సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలుం-662
జతుకాష్ఠ న్యాయము
******
జతుకము అంటే లక్క లేదా ఇంగువ అనే అర్థాలు ఉన్నాయి. కాష్ఠము అంటే కఱ్ఱ లేదా పుల్ల.
జతుకాష్ఠము అంటే లక్క కర్ర లేదా లక్క పుల్ల. 
ఈ లక్కపుల్లను యెక్కడ,ఎన్ని సార్లు విరిచినా మళ్ళీ అతికిస్తే అతుక్కుంటుంది.
మరి ఇందులో ఏం విశేషముంది? విరిస్తే విరుగుతుంది మళ్ళీ కొద్దిగా వేడి చేస్తే చక్కగా అతుక్కుంటుంది కదా! దీనిని ఉదహరించవలసిన అవసరం ఏముందని అనిపించవచ్చు.కానీ  మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో, ఉండకూడదో చెబుతుంది ఈ న్యాయము.
దీనినే శతక కర్త వేమన "మనిషికీ,మనసుకూ వర్తింప చేస్తూ లక్కకు బదులుగా ఇనుమును ఉదహరిస్తూ  ఇనుముకూ ,మనసుకూ గల తేడా ఏమిటో తెలిసేలా చక్కని పద్యాన్ని రాశారు.
ఇనుము విరిగె నేని యినుమారు ముమ్మారు/కాచి యతుక వచ్చు క్రమము గాను/ మనసు విరిగెనేని మరియంట నేర్చునా?/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లే కాదు అనేక సార్లు అతికించి వచ్చు.కానీ  మనిషి మనసు ఒక్కసారి విరిగితే దానిని మళ్ళీ అతికించడం సాధ్యం కాదు.
అంటే ఎదుటి వ్యక్తి మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పించకూడదు.అలా మనసు విరిగి పోయేలా  బాధ పెడితే మళ్ళీ సరిచేయడం,ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం బ్రహ్మ తరం కూడా కాదు.మనసు లక్కపుల్ల/ ఇనుము కాదు కదా విరిగిపోయేలా బాధ పెట్టినా మళ్ళీ అతకడానికి.
మానవ సంబంధాలు సరిగా కొనసాగాలంటే మాటే వాహకంగా పని చేస్తుంది.కాబట్టి మాట పరుషంగా కాకుండా మృదువుగా ఉండాలి అంటారు.
అయితే  దీనినే మరో కోణంలో చూద్దాం. కుటుంబంలోనూ, స్నేహితుల్లోనూ, భార్యాభర్తల మధ్యనూ అప్పుడప్పుడూ అభిప్రాయ భేదాలు రావడం సహజం.
అలాంటి సందర్భాల్లో  చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులకు పోయి బంధాల్ని తెగేదాకా లాగడం, జీవితాంతం దూరమయ్యేలా చేసుకోవడం కూడదనీ,లక్కపుల్ల వలె  మళ్ళీ  వెంటనే కలిసి పోవాలని ఈ న్యాయము చెబుతుంది. 
ఇలా ఈ జతుకాష్ఠ న్యాయమును మనసూ, మనిషి బంధాలకు రెండింటికీ వర్తింప జేయవచ్చునని అర్థం చేసుకోవచ్చు.

కామెంట్‌లు