సునంద భాషితం ✍️
న్యాయాలు -666
యాచిత మండన న్యాయము
*****
యాచిత అనగా కోరబడినది,యాచనచే పొందబడినది, ఎరవు.మండన అనగా అలంకరించుట, అలంకరించునది అని అర్థము.
మనిషిగా కోరబడే కొన్ని అలంకరణలు తప్పకుండా ఉంటాయి.అందులోనూ అతివల అందాలకు మెరుగులు దిద్దుకునే అలంకరణల విషయానికి వస్తే చాలానే ఉన్నాయి.
అవి అవసరమా? కాదా? అని పక్కకు పెడితే స్త్రిలలో చాలా మంది ఏయే అలంకరణలు ఇష్టపడతారో, అలంకరణ చేసుకుంటారో ఒక్కసారి చూద్దాం.
అందమైన ముఖ వర్చస్సు కోసం ముఖానికి పసుపు.దేహానికి నలుగు స్నానం. కట్టుకునే వస్త్రాలపై ప్రత్యేక దృష్టి. రకరకాలుగా శిరోజాలను ముడుచుకొనుట. తలనిండ పూదండలతో అ ఆకర్షణీయమైన అలంకరణ. పాపిట సింధూరం.చేతులకు ఎండు మిరపలా పండే గోరింటాకు. పెదవులను మరింత అందంగా చూపేందుకు వివిధ పెదవుల రంగులు.కళ్ళకు కాటుక. కంఠంలో ఏడు వారాల నగలు. వివాహిత స్త్రీలు ముత్తైదువు చిహ్నాలుగా వాడే సంప్రదాయ వస్తువులు.. ఇలాంటివి మగువలు ఎక్కువగా కోరుకోవడం మన చుట్టూ ఉన్న మహిళా మణులలో చూస్తూ వుంటాం.
మరి ఇవన్నీ పై పై మెరుగులు. యాచితంగా చేసుకునే అలంకరణలు, అలంకారాలు పైకి చూడటానికి మాత్రమే అనేది మనకు తెలుసు.
మరి వాటన్నింటినీ మించిన అలంకారాలు స్వాభిమానం, సహనం, దయ ,సానుభూతి, సహానుభూతి,సంస్కారం.ఇవి ఉండాలి. అప్పుడే అందరి ఆదరాభిమానాలు ఎవరైనా ఎల్లప్పుడూ సంపాదించుకోగలరు.
అందుకే ఏనుగు లక్ష్మణ కవి గారు తమ సుభాషితంలో వాక్కు మాత్రమే మనిషికి అసలైన అలంకరణ అంటారు. దానికి సంబంధించిన శ్లోకాన్ని చూద్దాం.
"కేయూ రాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వాలా!//నా స్నానం న వి లేపనము న కుసుమం నాలంకృతా మూర్ధజా!!/ వాణ్యేకా నమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే/ క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం!!"
అనగా భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు వ్యక్తిని అలంకరించవు. చంద్రుని కాంతి వలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు,చంద్రహారములు, సూర్య హారములు వంటి హారములు గానీ అలంకరింపవు.పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు,మై పూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణలూ నిజమైన అలంకారాలు కాజాలవని గ్రహించాలి.
వ్యాకరణాది శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుతున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే సరియైన అలంకార ప్రాయమగు భూషణం తక్కిన భూషణాలు అన్నియూ క్రమేణా క్షీణించును. ఎల్లప్పుడూ ధరింపబడి యున్నట్టి వాగ్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము అని అర్థము.
కేవలం పురుషులకు అనే కాదు స్త్రీలకు కూడా వాగ్భూషణమే నిజమైన అలంకారం అనేది జగమెరిగిన సత్యం.
మనిషిగా మన నుంచి ఇతరులు కోరబడేది పెదవులపై ఒలికే చిరునవ్వు. హృదయంలోంచి వచ్చే మధురమైన మాట. ఇవి మనిషిని మరుపురాని మనిషిగా, ఎదుటి వారి గుండెల్లో కొలువుండేలా చేస్తాయి.
కాబట్టి "యాచిత మండన"మంటే మననుండి ఇతరులు కోరుకునే అసలైన అలంకరణ అనేది మనకు అర్థమైంది.
"యాచిత మండనం' అంటే ఏమిటో తెలిసిన మనం పువ్వులా విరిసే జీవితానికి మాటల తావిని అద్దుదాం.మానవీయ విలువలతో సాగి పోతూ వాక్కు పరిమళాలను పలు దిశలా వెదజల్లుదాం.
సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి