న్యాయాలు-661
మృగతృష్ణా న్యాయము
*****
మృగ అంటే చతుష్పాద జంతువు,లేడీ,కస్తూరి,వెదకుట,అనుసరణము,ప్రార్థన, మృగశీర్ష నక్షత్రము.జింక.తృష్ణా అనగా దాహం, దప్పిక,కోర్కె,ఉత్కటేచ్ఛ,పేరాస.మృగ తృష్ణా అనగా ఎండమావి అని అర్థము.
మృగ తృష్ణా అంటే ఎండమావి అని మన అందరికీ తెలుసు. దీనికి సంబంధించి రెండు రకాల ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందామా.
ఎండమావి లేదా మృగ తృష్ణ.అనగా ఎడారులలో దూరం నుండి కనబడే మాయా నీటి మడుగులు , సరస్సులు.ఇందులో నీరు దొరకదు.కేవలం నీళ్ళు ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది.
అందుకే మృగ తృష్ణలో నీకు దొరకదు అంటారు. సుమతి శతక కర్త దీనిని మూర్ఖ మనుషులకు వర్తింప జేస్తూ ఇలా అంటాడు.
తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు/తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/తవిలి మృగ తృష్ణ లో నీరు త్రాగవచ్చు/జేరి మూర్ఖుల మనసు రంజింప రాదు?..అనగా అవన్నీ అసాధ్యమైనవే అని అర్థము.
ఈ మృగ తృష్ణను మరీచిక అని కూడా అంటారు. మరీచిక అని కూడా అంటారు. ఇది ఎడారులలోని ఇసుక రాశుల మీద పడే సూర్య కిరణాలు పడి ప్రతిఫలిస్తూ ఉండటం వల్ల దూరము నుండి నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే మన కళ్ళకు కనిపించే ఓ భ్రమ మాత్రమే.నిజం కాదు .
ఈ మృగ తృష్ణలో రెండవ ఆసక్తికరమైన విషయం చూద్దాం.ఇక్కడ మృగ తృష్ణ అంటే జింక యొక్క దాహం. అది ఏ దాహమంటే కస్తూరి కోసం వెతుక్కోవడం. కస్తూరి గురించి మన అందరికీ తెలుసు.ఇది ఎంతో సువాసన గల పదార్ధము.ఇది కస్తూరి జింక నుండి వస్తుంది. జింక యొక్క సువాసన గ్రంథులు కస్తూరిని ఉత్పత్తి చేస్తాయి.ఈ సువాసన నలుదిక్కులా వెదజల్లబడుతుంది.
అయితే ఈ వాసన ఎక్కడ నుండి వస్తుందో తెలియక జింక నిరంతరం అనగా జీవితాంతం వెతుకుతూనే ఉంటుంది.కానీ ఆ సువాసన తన నాభి నుండే వస్తుందని అది ఎప్పటికీ గుర్తించలేదు.
>> అలాగే "మానవుడు ఇతరులలోనూ,భౌతిక ప్రపంచంలోనూ ఆనందం కోసం వెతుక్కుంటూ ఉంటాడు.కానీ తాను వెతుకుతున్న ఆనందం, శాంతి, సంతృప్తి ఎక్కడో దొరకవు.తనలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించడు". అంటారు.
ఆ మాటలు నిజంగా అక్షర సత్యాలు. ఇతరులలో వెతకడం మానేసి ఎవరికి వారమే వెతుక్కుంటూ అంతరాత్మను చూడగలగాలి.అలా చూసే చూపులో అలాంటి మార్పు వచ్చినట్లయితే, చేసే అన్వేషణ ముగిసి ఆనందం,శాంతి లభించడం ఖాయం.
ఇలా మనుషులు భ్రమలకు లోనుకాకుండా ఉండమని చెప్పేందుకు ఈ "మృగ తృష్ణ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
భ్రమల నుండి వాస్తవంలోకి రావడమే ఈ న్యాయములోని ముఖ్య ఉద్దేశ్యం.
సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి