సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -647
మర్కట కిషోర న్యాయము
*****
మర్కటము అంటే కోతి. కిషోరము అంటే కూన లేదా పిల్ల. మర్కట కిషోరము అంటే కోతి పిల్ల.
తల్లి కోతి ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు దూకేటప్పుడు,గంతులు వేసేటప్పుడు  కోతి తన పిల్లను పట్టుకోదు.తనకేమాత్రం పట్టనట్లుగా ఉంటుంది.కోతి పిల్లే తల్లి కోతి కడుపును కరుచుకుని,విడువకుండా గట్టిగా పట్టుకుంటుంది.
ఇక్కడ తల్లి కంటే దాని పిల్లనే జాగ్రత్తగా ఉండాలి.ఏ మాత్రం పట్టు వదిలినా ఆ కోతి పిల్ల ప్రమాదానికి గురవుతుంది.అందుకే పిల్ల కోతి అది ఎంత చిన్నదైనా తన రక్షణ తానే చూసుకుంటుంది.
కోతి లక్షణం కుదురుగా ఉండకపోవడం కదా!ఎక్కడా ఒక చోట నిలకడగా ఉండక అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరిగే తల్లి కోతి ఉన్న పరిసరాల్లో తాను కూడా తిరుగుతూనే  తల్లిని ఓ కంట కనిపెట్టి అది ఎటైనా వెళ్ళబోయే సమయానికి గబుక్కున వెళ్ళి తల్లి పొట్టను కరుచుకుంటుంది.అలా ఎప్పుడూ గమనిస్తూ తల్లిని విడువకుండా తన జాగ్రత్తలో తాను ఉంటుంది.
 ఇలా ఒకరిపై ఆధారపడకుండా తనకు ఏది రక్షణో? ఏం చేస్తే? ఎలా చేస్తే?భద్రత,సుఖం, ఆనందం కలుగుతుందో అది తెలుసుకొని మసలు కోవడమే ఈ "మర్కట కిషోర న్యాయము" యొక్క అంతరార్థము.
ఆధ్యాత్మిక వేత్తల దృష్టితో చూస్తే  మనిషికి అసలైన రక్షణ,ఆత్మానందం,ముక్తి అనేవి భక్తితో భగవంతుని నమ్ముకొని కొలిస్తే వస్తుందనీ, అవి కూడా క్షణం విడువకుండా నిరంతరం భగవంతుడిని ఆశ్రయిస్తేనే కలుగుతాయని చెబుతారు.
ఈ న్యాయానికి ఉదాహరణగా ప్రహ్లాదుడితో పాటు రామాయణంలో లక్ష్మణుడు, మహా భారతంలో పాండవులు, భాగవతంలో  గోపికల గురించి చెబుతుంటారు. 
ప్రహ్లాదుడు హరి నామము విడువకుండా తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా భరించి ఆయన కృపకు పాత్రుడవుతాడని మనందరికీ తెలిసిందే.
 శ్రీకృష్ణ శతకంలోని ఈ పద్యాన్ని జపిస్తూ, ధ్యానిస్తూ వుంటే ఆయనే రక్షణ బాధ్యత వహిస్తాడని శ్రీకృష్ణుడిని ఆరాధించే భక్తుల నమ్మకం.
 "హరియను రెండక్షరములు/ హరియించును పాతకముల నంబుజ నాభా!/హరి నీ నామ మహత్మ్యం/ హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!"
హరి అని పేరు గల రెండక్షరములు పాపాలను నశింప చేస్తాయి. నిన్ను పొగడుట మా తరమా! నిన్ను  విడువకుండా నమ్ముకుంటే చాలు.అని అర్థము.
అలా ఆధ్యాత్మిక చింతనతో చూస్తే భగవంతుని పట్ల పెంచుకున్న నమ్మకం  ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా చేస్తుందనీ ,అనుక్షణము  దేవ దేవుని ప్రార్థిస్తూ ,అర్థిస్తూ వుంటే  ఆయన కటాక్షం లభిస్తుందని  ఈ "మర్కట కిషోర న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
దీనినే  గురు శిష్య ,విద్యా జ్ఞాన పరమైన అనుబంధానికి కూడా వర్తింప చేసి చెప్పవచ్చు.ఇది చెప్పే ముందు మార్జాల కిషోర న్యాయమును కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి.
ఎందుకంటే.... బాల్యదశలో విద్యార్థులను వారు చెడు దారుల్లో వెళ్ళకుండా, వారిని  కంటి రెప్పలా కాపాడుతూ నైతిక విలువలు, విద్యాబుద్ధులు నేర్పుతూ  పిల్లి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా  ఉపాధ్యాయులు కాపాడుతారు.
ఇక ఉన్నత పాఠశాల విద్య అయిపోయాక విద్యార్థుల యొక్క  ఇష్టం,ధోరణి, లక్ష్యం, నిర్ణయాత్మక ఆలోచన , భవిష్యత్తు మొదలైనవన్నీ  వారి స్వయం నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.
అప్పటి వరకు  వెన్నంటి వున్న గురువు బాధ్యత ఇక ఉండదు.కాబట్టి తానే సరైన గురువును అన్వేషించాలి. చదువు విషయంలో సరైన అంశాన్ని  ఎంచుకోవాలి.అంతే కాదు చదువుకోవాలనే తపన పెంచుకుని ఇష్టమైన విషయాన్ని ( సబ్జెక్టు) తీసుకోవాలి,ఆ చదువును విడువకుండా నిరంతర అధ్యయనం చేయాలి.అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు.అనుకున్నది సాధించగలరు.
 ఇలా "మర్కట కిషోర న్యాయము"ను  అటు ఆధ్యాత్మిక చింతనలో ఐనా,ఇటు నిత్యం జీవితంలో విద్యా జ్ఞాన సముపార్జనలో అయినా  భక్తుడినీ,విద్యార్థినీ పిల్ల కోతి స్థానంలో  ఉండేలా అన్వయించుకోవాలి.


కామెంట్‌లు