న్యాయములు-710
శోత్రియ విట న్యాయము
**"**
శ్రోత్రియుడు అనగా బ్రాహ్మణుడు. బ్రాహ్మణ్యం అనేది కుల సంకేత పదం కాదు.గుణ సంకేత పదము అంటారు మన పెద్దవాళ్ళు.ధార్మిక లక్షణాలు ధర్మ గుణ పరాయణులుగా ఎవరైతే ఉంటారో వారంతా బ్రాహ్మణులే అంటారు పెద్దలు.ఇక విట అనగా జారుడు,ఉపపతి, కాముకుడు అని అర్థము.
అయితే ఈ శ్రోత్రియుడను విషయంలో ఓ స్పష్టత ఇచ్చేందుకు కొంత ప్రయత్నం చేశారు.అదేమిటంటే ప్రతి మనిషి పుట్టుకతో శూద్రుడనీ,,ఉపనయన కాలంలో ద్విజుడనీ, విద్యాభ్యాసంలో విప్రుడనీ అంటూ ఈ మూడు రకాల లక్షణాలు, గుణాలు మిళితం అయితేనే అతడు శ్రోత్రియుడవుతాడు అని చెబుతుంటారు.
ఈ సందర్భంగా 1954లో ఇదే రోజున డిసెంబర్ 10 న విడుదల అయిన విప్రనారాయణ సినిమా గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం.
విప్రనారాయణ పన్నెండు మంది ఆళ్వారులలో ఒకడు.శ్రీరంగని భక్తుడు.పరమ నిష్ఠాగరిష్టుడైన పూజారి.అతడు నిత్యం శ్రీరంగనాథుని పూలదండలతో అలంకరించి పూజించి తరించే భక్తాగ్రగణ్యుడు.అలాంటి వాడు ఓ రోజు నర్తకి,వేశ్య అయిన దేవదేవి పెట్టిన నమస్కారాన్ని భక్తి పారవశ్యంలో మునిగి ఉన్న విప్రనారాయణ గమనించడు. దానితో అహం దెబ్బతిన్న ఆ దేవదేవి అంత గొప్ప భక్తుడైన విప్రనారాయణుడిని మార్చి తనకు దాసుడిగా చేసుకుంటుంది.ఆ తర్వాత అతడిపై దొంగతనం చేసినట్టు నేరం పడేలా చేసి రంగనాథుడు అతన్ని రక్షించి తనలో ఐక్యం చేసుకోవడం జరుగుతుంది.
అయితే ఇందులో ఇంత మంచి లక్షణాలు గుణాలు ఉండాల్సిన ఓ శోత్రియుడు తాను చెడిపోయి తప్పుదారి నడుస్తూ అనగా వెలయాలి దగ్గరకు వెళ్ళి గడుపుతున్న సమయంలో తన ఆచార వ్యవహారాలు గుర్తుకు తెచ్చుకుని ,తనతో కూడిన వెలయాలిని అవన్నీ పాటించమని ఒత్తిడి తీసుకొని రావడాన్ని "శ్రోత్రియ విట న్యాయము" అంటారు.
ఇక్కడ ఈ న్యాయములో రెండు భిన్నమైన కోణాలను గమనించవచ్చు.ఈ సమాజంలో ఎలా వుండాలి అనేది ప్రతి ఒక్కరికీ ఓ అంతర్వ్యూహం వుంటుంది.ఎవరూ వేలెత్తి చూపకుండా,తానేంటో తెలిసేలా నియమ నిష్ఠలతో జీవితాన్ని గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకోవడం సహజం.
కానీ కొంతమంది మాత్రం "చెప్పేవేమో శ్రీరంగ నీతులు దూరేవి..." ఇంకేవో అన్నట్లుగా వుంటాయి.పైగా మేం పాటిస్తున్నాం. మీరూ ఖచ్చితంగా పాటించాలి సుమా! అని చెబుతున్నట్టుగా ఉంటాయి.
అదిగో అలాంటిదే ఈ న్యాయము.ధర్మ సూక్తాలు వల్లించిన వ్యక్తి దైవ సంబంధమైన విషయాలను ఒంటపట్టించుకున్న మనిషి.అలా ఉండకుండా తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ వెలయాలి దగ్గరకు వెళ్ళాడు.అంతటితో ఆగకుండా ఆమెను తమ ఇళ్ళలోని ఆడువారిలా వుండమని, మడి కట్టుకొమ్మని అంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొని రావడం. మరి ఇదెలా సాధ్యమవుతుంది.
రెండు రకాల విరుద్ధ భావజాలం, జీవన నేపథ్యం కలిగిన ఇద్దరిలో ఒకరి దారి ఒకరు నడవాలంటే అందులో ఒకరి జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలి లేదా అలా ఒత్తిడి తెచ్చి యిబ్బంది పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించాలి.
కాబట్టి నీతీ నియమాలు పాటించని వ్యక్తి మాటలు ఎప్పుడూ పాటిగా వుండవు.ప్రభావితం చేయజాలవు. ఒక వేళ ఆ శ్రోత్రియుడే మంచి లక్షణాలు కలిగి వుంటే తన జీవితంలో ఒక్క వెలయాలినైనా మంచిగా మార్చాలని అనుకుంటే తన నియమ నిష్ఠలు ,భావజాలం తప్పకుండా ఆమెపై ప్రభావం చూపుతుంది.
దీని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏదైనా చేసేటప్పుడు త్రికరణ శుద్ధి ఉండాలి. అలాంటి దోష గుణాలకు దూరంగా ఉండాలి. మన అలవాట్లు, ప్రవర్తనే మనమంటే ఏమిటో ఈ సమాజం గుర్తించేలా చేస్తుంది . ఇదండీ "శ్రోత్ర విట న్యాయము" నుండి తెలుసుకోవలసిన నీతి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి