస్తువు జగమెరిగినదే అయినా .. కథను చెప్పిన విధానం పాఠకులను తప్పక ఆకట్టుకుంటుంది . ఒక పాఠకుడిగా ఇది నా అనుభవం . ఈ కథలో పిల్లలు పుట్టని స్త్రీ మూర్తిని ఇంటా -బయటా మాటలతూటాలతో మానసికంగా ఎలా హింసిస్తారో ,ఆస్త్రీలు ఎంతటి మానసిక వ్యధకు గురి అవుతారో చెప్పడం జరిగింది . పిల్లలు పుట్టకపోతే
కేవలం స్త్రీనే తప్పుపట్టడం ,’ గొడ్రాలు ‘ అని నిందించడం ,అది కేవలం ఆమె లోపమని నిరక్షరాస్యులతో,అక్షరాస్యులు సైతం అవగాహన లేకుండా మాట్లాడడం
బాధ అనిపిస్తుంది . పిల్లలు పుట్టడానికి భార్యాభర్తల ఇద్దరి క్రోమోజోములు ఆరోగ్యంగా వుండి రెండూ సజావుగా సంయోగం చెందితేనే పిండం ఏర్పడే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి . అందుచేత పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీపురుషులిద్దరూ కారణం అవుతారు . వైద్యపరంగా ఏ ఒక్కరిలో సమస్యవున్నా
అవి పరిష్కరింపబడతాయి . విషాదకరమైన విషయం ఏమిటంటే ,వైద్య పరీక్షల
కోసం స్త్రీ చూపించినంత ఉత్సాహం పురుషుడు చూపించక పోవడం . ఈ నేపథ్యంలో రచయిత్రి శ్రీమతి సునీత గారు ఒక కుటుంబ కథను నేపధ్యంగా తీసుకుని కథకుకథ అల్లారుగానీ ,ఈ కథలో రెండు పాత్రలే ప్రముఖంగా కనిపిస్తాయి.
ఈ రెండు ప్రధానపాత్రల్లో ,ఒకటి పెద్దక్క ,రెండోదిచిన్నచెల్లెలు (చిన్నూ )కథను చిన్న చెల్లెలుచేత చెప్పిస్తారు రచయిత్రి .
ఈ అక్కాచెల్లెళ్ల మధ్య వయసుతేడా 18 సంవత్సరాలు . చిన్నచెల్లెలు పుట్టేసరికి పెద్దక్క పెళ్ళిచేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది . చిన్నక్క తల్లిదండ్రులకు ఇష్టంలేని తనసహాధ్యాయిని (మతాంతరావివాహం )పెళ్ళిచేసుకుని బెంగుళూరులో స్థిరపడిపోతుంది . ఆమెకు -వీళ్లకు మధ్య సత్సంబంధాలు వుండవు . చిన్నచెల్లి పెద్దదై పెళ్ళిచేసుకుని పిల్లలతో హాయిగా గడుపుతుంటుంది . పెద్దక్క చాలాఅంద-
మైనది . ఆమె భర్తకూడా అందగాడే ! చూసేవాళ్లకు అందమైన ముచ్చటైన జంటగా కనిపిస్తారు . కానీ భర్త అనుమానస్తుడు (అందమైన భార్య వున్న ప్రతి మగాడు ఇలానే
ప్రవర్తిస్తాడేమో !) అసహ్యమైన అనుమానపు ప్రశ్నలు వేస్తూ మానసికంగా వేదిస్తాడు , దీనికి తోడు ఆమెకు పిల్లలు పుట్టకపోవడం ఒకాశాపంగా మారుతుంది . ఇంటా -బయ
టా ,తనను గొడ్రాలిగా చిన్నచూపు చూడడం ,పక్క ఇంటివాళ్ల వెకిలి చేష్టలు ,భర్తలో కాస్త మార్పు వచ్చిందని సంతోష పడుతున్న తరుణంలో వ్యాధిగ్రస్తుడై చనిపోవడం ,
బయటివాళ్ల వెక్కిరింతలు మరింత ఎక్కువకావడం ,చివరి సన్నివేశంలో చెల్లిదగ్గరకు వచ్చి ,తనబాధలు చెప్పుకుని ,ఇక తనకు చెల్లెలే తోడు -ధైర్యం అన్న భావనతో మనః శాంతిగా నిద్రపోవడం జరుగుతుంది .
‘’ విడిపోయి పరుచుకున్న నల్లని జుట్టులో అక్క అందమైన ముఖం ఆకాశంలో సేదతీరుతున్న చందమామలా వుంది . ఆకుపచ్చని పెరటిలో విప్పారిన తెల్ల చామంతి వుంది . కొద్దినిముషాలు అక్కవైపు అలాగే చూసాను . మాతృత్వం పొందలేదని అరవైఏళ్లుగా ఆవేదనను అనుభవించిన అక్క ముఖాన్ని నా రెండు చేతులతో పట్టుకున్నాను . రెండు కన్నీటి బిందువులు అక్కనుదుటిని ప్రేమగా ముద్దాడాయి ‘’ అన్న ఆఖరి వాఖ్యాలు చదువుతుంటే ఎలాంటి వారికైనా కాన్నీళ్లు
కాలువలు కట్టక మానవు . రచయిత్రి కథచెప్పిన విధానం బాగుంది . అందుచేత ఈ కథ చదివినప్పుడే పాఠకులకు తృప్తి కలుగుతుంది .
‘ యోధ ‘ కథా సంకలనం కావలసినవారు నేరుగా సంపాదకురాలిని (8686468286)
మొబైల్ ద్వారా సంప్రదించవచ్చును .
***
‘’అందని మాతృత్వాన్ని అద్దంలో చూపిన కథ ‘ చిగురువేయని స్వప్నం ‘ ’’: --డా . కె . ఎల్ . వి . ప్రసాద్ .
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి